Skip to content

తప్పటడుగుల సమాజాన్ని హెచ్చరించిన “పోలీస్ వారి హెచ్చరిక “

అభ్యుదయ రచయిత, దర్శకులు కామ్రేడ్ బాబ్జీ గారి దర్శకత్వంలో ఈనెల 18న విడుదలై తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు, సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “పోలీస్ వారి హెచ్చరిక “.తులికా తనిష్క క్రియేషన్ బ్యానర్ పై మాజీ సైనికులు బెల్లీ జనార్దన్ గారు తొలిసారిగా సినీ రంగానికి పరిచయమై నిర్మించిన సినిమా ఇది.సహాయ నిర్మాతగా యన్.పి.సుబ్బారాయుడు గారు సహకరించారు. దర్శకత్వంతో పాటు సినిమాకు కథ, మాటలు,పాటలు బాబ్జీ గారే!. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటూ నేటి తరానికి అభ్యుదయ భావాన్ని ఈ సినిమా ద్వారా కూడా దర్శకులు పరిచయం చేశారని చెప్పాలి.

పోలీస్ వారి హెచ్చరిక సినిమా టైటిల్ మాత్రం సహజంగానే హెచ్చరిస్తుంది. కానీ బాబ్జీ గారి కలం నుండి వచ్చిన కథ,మాటల సంభాషణ మాత్రం సమాజంలో ఉన్న దోపిడీ,అవకాశవాదం, సామాజిక అసమానతను ఎలా? ఏ రూపంలో హెచ్చరించాయో అనేక కోణాల నుండి ఈ సినిమాలో చూపిస్తుంది. సహజంగా ప్రతి దర్శకులు తన సినిమాలో పాత్రకు న్యాయం చేయాలని చూస్తారు. కానీ బాబ్జీ గారు ఈ సినిమాలో పాత్రలను సమాజానికి ఇమిడింప చేశారు అని చెప్పాలి. ప్రతి పాత్ర మన మధ్యనే ఉంది కదా అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రతి పాత్ర సంభాషణ విలువలతో కూడినదిగా ఉన్నాయి. ఉదాహరణకు “ఈ రోడ్డు మానవ నాగరికతకు చిహ్నం” అని తెలిపే సంభాషణ ఉంది. ఇలాంటివి అనేకం.సమాజంలో ఉన్న మనుషుల పాత్రలచే ఈ సినిమాలో పలికించాయి. రాజకీయ,నేర వ్యవస్థ,చట్టాలు ప్రజలకు బాధ్యతగా తెలియజేసినాయి. ముఖ్యంగా సామాజిక కోణాన్ని చూపించే పాత్రలో హిజ్రాలను చూపించారు.దయ,జాలి లేని ఈ సమాజం పట్ల అనాధలు, అభాగ్యులు ఎటువైపు ప్రయాణిస్తున్నారో కొత్తకోనాన్ని ఈ సినిమాలో దర్శకులు ఆవిష్కరించారు. ఇప్పటివరకు హీరో హీరోయిన్ ల మధ్యనే ప్రేమలు పుట్టినాయి.పాటలు ఉన్నాయి. డ్యూయెటులు ఉంటాయి. కానీ ప్రేమ అనేది అందరి మధ్యన అనంతమైనదని అంటూ విలన్స్ మధ్య ప్రేమలు, పాటలు, డ్యూయోట్స్ క్రియేట్ చేసి చూపించారు బాబ్జీ గారు. ఈ సినిమాలో మరో క్రియేటింగ్ విషయం ఏమిటంటే మాటలు, పాటలు లేని, హీరోయిన్ అసలే లేని పోలీస్ డ్రెస్ లో ఉండే పిచ్చివాడి పాత్రలో హీరోను సినిమాకు నూతనంగా పరిచయం చేయడం కొత్తదనం. ఎప్పటిలాగే సినిమా రంగానికి కొత్త వారిని పరిచయం చేయడంతో పాటు కథకు అనుగుణంగా అగ్ర నటుల పాత్రలను పోషింప చేయడం సినిమాకు మరింత బలం చేకూర్పింప చేశారు. వేలాది ఫోక్ సాంగ్స్,సామాజిక పాటలకు ప్రాణం పోసిన గజ్వేల్ వేణు గారిని ఈ సినిమాకు సంగీత దర్శకులుగా నూతనంగా పరిచయం చేశారు బాబ్జి గారు.ఈ సినిమాకు మరోవైపు ప్రాణం పోసింది మ్యూజిక్ కూడా అని చెప్పాలి.

ఎందరో నేరస్తులను చట్టానికి పట్టించి తన పోలీసు ఉద్యోగానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం చే,ప్రజలచే ఎన్నో ప్రశంశాలు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ రామ్ సింగ్ పాత్రలో షయాజీ సిండే, తన భార్య పాత్రకు న్యాయం చేసిన “శంకరాభరణం” తులసి గార్లు చాలా చక్కగా నటించారు.సమాజం మెచ్చిన ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ తండ్రి. ప్రాణంగా ప్రేమించే తల్లి హంతకుల చేతిలో తన కళ్ళముందే హతం అయితే సూచి పిచ్చివాడై తండ్రి జ్ఞాపకంగా చిరిగిన పోలీసు డ్రెస్ లో తిరిగే భగత్ సింగ్ పాత్రలో పిచ్చివాడిగా నటించి జీవించాడు సన్నీ అఖిల్.(బాబ్జీ గారి తనయుడు సన్నీ అఖిల్) ఈ సినిమాలో మొదటిసారిగా హీరో పాత్రలో రంగ ప్రవేశం చేసిన పిచ్చివాడి పాత్రతో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు సన్నీ అఖిల్.

రౌడీయిజానికి బెదరని రియల్ ఎస్టేట్ వ్యాపారిగా శంకర్ గౌడ్ పాత్రలో రవి కాలే, నిజాయితీ పోలీసు ఆఫీసర్ పాత్రలో కాశీ విశ్వనాథ్,పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఆదర్శ భావాలు ఉండి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గా నిస్వార్ధంగా పాలనను అందించే సుందరయ్య పాత్రలో నిజాయితీని చాటిన శుభలేఖ సుధాకర్,పదవి వ్యామోహంతో తనకున్న అవకాశాలతో నేర సమాజాన్ని పెంచి పోషించే విలనిజాన్ని ప్రదర్శించే భరద్వాజ పాత్రలో బెల్లి జనార్ధన్,ప్రజలకు ఒక శాంతి మూర్తిగా కనిపిస్తూనే మరో పక్క అనాధలను చేరదీసి నేరపూరిత సమాజం వైపు నెట్టబడే సత్యమూర్తి పాత్రతో కొత్త గెటప్ లో కనిపించిన అజయ్ గోష్ చాలా చక్కగా నటించారు, చెత్త బుట్టలో ఒక అనాధగా పుట్టిన పసిపాపను మనసున్న మానవతావాది చేరదీస్తే గొప్ప పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో నేరస్తులకు వారి ఆగడాలకు సవాళ్లతో ఎదుర్కొనే కాంచన పాత్రలో లేడీ పోలీస్ టైగర్ గా కనిపించే వాహిని గార్లు వారి వారి పాత్రలను గొప్పగా పండించారు ఈ సినిమాలో.

ఇటీవల ఎక్కువగా తమిళ, మలయాళీ సినిమాలలో అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో అనిపిస్తున్న సామాజిక కోణం కన్నా ఈ సినిమాలో నూతనంగా హిజ్రాల జీవన విధానాల పై కొద్దిసేపైనా చూపించి అబురూబ్బ పరిచారు దర్శకులు. సమాజం వారి పుట్టుక పట్ల ఎలా ఆలోచిస్తుంది.నేరం, ఇతర వృత్తుల కోసమేనా వారి అస్సాంభావిత పుట్టుక అంటూ వారి మనోవేదనను చూపించి కంటతడి పెట్టింప చేశారు బాబ్జీ గారు.విలనిజం హిజ్ర గా చింతామణి పాత్రలో సంజయ్ నాయర్ గారిని కొత్త సింబల్ గా చూపారు.మరో హిజ్ర పాత్రలో జబర్దస్త్ వినోద్ పోషించి ఆలోచింపజేశారు.

రెండు నిమిషాల సుఖం కోసం కామందులు పిల్లలను కని చెత్తకుప్పలో,మురికి కాలువలో పడవేసిన పసికందులను ఎవరు చేరదీస్తారు?,సమాజంలో వీరి ప్రయాణం ఎటువైపు? అన్న కొత్త వారి పాత్రలతో మరో కొత్త కోణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. నలుగురు మగవారితో పాటు జ్యోతిలక్ష్మి పాత్రలో నటి హిమజ చాలా బాగా నటించింది.వీరితో పాటు కథలో పాత్రలకు,టెక్నికల్ వర్క్ కు కొత్త వారి ప్రయత్నం అద్భుతంగా శ్రమించింది కళ్ళు కనిపిస్తుంది.

ఇక బాబ్జీ గారు ఈ సినిమాలో ప్రజానాట్యమండలి కళాకారుడిగా బోస్ పాత్రలో కనిపించారు.తన మాటల,పాటల ద్వారా శ్రీ శ్రీ, జాషువా లాంటి ఎందరో అభ్యుదయ మహనీయులను ఈ సినిమా ద్వారా ఈ తరానికి పరిచయం చేశారు. కళాకారునిగా తన బృందంతో గ్రామాలలో పాటలు పాడుతూ,వీధి నాటకాలు వేస్తూ సమాజంలోని అసమానతలను, అన్యాలను,అక్రమాలను,దోపిడీ, దౌర్జన్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తారు. బోసు నగరంలో జరుగుతున్న వరుస హత్యలను ఎలా ప్రశ్నించాడు.అసలు బోసు ఏమైనడు అన్నది కూడా కథలో భాగంగా సినిమా కొనసాగుతుంది.

సమాజంలో అనాధజీవుల ప్రయాణం ఎటువైపు!. వ్యవస్థ పట్ల బాధ్యత కలిగిన మహనీయులు మానవత దృక్పథంతో వారిని చేరదీస్తే ఉన్నతమైన స్థానాలకు చేరుకోని సమాజ మార్పుకు తనదైన పాత్ర పోషిస్తారు. అదే మానవతా శిబిరాలకు దూరమయ్యే అనాథలు సమాజంలోని దుష్టశక్తుల ప్రాంగణాలకు చేరుకుంటారు. ఇలాంటి అంశాన్ని జోడించి ఒక సామాజిక మార్పు కోసం తీసిన సినిమాగా “పోలీస్ వారి హెచ్చరిక ” ఉంది. మన చుట్టూ ఉన్న తప్పటడుగుల సమాజాన్ని హెచ్చరిస్తుంది కూడా ఈ “పోలీసువారి హెచ్చరిక ” అని చెప్పవచ్చు.అసమానతలను హెచ్చరించడం, రూపుమాపడం, వాటిపై ఏదో రకంగా పోరాటం చేయటం నేటికి ఇంకా అవసరం అవుతుంది. అలాంటి అవసరాన్ని పెంపొందించే సాంస్కృతిక భావాలు కలిగిన కథలతో కూడిన సినిమాలు మరిన్ని ప్రజల ముందుకు రావాలి.అలాంటి భావాలతో ప్రజలకు మరింత చేరువయే సాధనంగా ఈ “పోలీస్ వారి హెచ్చరిక” సినిమా ఉందని చెప్పాలి. అందుకే అందరూ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది.