మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
పరిచయం నుంచి పుత్రబంధం వరకు.. గార సత్యం గారి గురించి కాదంబరి కిరణ్ జ్ఞాపకాల తడి

గార సత్యం గారు మొదట సహసభ్యుడిగా పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా కుటుంబ బంధంగా మారింది. నాపై ఆయన చూపిన నమ్మకం, ప్రేమ, వాత్సల్యం అంతా వర్ణించలేనివి. నన్ను దేవుడిచ్చిన పుత్రుడిలా భావించారు. ఎన్నో ఏళ్లుగా మా బంధం అలాగే కొనసాగింది.
ఏదో సందర్భం తీసుకుని వారి ఇంటికి వెళ్లి ఒక మొక్క, ఒక చెక్కు ఇచ్చి వచ్చేవాడిని. పిల్లలు లేరనే బాధను తగ్గించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించేవాడిని. “నాకేమైనా అయితే ‘మనంసైతం’ కాదంబరి ఉన్నాడు” అని నమ్మకం పెంచుకున్నారు.
కష్టంగా అనిపించినప్పుడల్లా ఫోన్ చేసి –
“ఈ సినిమాలో నా పాత్ర అయిపోయేలా ఉంది సర్” అని చెప్పేవారు.
కొన్నేళ్ల తర్వాత ఆయన భార్య చనిపోయారు. (ఆమెను సత్యం గారికి గర్ల్‌ఫ్రెండ్ అని నేను సరదాగా ఆటపట్టించేవాడిని).
ఆ ఘటన తర్వాత ఆయన ఆరోగ్యపరంగా మరింత బలహీనమయ్యారు. వయస్సు ప్రభావం, స్వభావం కలిసి ఆయనను మరింత మృదువుగా మార్చాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్నాయి.
కొన్ని రోజుల తర్వాత Bnim గారి చొరవతో, ఆయన అన్నయ్య, కొంతమంది సన్నిహితులు, రాజీవ్ కనకాల వంటి సహృదయుల సహకారంతో సత్యం గారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పంపించాం. అది నిజంగా ఆయన ప్రాణాన్ని కాపాడినట్టే అయింది.
“నేను వెళ్లను… వేరే గది కావాలి” అని కొంతసేపు ఆ పిల్లాడిలా మారం చేసుకున్నా, చివరికి “నేను కొడుకునికదా” అన్న నా మాటను విని నిశ్శబ్దంగా ఒప్పుకున్నారు.
వారం తర్వాత ఆయన ఫోన్ చేసి –
“జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పుదామని చేశా సర్” అన్న మాట విని నాకు పండగలా అనిపించింది.
కొన్ని రోజులు బాగానే ఉన్నా… చివరికి పాత్ర ముగించాల్సిందే కదా!
ఒకరోజు Bnim గారి ఫోన్ – “సత్యం గారు చనిపోయారు” అన్న వార్త.
కొడుకులా అనుకున్నందుకు ఆయనను దగ్గరుండి సాగనంపి నా బాధ్యతను తీర్చుకున్నాను. (ఇది కూడా ఈశ్వరేచ్ఛే – షూటింగ్ క్యాన్సిల్ అయి నేను ఇంట్లోనే ఉన్నాను).
“సత్యం గారు, అక్కడ మీకోసం మీ గర్ల్‌ఫ్రెండ్ ఎదురుచూస్తోంది… కలిసారా? కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయండి…”
ఈ కష్టకాలంలో తలో అడుగు వేసి సాయం చేసిన సర్వశ్రీ Bnim, B.N. శర్మ, హరిబాబు, రేలంగి నరసింహారావు, కొల్లి రాంగోపాల్, శ్రీనివాస్, ప్రభాకర్, దర్శకుల సంఘం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏻.
రాజీవ్, Bnim గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻.
