Skip to content

ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు ఫిష్‌ వెంకట్‌(53) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సుమారు 10గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఫిష్‌ వెంకట్‌ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్‌. ముషీరాబాద్‌ మార్కెట్లో చేపల వ్యాపారం చేయడంతో ఆయన ఫిష్‌ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘సమ్మక్క సారక్క’(2000) చిత్రం ద్వారా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వెంకట్‌. ఆ తర్వాత ‘ఖుషి, ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, యోగి, కృష్ణ, అదుర్స్, రచ్చ, గబ్బర్‌ సింగ్, డీజే టిల్లు’ వంటి పలు సినిమాల్లో నటించారు. ‘మదరాసి’, ‘సిరుతై’ వంటి తమిళ చిత్రాల్లోనూ నటించారాయన. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హాస్య నటుడిగా దాదాపు 100కు పైగా సినిమాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఫిష్‌ వెంకట్‌ మృత పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు