Skip to content

ఐఎఫ్ డబ్ల్యూజే స్పూర్తితో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం

హైదరాబాద్ లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడిన ఘన చరిత్ర ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) సంఘానిదే అని పలువురు వక్తలు అన్నారు. ఈ సంఘం దేశంలోనే మొటమొదటి జర్నలిస్టు సంఘం అని వారన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వజ్రోత్సవ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం,ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు చిర్రా శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొట్లపల్లి అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం గత 75 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై చేస్తున్న పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… ఐఎఫ్ డబ్ల్యూజే దేశంలోనే తొలి జర్నలిస్టు యూనియన్ అని 1950 అక్టోబర్ 28న ట్రేడ్ యూనియన్ గా ఏర్పడిందని అన్నారు. దేశవ్యాపితంగా 30 వేలకు పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని, దేశంలోనే 28 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, నేపాల్, భూటాన్ తదితర పొరుగు దేశాల జర్నలిస్టు సంఘాలతో సంబంధాలు కలిగి జర్నలిస్టుల సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా పోరాటాలు చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ఐఎఫ్ డబ్ల్యూజే కొన్ని ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నదని, ప్రధానంగా జర్నలిస్టుల రక్షణ చట్టం, జర్నలిస్టులకు అవసరమైన సంక్షేమ పథకాలు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం వంటి డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తుందని అన్నారు. అమలు చేయాలి. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతను కొనసాగిస్తూ కనీస వేతనం కోసం వేజ్ బోర్డు అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులను అందించి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులలో జర్నలిస్టులకు వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్ డబ్ల్యూజే స్పూర్తితో డిమాండ్ల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఫెడరేషన్ నాయకులు పాండురంగారావు, బొల్లం శ్రీనివాస్,నాగవాణి, శ్రీనివాస్ గౌడ్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.