Skip to content

పర్సంటేజ్ సమస్యను హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సమంజసం కాదు * టికెట్ ధరలు పెంచి సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని దూరం చేయొద్దు * కోట్లు పెట్టాం, ఐదేళ్లు తీశామని చెబితే ప్రేక్షకుడు థియేటర్ ఎందుకు వస్తాడు -ఆర్. నారాయణమూర్తి

ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కుట్ర కోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ….

* రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించారు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరిట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు ప్రకటించడం నాకు మాములు ఆనందంగా లేదు. చాలా హ్యాపీ. ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆయన టీమ్ కు నా నమస్కారాలు. అలాగే అవార్డు గ్రహీతలకు నా అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానైతే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నంది అవార్డులు కూడా మన చంద్రబాబునాయుడు అక్కడ ప్రకటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.

* పర్సంటేజి అంశాన్ని హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సరికాదు

ఇటీవల సినీ పరిశ్రమలో పర్సంటేజి విధానం కావాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ లో చర్చల జరుగుతున్నాయి. ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినీ పరిశ్రమలో పర్సంటేజి సిస్టమ్ వస్తుందా అని ఎదురుచూస్తున్ దశలో… నా లాంటి సగటు నిర్మాతలందరికి తీరని విఘాతం జరిగింది. పర్సంటేజి ఇవ్వకపోతే హరిహర వీరమల్లు అనే సినిమాను ఆపడం కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ ప్రకటిస్తున్నారనే మాట రావడం చాలా దుర్మార్గం. అదంతా ఉత్తదే. అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్ర దారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా… ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమ యొక్క పాలన సంస్థలు. ఆ రెండు సంస్థలు ఎప్పుడు బంద్ ప్రకటిస్తామని ఎప్పుడు చెప్పలేదు. డిస్కన్షన్ ఆన్ గోయింగ్ అని చెప్పారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్తం. ఎవరైనా సినీ పరిశ్రమలో బంద్ ప్రకటించే ముందు నిబంధనల ప్రకారం మూడు వారాల ముందుగా తెలియజేయాలి. ఒక సమస్య మీద మేం పోరాడుతున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి మేం బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియజేయాలేది నిబంధన. మూడు వారాల ముందు తెలియజేస్తే విడుదల తేదీ ప్రకటించుకున్నవాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. జూన్ 1న బంద్ ప్రకటిస్తే ఒకవేళ… జూన్ 12 అంటే రెండు వారాలు కూడా కావు కదా. ఏ రకంగా హరిహర వీరమల్లుకు బంద్ వర్తిస్తుంది. అది కరెక్ట్ కాదు.

* అలా చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ను మరింత గౌరవించేవాళ్లం

పవన్ కళ్యాణ్ మీద ఎవరు కుట్ర పన్నుతారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ ను తలుచుకుంటూ ఎంత గర్విస్తామో అదే స్థాయిలో జనసేన పార్టీ పెట్టి ఇవాళ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ను చూస్తే చిత్ర పరిశ్రమ అంత గర్విస్తుంది. హ్యాట్సాప్ టూ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తించుకున్న చంద్రబాబునాయుడిగారికి సెల్యూట్. మేం పవన్ కళ్యాణ్ పై ఏ రకంగా వ్యతిరేకులం కాం. కానీ పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన రావడం సరైంది కాదు. ఒకే వచ్చిందనుకోండి. ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్న మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేసుకోవాలి. ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అక్కడి సీఎం చంద్రబాబుతో మాట్లాడి హరిహర వీరమల్లు టాఫిక్ మీరు ఎత్తకుండా సినీ పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు చర్చించుకుందాం రావాలని పిలవాల్సింది. పెద్దన్న రోల్ పోషించి ఉంటే చలన చిత్ర పరిశ్రమ ఫ్రెండ్ గా మేం మరింత గౌరవించేవాళ్లం. ఎంత బాగుంటుంది సర్. పవన్ కల్యాణ్ సర్. ఆ పని చేయండి సర్.

* 25 ఏళ్లుగా రగులుతున్న రావణకాష్టం… పర్సంటేజి సమస్య.

పర్సంటేజ్ సిస్టమ్ వల్ల సినీ పరిశ్రమకు చాలా మేలు జరుగుతుంది. ఆ విధానం లేకపోవడం వల్ల సగటు నిర్మాత తీవ్రంగా నష్టపోతున్నాడు. మాల్స్, మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లకు ఉనికి లేకుండా పోతుంది. తెలంగాణలో 500 ఉన్న థియేటర్లు ఇవాళ 200కు పడిపోయాయి. ఆంధ్రాలో 500కుపైగా ఉన్న సింగిల్ థియేటర్లు 300కు తగ్గాయి. సింగిల్ థియేటర్లు లేకపోతే ప్రేక్షకుల పరిస్థితి ఏంటీ. మాల్స్ ఇవాళ థియేటర్లు ఎంతున్నాయి. ఎంత బీభత్సమైన ధరలున్నాయో ఆలోచించాలి. పాప్ కార్న్ తింటే 500 రూపాయలా, డ్రింక్ తాగితే 200 రూపాయలా. ఇలా అయితే సగటు ప్రేక్షకులు ఎలా సినిమా చూడగలుగుతాడు. ఏరకంగా ఇవాళ సినిమా థియేటర్లకు వెళ్తారు. భారతదేశంలో సినీమా అనేది సామాన్య ప్రేక్షకుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తున్నాయి ఈ విధానాలు. సింగిల్ థియేటర్లను బతికించుకోవాలి. దానికి పర్సంటేజ్ విధానం కావాలి. పర్సంటేజ్ విధానం ఇవాళ్టి సమస్య కాదు. 25 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఈ పర్సంటేజ్ విధానం కావాలని కోరిన వాళ్లలో నేను కూడా ఒకణ్ని. ఆ రోజుల్లో సి.కళ్యాణ్, కిరణ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అడిగాం. సమస్య పరిష్కారం కాలేదు. ఇదే ఫిల్మ్ ఛాంబర్ ముందు టెంటు వేశాం. సురేందర్ రెడ్డి గారు, నట్టికుమార్ గారు, మోహన్ గారు, బెక్కం వేణుగోపాల్ గారు సహా ఎంతో మంది ఆదిశేషగిరిరావు, కె.ఎస్. రామారావు గారు, చదలవాడ శ్రీనివాస్ రావు గారు, అచ్చిరెడ్డిగారు, కృష్ణారెడ్డి గారు సంఘీభావం ప్రకటించారు. అయినా ఏమీ కాలేదు. నేను స్వయంగా వెళ్లి రామానాయుడిగారిని అభ్యర్థించా. నారాయణమూర్తి… పర్సంటేజి సిస్టమ్ కావాలి.లీజ్ సిస్టమ్ ఉండకూడదు, రెంటల్ సిస్టమ్ ఉండకూడదు, నేను సురేష్ బాబుతో మాట్లాడుతాను, నేను మీతో ఉంటాను అని చెప్పారు రామానాయుడుగారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం. అందరం కలిసి చర్చింకుందాం. ఏది మంచో అదే చేద్దాం అన్నారు ఆయన. అయినా పర్సంటేజ్ విధానం అమల్లోకి రాలేదు. సునీల్ నారంగ్ గారిని అడిగాం. అందరం ఏం చేస్తే అదే చేస్తాం అన్నాడాయన. ఆ తర్వాత దిల్ రాజు గారిని అడిగాం. దిల్ రాజు పర్సంటేజ్ విధానానికి ఒప్పుకున్నారు. అయినా ఫలప్రదం కాలేదు. మహానుభావుడు, మా గురువుగారు దాసరి నారాయణరావు గారి ఇంట్లో కేఎస్ రామారావు గారు, తమ్మారెడ్డి భరద్వాజగారు, సి.కళ్యాణ్ గారు అందరం సమావేశమయ్యాం. అప్పటి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వీఎన్ఆర్ నాగేశ్వర్ రావుగారి సమక్షంలో చర్చించాం. అక్యుపెన్సీ పర్సంటేజ్ అని కొందరు, 50-50 అని కొందరు రకరకాలుగా మాట్లాడారు. ఈ అంశాన్ని తప్పకుండా తేలుద్దాం. పర్సంటేజి సిస్టమ్ పెట్టడానికి దాసరి నారాయణరావుగారు ఒప్పుకున్నారు. అయినా అమల్లోకి రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు పరిశ్రమ పెద్ద చిరంజీవిగారి దగ్గరకు వెళ్లాం. విజ్ఞప్తి చేశాం. టికెట్ ధరలు పెంచవద్దని, పర్సంటేజి విధానాన్ని అమలు చేయాలని అడిగితే చిరంజీవి గారు కృషి చేశారు. అయినా ఫలప్రదం కాలేదు. ఇది చాలా పెద్ద సమస్య. 25 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. అలాంటిది ఇవాళ పర్సంటేజి సిస్టమ్ కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సమంజసంగా లేదు. పర్సంటేజ్ సమస్యను పక్కదారి పట్టించారు. హరిహర వీరమల్లును ఫోకస్ చేశారు.

* పవన్ కళ్యాణ్… అది మీ వల్లే సాధ్యమవుతుంది

పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సినీ పరిశ్రమ పెద్దలు సీఎంను కలిసి పలకరించవచ్చు కదా అని అడిగారు. మర్యాద పూర్వకంగా కలవొచ్చు కదా అని అడిగారు. వారు అడిగినట్లు కలువాలి. కలుస్తాం. పూర్వకాలంలోప్రజలకు ఏదైనా సమస్య వస్తే ధర్మగంట కొడితే రాజుల దగ్గరికి వెళ్లేవాళ్లు. దానికంటే ముందే రాజులే ప్రజల దగ్గరకు వెళ్లే వాళ్లు. రచ్చబండ పెట్టేవాళ్లు. ప్రజలకు ఏం సమస్యలున్నాయో చెప్పాలని అడిగేవాళ్లు. అక్కడిక్కడే తీర్పులు చెప్పేవాళ్లు. సమస్యలకు పరిష్కారం చూపేవాళ్లు. ప్రజలకు మేలు చేసేవాళ్లు. మా ఊరికి చెరువు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి అని రకరకాలుగా అడిగేవాళ్లు. అలాగా మీ మంత్రులు కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు సినీ పరిశ్రమను పిలిచి మీకు ఏం సమస్యలున్నాయి, మీకేం చేయాలి అని అడిగితే మేం చాలా ఆనందపడేవాళ్లం. మేం మీ బిడ్డలం. మేం మీకు ఓట్లు వేసినోళ్లం. మిమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టినోళ్లం. మా బాధ్యత చూసుకోవాల్సింది మీరే. అదే సమయంలో ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మాకుంది. పర్సంటేజి విధానాన్ని పక్కకు పెట్టొద్దు. అన్ని మల్టీప్లెక్స్ లో 50-50 శాతం కొనసాగుతుంది. కార్పొరేట్ సంస్థలకు 50-50 శాతం వసూలు చేస్తున్నాయి. మరి సింగిల్ థియేటర్లకు ఏమైంది. సింగిల్ థియేటర్లు వాళ్లు మనోళ్లు, ఇక్కడోళ్లు. సినిమా అంటే అభిరుచితో థియేటర్లు కట్టుకున్నవాళ్లు. సినిమా తల్లినే నమ్ముకున్నవాళ్లు. సినిమా థియేటర్ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అవుతున్నాయి, ఎన్ని దేవాలయాలు ఇవాళ మూతపడిపోతున్నాయి. విధానంలో లోపాలే ఇందుకు కారణం. చినచేపను పెద్ద చాప… చినమాయను పెద మాయ పింగళి నాగేంద్రగారు మాయాబజార్ లో చెప్పినట్లుగా కార్పొరేట్ శక్తులు థియేటర్లను ఆక్రమించేస్తున్నాయి. పర్సంటేజ్ విధానం ఉంటేనే చిన్న నిర్మాతలు, థియేటర్ల యజమానులు బాగుంటారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేసేలా కృషి చేయండి. అది ఎలా చేస్తే బాగుంటుందో సమావేశం పెట్టి ఆలోచన చేసి అమలు చేయండి. అది మీ వల్లే అవుతుంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ లు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా సరే 25 ఏళ్లుగా రావణ కాష్టంలా కాలుతున్న పర్సంటేజ్ సమస్యను పక్కకు పోనివ్వకుండా, దాన్ని పక్కదారి పట్టకుండా అమలు చేసి సగటు నిర్మాతను బతికించాలి. అప్పుడే మన సినిమాలను జనాలు చూస్తారు. లేకపోతే ఓటీటీలో చూస్తారు. బడుగు బలహీన వర్గాలు వేల రూపాయలు పెట్టి సినిమాలకు రావాలంటే ఎక్కడొస్తారు. ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకుంటారు. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయి, సక్సెస్ రేట్ ఎంత తగ్గిందండి. సినిమా బతకాలన్నా, పరిశ్రమ బతకాలన్నా 80 శాతం పర్సంటేజ్ విధానం రావాలి. దీనికోసం ప్రభుత్వాన్ని కలువాలి. ప్రభుత్వమే కలుస్తామంటే అంతకంటే ఆనందం మరోటి ఉండదు. మీరు వెళ్లండి, కలవండి, మన డిమాండ్స్ చెప్పండి.

* నేల, బెంచ్, కుర్చీలు ఎక్కడ?

1961 తర్వాత భారతదేశంలో ప్రజల తలసరి ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను బట్టి కమిటీలు వేసి అప్పటి ప్రభుత్వాలు టికెట్ ధరలు నిర్ణయించాయి. నేల, బెంచ్, కుర్చీ, బాల్కనిగా విభజించి ధరలు నిర్ణయించారు. ఇవాళ నేల లేదు, బెంచ్ లేదు ఒకటే క్లాస్ లేదంటే రెండు క్లాస్ లు మాత్రమే. థియేటర్లను అలా చేసేశారు. సిస్టమ్ ప్రకారం ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే ఆ ధరలను అందరు గౌరవించాలి. ఈ మధ్యకాలంలో భారీ చిత్రాలు తీసే నిర్మాతలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. వారందరికి నా సెల్యూట్. వాళ్లకు డబ్బుంది, పెడుతున్నారు, సంతోషం. కానీ అలా పెట్టే నిర్మాతలు చాలా మంది ఏం చేస్తున్నారంటే… మా సినిమాకు చాలా ఖర్చైంది కాబట్టి విడుదలకు ముందు టికెట్ ధరలు పెంచితే మేం లాభపడతామని అనుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వాటిని ఆమోదించడం వల్ల సగటు చిత్రాలకు, సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు తీరని నష్టం జరుగుతోంది. డబ్బు ఎంత మంది దగ్గరుంటుంది. పేద వాడు, డబ్బున్నవాడు ఇద్దరు సినిమా చూడాలనుకుంటారు. డబ్బులున్నవాళ్లు హ్యాపీగా సినిమా చూస్తారు. పేదవాడు అప్పు చేసి సినిమా చూడాల్సి వస్తోంది. కనీసం 1000 నుంచి 1500 ఉంటే కానీ ఇవాళ సినిమా చూడలేకపోతున్నారు. సగటు ప్రేక్షకుడికి చవకగా దొరికే సినిమా ఇవాళ చాలా ఖరీదుగా మారింది. అదేం ధర్మం చెప్పండి. ఇదేం సంక్షేమ రాజ్యం చెప్పండి. మీరు భారీ బడ్జెట్లు పెడుతున్నారు, పెట్టుకోండి. గొప్పగా తీస్తున్నారు మేం గర్విస్తున్నాం. ప్రేక్షకుడికి అవన్నీ అవసరం లేదు. సినిమా బాగుందా లేదా అనేదే కావాలి. సినిమా బాగుంటే చూస్తాడు లేకపోతే లేదు. భారీ సినిమాలు తీస్తున్నాం కదా అని ప్రేక్షకుడి మీద రుద్దితే ఎలా. హాలీవుడ్ లో 10 కామాండ్ మెంట్స్ వేలాది కోట్లు పెట్టి సినిమాలు తీశారు. బెనహార్ వేలాది కోట్లు పెట్టి సినిమాలు తీశారు. రెండు సినిమాలు కూడా బీభత్సమైన హిట్స్. ఆ సినిమాలకు ఆ రోజుల్లోనే కోట్లు కోట్లు ఖర్చైతే డబ్బు కూడా అదే రకంగా వచ్చింది. గూడ్స్ రైళ్లలో డబ్బులు లాభాలుగా తీసుకెళ్లారు. కోట్లు పెట్టి తీశాం కదా అని టికెట్ ధరలు పెంచలేదు. హిందీలో మొఘల్ ఏ ఆజాం, షోలే చిత్రాలు కూడా భారీ బడ్జెట్లు. అప్పుడు టికెట్ ధరలు ఎంతున్నాయో ఆ ధరలకే సినిమాలు విడుదల చేశారు. లారీల్లో లాభాలు తీసుకెళ్లారు. మన లవకుశకు వద్దాం. శంకర్ రెడ్డి గారు ఐదేళ్లు తీశారు. ఖర్చైపోయిందని టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా రిలీజ్ అయింది. ఐదేళ్లు ఆడింది సినిమా. ఇప్పటి దాకా లవకుశను మించిన సినిమా తెలుగు ఇండస్ట్రీలో లేదు. అప్పుడు ఏ ధరలున్నాయో ఆ ధరలోనే ఆ సినిమా విడుదలై ఐదేళ్లు ఆడింది. ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి. సినిమా బాగుంటే జనాలు వస్తారు. ధరలు పెంచుకుంటూ వారం రోజులు ఇలా ఉంటుంది, మరో వారం రోజులు అలా ఉంటుంది అంటే కుదరదు.

* ఆటో డ్రైవర్ తమ్ముడో ఏమన్నాడో తెలుసా….?

నేను ఆటోల్లో ప్రయాణిస్తుంటా. ఓ రోజు తమ్ముడు ఫలానా సినిమా చూశావా అని ఆటో డ్రైవర్ ను అడిగా. దానికి ఆ డ్రైవర్ తమ్ముడు ఏమన్నాడంటే… ” సినిమా చూడాలని ఉంది. కానీ టికెట్ ధరలు చాలా ధరలు పెంచారు. ఆ సినిమా హీరో ఫేవరేట్ . నా దగ్గర డబ్బుల్లేవ్, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది. చూడలేకపోతున్నాను ” అన్నాడు.

* మనది సంక్షేమ రాజ్యం

టికెట్ ధరలు పెంచితే సినిమాకు ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఎందుకు ధరలు పెంచుతారు. మన సిస్టమ్ ను, నిబంధనలను గౌరవించాలి. అన్నింటికి మించి మనది సంక్షేమ రాజ్యం. సగటు ప్రేక్షకుడికి భారతదేశంలో సినిమానే వినోదం. ఆ వినోదాన్ని ఈ రకంగా దూరం చేయొద్దు. భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు టికెట్ ధరల పేరుతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. వారిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అది సరైన పద్దతి కాదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబునాయుడు గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని నా విజ్ఞప్తి.