Skip to content

జూలై 3న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల

సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం.

క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రతి ఫ్రేమ్‌ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది చిత్ర బృందం.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగు గీతాలకు విశేష స్పందన లభించింది. ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తార తార’ గీతాలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను మెప్పించాయి.

బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ‘హరి హర వీరమల్లు’లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్