Skip to content

‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ‘టాక్సిక్’ టీం ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను
జె.జె. పెర్రీని రంగంలోకి దించారు. హాలీవుడ్ టీంతో ఇప్పటి వరకు ‘టాక్సిక్’లో అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్స్‌లను జె.జె. పెర్రీ చిత్రీకరించారు.

ఇప్పుడు జె.జె. పెర్రీ ఇండియన్ స్టంట్ టీంని తీసుకుని ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘమైన షెడ్యూల్‌లో కేవలం ఇండియన్ స్టంట్ టీం మాత్రమే పని చేయనుంది. ఇండియన్ స్టంట్ టీం టాలెంట్ చూసి అబ్బురపడిన జె.జె. పెర్రీ తన టీంను పక్కన పెట్టారట. ఇంత వరకు హాలీవుడ్ టీంతోనే జె.జె. పెర్రీ పని చేయగా.. ఇప్పుడు ‘టాక్సిక్’ కోసం ఇండియన్ స్టంట్ టీంను తీసుకున్నారు.

ఈ మేరకు జె.జె. పెర్రీ మాట్లాడుతూ.. ‘ఈ ఇండియన్ స్టంట్ టీం వర్డల్ క్లాస్‌గా ఉంది. అందుకే నేను వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. మేము ప్రస్తుతం ఒక కీలక సన్నివేశాన్ని చిత్రీకరించబోతోన్నాం. ఈ షెడ్యూల్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూశాను. ఇది ఒక సవాల్‌లాంటిది. నాకు ఇలాంటి ఛాలెంజ్‌లు అంటే చాలా ఇష్టం. ఈ టీంతో కలిసి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాను. మేమంతా కలిసి సరిహద్దుల్ని చెరిపేసేలా అంతర్జాతీయ స్థాయిలో ‘టాక్సిక్’ను రూపొందిస్తాం.

‘నేను నా 35 ఏళ్ల కెరీర్‌లో 39 దేశాల్లో పని చేశాను. నేను ఇండియన్ మూవీస్‌కు పెద్ద అభిమానిని. ఇండియన్ చిత్రాలు ఎంతో క్రియేటివ్‌గా, ఆర్టిస్ట్‌గా, బోల్డ్‌గా ఉంటాయి. యశ్, గీతూ మోహన్ దాస్, వెంకట్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గీతూకి చాలా గొప్ప విజన్ ఉంది. సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి నుంచి ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ టీం ఇలా అందరూ అద్భుతంగా పని చేస్తున్నారు.

‘భారతీయ సంస్కృతి, నాగరికత ఎంతో గొప్పది. మా అమెరికన్ కల్చర్ కేవలం కొన్ని వందల ఏళ్ల క్రితానికి సంబంధించినదే. అలాంటి నేను ఇక్కడకు వచ్చి భారతీయ సినిమాని ప్రపంచస్థాయికి తీసుకువచ్చేలా సినిమాను తీసేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. నేను ఇది వరకు క్రియేట్ చేసిన దాని కంటే.. చాలా కొత్తగా, వినూత్నంగా ఉండేలా ప్రయత్నిస్తున్నాను. ‘టాక్సిక్’ టీమ్ నాకు కొత్తగా ప్రయత్నించేందుకు అన్ని రకాల అవకాశాల్ని ఇచ్చింది’ అని అన్నారు.

ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ ఓ మైలురాయిగా నిలవనుంది. కన్నడ, ఆంగ్లంలో ఒకేసారి చిత్రీకరిస్తున్న మొట్టమొదటి హై బడ్జెట్‌ ద్విభాషా చిత్రం ‘టాక్సిక్’. ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా ఇతర భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా వరల్డ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ మూవీగా ‘టాక్సిక్’ రూపొందుతోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అందరినీ అబ్బురపరిచేలా భారీ బడ్జెట్‌తో ప్రపంచ స్థాయి చిత్రంగా రానుంది. ఈ మూవీ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.