Skip to content

‘పెద్ది’ని టార్గెట్ చేయొద్దు

‘పెద్ది’ని టార్గెట్ చేయొద్దు Telugu News

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడదాం

ఒకవేళ ‘పెద్ది’కి అడ్డొస్తే ఆమరణ దీక్షకు సిద్ధం: నట్టి కుమార్

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా రిలీజ్ కు సిద్దమైన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమస్యలు సృష్టించడం ఎంతమాత్రం సరి కాదని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “కావాలని ‘పెద్ది’ సినిమా రిలీజ్ సమయంలోనే ఎగ్జిబిటర్స్ కు తమ సమస్యలు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి సింగిల్ థియేటర్స్ యజమానులు రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వాటిని చర్చల ద్వారా సమంజసమైన రీతిలో పరిష్కరించుకోవాలి. ఇటీవల ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ విధానం అమలు పరచాలంటూ చేసిన డిమాండ్ పై సమస్య పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే అందుకు అంగీకరించి, ఇప్పుడు ఉన్నట్లుండి మాట మార్చి, ‘పెద్ది’ సినిమాకు అడ్డుపడటం ఎంతవరకు కరెక్ట్ అన్నది మరోమారు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ‘పెద్ది’ సినిమాకు సహకరిస్తే తప్పకుండా తాను తగిన సమయంలో కొంతమంది సభ్యులను చిరంజీవి వద్దకు తీసుకుని వెళ్లి, ఎగ్జిబిటర్స్ సమస్యలను తెలియజేసేలా కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాల ఎగ్జిబిటర్స్ పెద్ది సినిమాకు ఎలాంటి సమస్యలు సృష్టించకుండా సహకరిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అర్థం చేసుకుని, ఒక పెద్ద సినిమా రిలీజ్ సమయంలో సహకారం అందించాలి. శనివారం ప్రెస్ మీట్ లో కూర్చున్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ లో తమ థియేటర్స్ ను లీజ్ కు ఇచ్చిన వారు, లీజ్ కు తీసుకున్న వారు కావడం గమనార్హం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన ప్రెసిడెంట్ శేఖర్ తన థియేటర్ ను సునీల్ నారంగ్ కు లీజ్ కు ఇచ్చారు. అలాగే బాల గోవింద్ రాజు తన థియేటర్ కు ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకున్నారు. వీరి వెనుక సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి నలుగురు ఉన్నారు. ఈ నలుగురే లీజ్ థియేటర్స్ ను నడుపుతున్నారు. వీరే దీని వెనుక చక్రం తిప్పుతున్నారు. మంగళవారం రాత్రి లోగా ‘పెద్ది’ సినిమాకు అడ్డు రాకుండా నిర్ణయం జరిగితే ఆనందదాయకమే. లేకుంటే బుధవారం నుంచి నేను ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను” అని చెప్పుకొచ్చారు.