Skip to content

*సోషియోఫాంటసీగా “దీర్ఘాయుష్మాన్ భవ”*

ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ ప్రేమకథతో సినిమాగా “దీర్ఘాయుష్మాన్ భవ” చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లు. ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు.

సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ కథాశంతో రెండున్నర గంటలపాటు ప్రీక్షకులను అలరింపజేసే వినోదంతో ఈ చిత్రాన్ని మలచడం జరిగిందని ఆయన చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చాం. ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుందని అన్నారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు. .

దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని పాత్రలలో ఎవరికి వారు పోటీపడి నటించారు. జబర్దస్త్ ఆర్టిస్టుల కామెడీ ఆద్యంతం నవ్వుల పూలు పూయిస్తుంది. హీరో, హీరోయిన్లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. సీనియర్ నటి ఆమని నటన ఓ హైలైట్. మొత్తం మీద ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఆ విషయంలో మా టీమ్ సక్సెస్ అయినట్లు నమ్మకంగా చెప్పగలం” అని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో ఆమని, నాగినీడు ,కాశీ విశ్వనాధ్, పృథ్వీరాజ్‌, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్. జె మిని సురేష్‌, నోయల్, గుండు సుదర్శన్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు మల్హర్ భట్ జోష్ ఛాయాగ్రహణం సమకూర్చగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని, కిషోర్ మద్దాలి ఎడిటింగ్ అందించారు. నిర్మాత: వంకాయలపాటి మురళీకృష్ణ, దర్శకత్వం:: ఎం.పూర్ణానంద్.