Skip to content

ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!!

ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!! Telugu News

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ వారం చిన్న సినిమాల హ‌వా నెల‌కొంది. ఒక‌వైపు శివాజీ న‌టించిన ‘సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని’, శ్రీవిష్ణు న‌టించిన ‘మృత్యుంజ‌య్’ చిత్రాలు నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వీటితో మరో చిత్రం నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌, తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎస్‌.సరస్వతి’. సైకలాజికల్‌ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర‌కాశ్ రాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా.. జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి, కిషోర్, సప్తగిరి, శ్రీకాంత్‌ అయ్యంగార్, తులసీ, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అయితే భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

లక్ష్మి (వరలక్ష్మి శరత్‌ కుమార్‌) ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే అనాథ. ఒకరోజు తన కూతురు సరస్వతిని స్కూల్‌లో దించి వెళ్లిన లక్ష్మికి, సాయంత్రం వచ్చేసరికి పాప కనిపించదు. స్కూల్‌ యాజమాన్యం అసలు ఆ పేరుతో తమ వద్ద ఏ విద్యార్థి లేదని షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇస్తుంది. దీంతో తన బిడ్డను ముగ్గురు వ్యక్తులు అన్యాయం చేసి చంపేశారని, ఫలానా చోట పాతిపెట్టారని లక్ష్మి పోలీసులను ఆశ్రయిస్తుంది. కానీ సాక్ష్యాలు లేవని పోలీసులు, కోర్టు కేసును కొట్టేస్తారు. ఈ క్రమంలో లక్ష్మి స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక జడ్జిని, ఐఏఎస్‌ అధికారిని, పోలీస్‌ను హత్య చేస్తుంది. అసలు లక్ష్మి గతం ఏంటి? ఆమెకు నిజంగా కూతురు ఉందా? ఈ చిక్కుముడిని లాయర్‌ రామానుజం (ప్రకాష్‌ రాజ్) ఎలా విప్పారు అనేదే మిగతా కథ.

విశ్లేషణ
ఈ చిత్రం ప్రధానంగా చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, చట్టంలోని లొసుగుల చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో ఒక ఉత్కంఠను నెలకొల్పడంలో దర్శకురాలిగా వ‌ర‌లక్ష్మి విజయం సాధించారు. పాప కనిపించకుండా పోవడం, లక్ష్మి పడే ఆవేదన ప్రేక్షకులను కథలో లీనం చేస్తాయి. అయితే, కథనం సాగుతున్న కొద్దీ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు అందేలా ఉండటం సినిమా వేగాన్ని కాస్త తగ్గించింది. ఇక సెకండాఫ్‌ అంతా లక్ష్మి గతం, ఆమె ఎందుకు హత్యలు చేయాల్సి వచ్చింది అనే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. గతానికి సంబంధించిన సన్నివేశాలు భావోద్వేగంగా ఉన్నప్పటికీ, కొంత ‘రిపీట్ మోడ్‌’లో అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు డ్రామా సినిమాకు మంచి ముగింపునిచ్చింది.

See also  'జెట్లీ' తో మార్నింగ్ షోనే ఫుల్ మీల్స్ పెడతాం: రితేష్ రానా

నటీనటుల ప్రతిభ:
వరలక్ష్మి శరత్‌ కుమార్ నటిగా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. బాధితురాలిగా, ఒక పట్టుదల కలిగిన తల్లిగా ఆమె నటన అద్భుతం. దర్శకురాలిగా సామాజిక అంశాన్ని ఎంచుకున్నందుకు ఆమెను అభినందించాలి.
రామానుజం పాత్రలో ప్ర‌కాశ్ రాజ్ అనుభవం కనిపిస్తుంది. కోర్టు సన్నివేశాల్లో తన వాదనలతో సీన్లను రక్తికట్టించారు. ప్రియమణి, కిషోర్, రావు రమేశ్, మురళీ శర్మ వంటి దిగ్గజ నటులు తమ పరిధి మేరకు చక్కగా నటించి సినిమా స్థాయిని పెంచారు.

సాంకేతికంగా సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు పదునుగా ఉన్నాయి. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్‌ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఎడ్విన్‌ సకాయ్‌ సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి.

బలాలు
వరలక్ష్మి, ప్రకాష్‌ రాజ్‌ నటన
భావోద్వేగభరితమైన పతాక ఘట్టాలు
థ్రిల్‌ కలిగించే ఇంటర్వెల్ బ్యాంగ్‌.
బలహీనతలు
ఊహించదగిన స్క్రీన్‌ప్లే,
కథలో కొత్తదనం లేకపోవ‌డం
సాగదీతగా అనిపించే కొన్ని సీన్లు.

మొత్తంగా ‘ఎస్‌.సరస్వతి’ ఒక సీరియస్‌ సామాజిక అంశంతో తీసిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌. కథలో కొత్తదనం తక్కువగా ఉన్నప్పటికీ, వరలక్ష్మి పవర్‌ఫుల్‌ పర్ఫార్మెన్స్‌ కోసం మరియు సమాజానికి ఇచ్చే సందేశం కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

రేటింగ్ : 3/5

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.