Skip to content

*మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె*

హైదరాబాద్: తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె, మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను గెలుచుకుని రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ తన విజయ గాధను పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాకేష్ ఆర్నె మాట్లాడుతూ –
“ఈ విజయానికి మూలకారణం నా నిరంతర కృషి, శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు. మిస్టర్ ఇండియా పోటీలకు నేను నా ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, సోషల్ ఆవగాహనతో సన్నద్ధం అయ్యాను. ఇప్పుడు నా లక్ష్యం మిస్టర్ ఎలైట్ గ్లోబల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం.”

ఈ పోటీలో రాకేష్ తన ప్రదర్శనలో సామాజిక సేవ, ఫిట్‌నెస్, అంతర్జాతీయ అవగాహన, టాలెంట్ ప్రదర్శనతో జడ్జిలను ఆకట్టుకున్నారు. ప్రత్యేకించి, ఆయన అందించిన “సోషల్ ప్రాజెక్ట్ – ఆత్మవిశ్వాసం”, అనేక వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన అంశంగా నిలిచింది. మోడలింగ్, ఫిట్‌నెస్, లైఫ్ కోచింగ్ రంగాలలో రాకేష్ తన అనుభవంతో జూనియర్లకు మార్గదర్శకుడిగా నిలవడమే కాక, దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆయన శిక్షకులు, మెంటార్లు, పోటీ నిర్వహకులకు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. “ఫిట్‌నెస్ అంటే కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకూ అవసరం. నేను నా అనుభవాల ద్వారా యువతకు ఇదే సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. త్వరలోనే ఫిట్‌నెస్, మానసిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తాను” అని అన్నారు.

రాకేష్ ఆర్నె మోడలింగ్ రంగంతో పాటు సామాజిక సేవలో భాగస్వామిగా మారే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

ఈ విజయంతో రాకేష్ యువతకు – “కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమే” అన్న స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ నుంచి ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగరవేయాలనే ఆయన లక్ష్యం.