బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్…
‘మర్దానీ 3’కి వెల్లువెత్తిన కలెక్షన్స్

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ 3’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మర్దానీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ మూడో పార్ట్ భారీ కలెక్షన్లను నమోదు చేసింది. మర్దానీ 3 ఇప్పటికే మర్దానీ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు క్రాస్ చేసి ఓ మైలు రాయిగా రాణి ముఖర్జీ కెరీర్‌లో నిలిచిపోయింది.
ఈ మేరకు రాణి ముఖర్జీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ .. ‘‘మర్దానీ 3’ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నేను వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలిని. ‘ఆల్ఫా మేల్’ పాత్రలతో తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ సమయంలో ‘మర్దానీ 3’ ఇలాంటి విజయాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఇలాంటి సమయంలో ఈ విజయం ఇంకా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆదరణ ఉందనే శక్తివంతమైన విషయాన్ని రుజువు చేస్తుంది. చిత్ర పరిశ్రమ ఈ విషయాన్ని గమనించిందని, అందుకే ఇలాంటి మరిన్ని ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను.
శివానీ శివాజీ రాయ్ పాత్రని దేనికీ ప్రతీకగా, ఫీమేల్ వెర్షన్‌గా రాయలేదు. ఆమె కేవలం నిజాయితీ, ధైర్యం కలిగిన ఒక రియల్ హీరో. ప్రేక్షకులు ఆమె కథను ఇంతటి స్థాయిలో స్వీకరించడం, ఒక స్త్రీ భావోద్వేగపరంగా మాత్రమే కాకుండా, వాణిజ్యపరంగా నడిపించే కథనాలకు ప్రజలు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ మైలురాయి బాక్సాఫీస్ నంబర్ల కంటే చాలా పెద్దది. ఫీమేల్ సెంట్రిక్ కథలకు పెట్టుబడి పెట్టడం ప్రమాదం ఏమీ కాదని ఈ చిత్రం చాటి చెప్పింది.
మర్దానీ ఫ్రాంచైజీ విజయం భారతీయ సినిమాలో హీరోయిజం ఎలా ఉంటుందో విస్తరిస్తుంది. ఇలాంటి చిత్రాలకు కమర్షియల్ సక్సెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం విభిన్నమైన సినిమాలు తీయాలి, ఖచ్చితంగా అలాంటి సినిమాలో ఒక స్త్రీని ముందంజలో ఉంచాలి. శివానీ శివానీ రాయ్ పాత్రతో ప్రేక్షకులు 12 సంవత్సరాలుగా కనెక్ట్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఆమె మహిళలకు, సమాజానికి సాధికారత కల్పించే బలం, ఆలోచనను ప్రతిబింబిస్తుంది. బహుశా అందుకే ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే శివానీ పాత్ర ప్రజలతో అంతగా కనెక్ట్ అయింది’ అని అన్నారు.
‘ధురంధర్ 2’, ‘టాక్సిక్’ వరకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా ఉండటంతో ‘మర్దానీ 3’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే భారతదేశంలో ఈ మూవీ 61 కోట్లు అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 75 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. రాణి ముఖర్జీ ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు అవుతోంది. ఇలా తన 30వ సంవత్సరంలో మళ్ళీ సోలోగా రాణి ముఖర్జీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసినట్టు అయింది.
