Skip to content

‘ఖుదీరాం బోస్’ పాత్రలో నటించడం నా అదృష్టం

‘ఖుదీరాం బోస్’  పాత్రలో నటించడం నా అదృష్టం Telugu News

హీరో – రాకేష్ జాగర్లమూడి

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘ఖుదీరాం బోస్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడి తన అనుభవాలను, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న: “ఖుదీరాం బోస్” కథ విన్నప్పుడు మీ మొదటి స్పందన ఏమిటి?
రాకేష్: నిజం చెప్పాలంటే, కథ వింటున్నంత సేపు నా గుండె వేగంగా కొట్టుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులో ఒక బాలుడు దేశం కోసం చిరునవ్వుతో ఉరికంబం ఎక్కడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ వీరుడి పాత్రను నేను పోషించబోతున్నానని తెలియగానే ఒక పక్క గర్వంగా, మరోపక్క పెద్ద బాధ్యతగా అనిపించింది.

ప్రశ్న: ఈ అవకాశం మీకు ఎలా లభించింది?
రాకేష్: ఈ చిత్ర నిర్మాత మా నాన్నగారే (విజయ్ జాగర్లమూడి). ఆయన ద్వారానే నాకు ఈ అవకాశం దొరికింది. ఒక రకంగా ఈ పాత్ర నాకు సులభంగానే దక్కినప్పటికీ, దానికి న్యాయం చేయడం కోసం నేను చాలా శ్రమించాల్సి వచ్చింది.

ప్రశ్న: అసలు ఖుదీరాం బోస్ కథనే సినిమాగా తీయాలని మీ నాన్నగారికి ఎందుకు అనిపించింది?
రాకేష్: మా నాన్నగారికి దేశభక్తి అంటే ప్రాణం. ఆయన విపరీతంగా పుస్తకాలు, గ్రంథాలు చదువుతారు. మా ఇంట్లో ఎటు చూసినా దేశభక్తికి సంబంధించిన పుస్తకాలే ఉంటాయి. ఆ స్ఫూర్తితోనే, నేటి తరానికి ఈ వీరుడి కథను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమాను నిర్మించారు.

ప్రశ్న: ఈ పాత్ర కోసం మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు?
రాకేష్: దాదాపు 90 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాను. ‘మయూఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్’లో సీనియర్ నటుడు ఉత్తేజ్ గారి దగ్గర నటనలో మెరుగులు దిద్దుకున్నాను. ఉత్తేజ్ గారి భార్య పద్మగారు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. దాంతో పాటు చారిత్రక పుస్తకాలు చదివి, ఆ కాలం నాటి బాడీ లాంగ్వేజ్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.

ప్రశ్న: ఖుదీరాం బోస్ గురించి చదివినప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయమేమిటి?
రాకేష్: ‘వందేమాతరం’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన యువ వీరుడు ఆయన. అలాగే స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదితతో ఆయనకున్న అనుబంధం, ఆమె తయారుచేసిన మొట్టమొదటి భారతీయ జెండాను ఆయన ప్రజల మధ్యకు తీసుకెళ్లడం వంటి విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది.

ప్రశ్న: ఈ సినిమాలో మీకు అత్యంత కష్టమైన లేదా భావోద్వేగపూరితమైన సీన్ ఏది?
రాకేష్: ఉరికంబం ఎక్కే సన్నివేశం. 18 ఏళ్ల వయసులో మరణం కళ్లముందు కనిపిస్తున్నా, దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు కలిగిన భావం నాలో చాలా రోజుల వరకు ఉండిపోయింది. ఆ పాత్ర తర్వాత నాలో భయం పోయి, సత్యం కోసం నిలబడాలనే ధైర్యం పెరిగింది.

ప్రశ్న: షూటింగ్ సమయంలో సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల నుండి మీరు నేర్చుకున్నదేమిటి?
రాకేష్: నా మొదటి సినిమాకే పద్మశ్రీ తోట తరణి గారు, మణిశర్మ గారు, రసూల్ ఎల్లోర్ గారి వంటి దిగ్గజాలతో పనిచేయడం నా అదృష్టం. అతుల్ కులకర్ణి, వివేక్ ఓబెరాయ్, నాజర్ గారి వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం నాకు ఒక పాఠశాలలా అనిపించింది. వారి క్రమశిక్షణ, పని పట్ల వారికున్న నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచాయి.

ప్రశ్న: సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో మీ అనుబంధం గురించి చెప్పండి?
రాకేష్: రజనీకాంత్ గారు మా నాన్నగారికి అత్యంత సన్నిహితులు. నేను 9 నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచీ ఆయన్ని కలుస్తూనే ఉన్నాను. ఆయన నన్ను ఎత్తుకుని ముద్దాడిన క్షణాలు నా జీవితంలో మధుర జ్ఞాపకాలు. ఆయన ట్రైలర్ చూసి నన్ను ఆశీర్వదించడం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఆయన సింప్లిసిటీ నా జీవితానికి పెద్ద ఆదర్శం.

ప్రశ్న: పార్లమెంట్ స్క్రీనింగ్, గోవా ఫిలిం ఫెస్టివల్ స్పందన ఎలా ఉంది?
రాకేష్: పార్లమెంట్‌లో ఎంపీల కోసం స్క్రీనింగ్ వేసినప్పుడు చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో సినిమా అయిపోయాక 5 నిమిషాల పాటు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు (Standing Ovation). “ఇది కదా నిజమైన ఇండియన్ స్టోరీ” అని వారు మెచ్చుకుంటుంటే చాలా గర్వంగా అనిపించింది.

ప్రశ్న: ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
రాకేష్: దేశభక్తి అనేది కేవలం మాటల్లో కాదు, మనం చేసే పనిలో ఉండాలి. ‘ఖుదీరాం బోస్’ లాంటి సినిమాలు వందకి ఒకటి వస్తాయి. మన చరిత్రను, వీరుల త్యాగాలను గౌరవించడం మన బాధ్యత.

ప్రశ్న: ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు?
రాకేష్: ఈ చిత్రం భారత ప్రభుత్వ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫారం ‘Waves’ (వేవ్స్) లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ నుండి ‘Waves’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉచితంగా చూడవచ్చు. ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. దయచేసి అందరూ చూసి మన చరిత్రను ఆదరించండి.

వయసు చిన్నదైనా ఆలోచనలు పెద్దవిగా ఉండాలని నిరూపించిన రాకేష్ జాగర్లమూడి, భవిష్యత్తులో ‘ఛత్రపతి శివాజీ’ వంటి వీరగాథల్లో నటించాలని కోరుకుంటున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.