Skip to content

ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, సీఈవో కె. రాజేంద్ర కుమార్ గారు, సీవోవో గోపి గారు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ గారు, హెరిటేజ్ ఫుడ్స్ ఎం. సాంబశివరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించబోయే తలసేమియా రన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ సేవ కార్యక్రమాల్లో భాగమైన దాతలకు ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక రోజు కాదు, ఒక గుర్తు. ఒక ట్రస్ట్ కాదు ఒక ఆశయం. ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంలో మీ అందరినీ ఆహ్వానించడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ఈ రోజు కేవలం ఒక సంస్థ స్థాపన దినోత్సవం మాత్రమే కాదు బాధ్యతను, సేవా భావాన్ని, అలాగే సజీవంగా నిలిచిన ఒక గొప్ప వారసత్వాన్ని గుర్తు చేసే రోజు. సమాజ సేవ అనేది అర్థవంతంగా, కరుణతో, నిరంతరంగా ఉండాలనే గొప్ప ఆశయంతో ఈ సేవా ప్రయాణం ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.

ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. రక్తదాన సేవలు, ఆరోగ్య శిబిరాలు.. ముఖ్యంగా తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన కార్యక్రమాలు, విద్య, మహిళా సాధికారత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు అనేక రకాలుగా ట్రస్ట్ సేవలను కొనసాగిస్తోంది. ప్రతి ప్రయత్నంలో ఒకే లక్ష్యం ఉంది, అవసరంలో ఉన్నవారికి త్వరగా, గౌరవంగా, ప్రేమతో సహాయం అందించడం. ఈ సేవా కార్యక్రమాలు సాధ్యమవ్వడానికి ప్రధాన కారణం మా దాతలందరి ఉదారత, నిరంతర సహకారం. ఏళ్ల తరబడి మీ అందరి నమ్మకం మాకు ఎన్నో ప్రాణాలను కాపాడటానికి, కుటుంబాలకు తోడుగా నిలవటానికి, విద్యార్థులను ప్రోత్సహించటానికి, సంక్షోభ సమయంలో సమాజానికి అండగా ఉండటానికి సహాయపడింది.

మా ప్రయాణంలో ప్రతి మైలురాయి.. మీ విశ్వాసంతో నిర్మించబడింది. మాతో కలిసి పనిచేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సహకారం వల్లనే సేవలు అవసరమైన ప్రతి వ్యక్తికి చేరేలా చేయగలిగాం. ఈ ట్రస్ట్‌కు బలమైన ఆధారం అయిన మా అంకితభావంతో పనిచేసే బృందంపై నాకు ఎంతో గర్వం ఉంది. ప్రత్యేకంగా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే వారి సేవలు అమూల్యమైనవి.

ఈ రోజు మనం కేవలం ఒక సంస్థను మాత్రమే కాదు… ఆ సంస్థకు విలువలను ఇచ్చిన మహానుభావుడిని కూడా స్మరించుకునే రోజు. సేవ, త్యాగం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు. సినిమా శిఖరంలో ఉన్న మనిషి, ప్రజలు కోసం అన్ని వదిలేసి వచ్చిన మహానేత. ఆయనకి అధికారం అంటే ఒక బాధ్యత. అభివృద్ధి అంటే అంతిమ వ్యక్తి వరకు చేరాలి. అదే నిజమైన అభివృద్ధి అని నమ్మిన నాయకుడు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మకంతో ప్రజల కోసం ఓ పాత బస్సులో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు. ఓ చెక్క బల్లమీద నిద్రపోయేవారు. ప్రజలు ఆయనలోని నిజాయితీమ నిబద్దత గల నాయకుడిని గుర్తించారు. కేవలం తొమ్మిది నెలల్లో బలమైన కాంగ్రెస్ ని ఓడించి ప్రజాస్వామ్యంలో రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన నమ్మకానికి ప్రతిరూపం. ఇది ఇది కేవలం ఒక ట్రస్ట్ కాదు వ్యాల్యూ సిస్టం. నాయకత్వం ఎప్పుడు కూడా త్యాగాలతో మొదలై సేవతో ముగుస్తుంది. ఎన్టీఆర్ గారు ఎప్పటికీ మన మనసులోనే వుంటారు.

మా డోనర్స్ శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. మీరు డొనేట్ చేస్తున్న ప్రతి రూపాయి కూడా ఒక బాధ్యతతో మంచి ఉద్దేశంతోనే ఉపయోగించడం జరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే వచ్చే తృప్తి వేరుగా ఉంటుంది. నేను హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినప్పటికీ నాకు తృప్తి మాత్రం ఈ ట్రస్ట్ లోనే లభిస్తుంది. హెరిటేజ్ లో కాదు. తిరిగి సొసైటీకి ఇస్తున్నామనే సంతృప్తి మాటల్లో చెప్పలేం. మా దాతల్ని మేము ఎప్పుడూ మర్చిపోను. మా టీమ్ మెంబర్స్ అందరికీ థాంక్యు. వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళేది కాదు. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. జైహింద్.

ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో,రిటైర్డ్ IPS కె. రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. 29 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ గారి ఆశయాలకి ప్రతిరూపంగా ఈ ట్రస్ట్ పుట్టింది. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహా నాయకుడు ఆయన. మూడు దశాబ్దాల కాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టింది. మేము నిర్వహించిన ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంపు, విద్య, మంచినీరు. రక్తదాన సేవలు, ఆరోగ్య శిబిరాలు, తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా సమాజం దేవాలయం అని నమ్మి చేసిన మహత్తర కార్యక్రమాలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి గైడెన్స్, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి విజన్ తో ఇది సాధ్యపడింది.

హెరిటేజ్ ఫుడ్స్ ఎం. సాంబశివరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దాదాపు మూడు దశాబ్దాల సేవా కార్యక్రమాలు పూర్తి పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ఈ ట్రస్ట్ తో నాకు ఎన్నో ఎంతో కాలంగా అసోసియేషన్ ఉంది. మేము హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ప్రతి సంవత్సరం మా సంస్థ నుంచి వచ్చే CSR నిధులను ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహానేత ఎన్టీఆర్ గారి ఆశయాలకు గుర్తుగా ఈ ట్రస్ట్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి విజన్ తో ముందుకు వెళుతోంది. భువనేశ్వరి గారి పాషన్ తో అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. ట్రస్ట్ కోసం పనిచేస్తున్న అందరి సహకారంతో ఇంత అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నాం’. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.