హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి…
‘పెద్ది’ సినిమాలో తరాల పాటు గుర్తుండిపోయే పాటిది: అనంత శ్రీరామ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్ గా అదరగొట్టింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పెద్ది రై రై రా రా పాట విశేషాలు పంచుకున్నారు లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్.
పెద్ది ‘రై రై రా రా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది?
-రామ్ చరణ్ గారి రుద్రతాండవం, ఏఆర్ రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలు గారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, వీటన్నిటి మధ్యలో నుంచి కూడా పాటలో లిరిక్స్ బాగున్నాయి, ఫలానా లైన్ విను, ఫలానా లైన్ బాగుంది అని అన్ని చోట్ల సాహిత్యానికి ప్రశంసలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట ఆ అదృష్టాన్ని చేసుకుందనిపించింది.
-నిజానికి ఇది ఒక ప్రేమ పాట కాదు, ఐటెం సాంగ్ కాదు అయినప్పటికీ కూడా లైన్స్ గురించి మాట్లాడుతున్నారు.. దీనికి కారణం ఈ పాట సాహిత్యం ఇలా రావాలన్న దర్శకుడి సంకల్పం. బుచ్చిబాబు గారు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ పాటలో ఎలాంటి సాహిత్యం ఉండాలి అనే దానిపై బుచ్చిబాబు గారు నేను చాలా సమయం కేటాయించాం. చాలా రాత్రులు రింగ్ రోడ్డు మీద అలా డ్రైవ్ చేస్తూ, కాఫీ షాపుల్లో కూర్చుని చాలా చర్చించాం. అలా నెలలు తరబడి మదనపడితే వచ్చిన పాట ఇది. ఈ తరానికి ముందు తరానికి కూడా గొప్ప సందేశాన్ని అందిస్తూనే మాస్ ని అలరించేలా ఈ పాటని రూపొందించడం జరిగింది.
-ఈ పాట రాయడానికి చాలా వెర్షన్స్ అనుకున్నాం. ఫైనల్ గా ఒక మంచి ప్రబోధాత్మక పాట గానే ఉండాలి అని నిర్ణయించాం. కాకపోతే ఇందులోనే వాడే భాష జనానికి దూరంగా ఉండకూడదు. వ్యవహారికంగా ఉండాలి. చెప్పే విషయం చాలా లోతుగా ఉండాలి అని బుచ్చిబాబు గారు చెప్పారు.
-సాహిత్యంలో మిత్ర సంహిత ప్రక్రియలో పాట రాయాలని అనుకున్నాను.
నిన్నటి లాగే
రేపు ఉన్నదంటే
ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డి
నీ బిడ్డ కడితే
నువ్వు ఏమి పొడిచావనే .. ఈ లైన్స్ మీరు గమనిస్తే ఒక స్నేహితుడు మరో స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది.
-ఈ పాట ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలి అని డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పారు. ఆ మాట నాకు తారకమంత్రం లాగా పనిచేసింది. సాహిత్యంలో శ్రీశ్రీ గారి గేయ ప్రక్రియలా ఉంటే సరిపోతుందని భావించాను. అందుకే రైరై రారా పాటని ఒక గేయ కవితలాగా రాశాను. శ్రీశ్రీ గారి కవితలు చదువుతున్నప్పుడు ఎలాంటి ఉద్వేగం ఉంటుందో అలాంటి ప్రాసలతో ఈ పాట రాయడం జరిగింది.
రైరై రారా
రైరై రారా
అడ్డే లేని ధారై రా రా
రైరై రారా
రైరై రారా
హద్దే లేని తిరై రారా
దూకేటి జోరై రా
పోరరేటి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్లొంచి వేరై రా
భయ్యం పీకి పారేయ్ రా
సిగ్గుంటే సీరై రా
జై కొట్టేటి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హోరై హోరై హోరై రా రా
ఈ పదాల్ని స్వరం లేకుండా పాడిన మంచి గేయ కవిత చదివిన అనుభూతిని కలిగిస్తాయి.
-ఇందులో హీరోకి కెప్టెన్ లక్షణాలు ఉండాలి. తన జట్టు ఆటగాళ్లని రై రారా అని పిలిచేలాగా వుండాలి. బుచ్చిబాబు గారు చెప్పిన ఈ మాటలు ఆయన దగ్గర నుంచే తీసుకుని పాటని ప్రారంభించడం జరిగింది. రై రై రా రా అని పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇది. ప్రతి ఒక్కరికి ఈ పాట ఫిలాసఫీ రీచ్ అవ్వాలి. మన పల్లెటూరులో ప్రతి ఒక్కరిలో ఉపయోగించే రవాణా సౌకర్యం ఆర్టిసీ బస్సు. కండక్టర్ రైరై అనగానే బండి ముందు కదులుతుంది. ఆ శబ్దం యొక్క ప్రేరణలా ఈ జీవితమనే బస్సు ముందుకు వెళ్లాలి అన్న సూచన ఇచ్చేలాగా పాటను మొదలుపెట్టడం జరిగింది. ఈ పాటలో ఎక్కువమంది పాతేసుకోకోయలా.. నువ్వు నిన్నే నీ లోపల.. పాతికేళ్లకే..నువ్వు పాతబడిపోకురా.. ఈ లైన్ ని కోట్ చేస్తున్నారు. అంత మంచి పాట ఇంత పెద్ద సినిమాలో రాసిన అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తాను.
-సాహిత్యం ఒక్కటే కాదు జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీ, రత్నవేలు గారికి విజువల్స్, రామ్ చరణ్ గారు చూపించిన చరిష్మా గ్రేష్, రెహమాన్ గారి సంగీతం, గొంతు అన్నీ కూడా నువ్వు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడడం వల్ల ఈ ఘనత సాధ్యమైంది. ఈ పాట క్రెడిట్ అందరికీ ఇవ్వాలి. అలా కాదు ఒక్కరికే ఇవ్వాలి అంటే మా అందరినీ నడిపించిన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇవ్వాలి, ఆయనకి స్వేచ్ఛనిచ్చిన రామ్ చరణ్ గారికి ఇవ్వాలి.
ఈ పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి?
-సాంగ్ విషయంలో పూర్తి స్వేఛ్చ ఇచ్చారు. షూటింగ్ లోకేషన్ లో ఈ పాటను చరణ్ గారికి వినిపించాను. పాట విని నన్ను హత్తుకున్నారు.
ఈ సాంగ్ మీకు ఛాలెంజింగ్ గా అనిపించిందా?
-ఒక మంచి పాట రాయడం అలాగే మాస్ పాట రాయడం రెండూ కష్టం కాదు. మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తి మీద సాములా అనిపించింది. అందులోనూ రెహమాన్ గారి బాణీ మామూలుగా ఉండదు. ప్రతి లైన్ ప్రయోగాత్మకంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి చాలా కసరత్తు జరిగింది. దాదాపు రెండు నెలల వరకు సమయం తీసుకున్నా. పరాయి భాషల ప్రభావం లేని అచ్చ తెలుగు పాటిది.
ఈ పాట మీకు ఎలాంటి తృప్తిని ఇచ్చింది?
-నా పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భము రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లే అని చెప్తుంటాను. ఆ లక్షణం ఈ పాటకి కనిపిస్తోంది.
ఇందులో మీరు రాసిన పాటలు ఇంకా ఉన్నాయా?
-మూడు పాటలు రాబోతున్నా యి. బాలాజీ గారు రాసిన చికిరి, ఈపాట ఎంత వైవిధ్యంగా వున్నాయో.. మిగతా పాటలు కూడా దేనికవే ప్రత్యేకంగా వుంటాయి.
ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
-20 ఏళ్ల ప్రస్థానంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే ..అవకాశం రావడం కష్టం, అవకాశం వచ్చిన తర్వాత మొదటి విజయం రావడం కష్టం, విజయాల్ని కొనసాగించడం ఇంకా కష్టం. ప్రతి సంవత్సరం ఒక చార్ట్ బస్టర్ హిట్ వస్తుందంటే.. అది తల్లి తండ్రులు వేసిన పునాది. ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా మార్చుకోవాలి అనే తపన. ఈ నిలకడే నేను సాధించిన విజయంగా భావిస్తున్నాను. షేర్స్, లైక్స్, వ్యూస్.. ఇలా విజయానికి కొలమానాలు ట్రెండ్ ని బట్టి మారుతుంటాయి.. కానీ నిలకడ మాత్రం మనం కొనసాగిస్తూ ఉండాలి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది కదా.. నటన కొనసాగిస్తారా?
-నటన నేను కోరుకున్నది కాదు, అలాగని దానిపై నాకు విరక్తి కూడా లేదు. నేను పాటలు రాస్తున్నప్పుడు నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ డైరెక్టర్స్ కి నచ్చి అలా ఓ క్యారెక్టర్ కి నేను సరిపోతానంటే వాళ్లు చెప్తుంటారు. నేను కూడా సరదాగా చేస్తుంటాను. అంతేగాని ప్రత్యేకంగా నటనపై నాకు దృష్టి లేదు. వచ్చినప్పుడు మాత్రం చేస్తాను.
ప్రొడక్షన్స్ సపోర్టు గురించి?
-ఒక నిర్మాతగా సతీష్ గారు తన బాధ్యతని 100% స్వచ్ఛంగా నిర్వర్తించారు. అందుకే ఇంత మంచి ఫలితం వచ్చింది.
మెగా ఫ్యామిలీతో మీ అసోసియేషన్ గురించి?
-పాటల రచయితగా తొలిసారి నా పేరు చూసుకున్న తొలి చిత్రం చిరంజీవి గారి అందరివాడు. ఒకే హీరోతో ప్రయాణం అనేది గొప్ప అదృష్టం. రెండో తరం హీరోతో కూడా అంత మంచి పాట రావడం అనేది ఇంకా అదృష్టం. మరో అద్భుతమైన అదృష్టమేమిటంటే.. ఒకే సంవత్సరంలో చిరంజీవి గారి సినిమా, అలాగే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారి సినిమా.. ఇలా రెండు పెద్ద హిట్స్ రావడం అనేది గొప్ప అదృష్టం.
-చిరంజీవి గారు ఒక తండ్రిలాగా ప్రేమను పంచుతారు. అలాగే చరణ్ గారు సోదర సమానంగా ప్రేమ పంచుతారు. మనుషులంటే వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ. నేనే కాదు ఎదురుగా ఒక మనిషి ఉంటే చరణ్ గారి కళ్ళల్లో ప్రేమ పొంగుతుంది. మనిషిని ప్రేమించే తత్వం అది. చరణ్ గారు ప్రతి నిమిషం కష్టపడే వ్యక్తి. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఐరన్ మ్యాన్ రామ్ చరణ్.
ప్రస్తుతం రాస్తున్న పాటలు?
స్పిరిట్, చెన్నై లవ్ స్టోరీ సినిమాల్లో రాస్తున్నాను. చాలా మంచి పాటలు వుంటాయి.


