Skip to content

‘సూపర్ సుబ్బు’ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2 నుంచి స్ట్రీమింగ్

‘సూపర్ సుబ్బు’ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2 నుంచి స్ట్రీమింగ్ Telugu News
‘సూపర్ సుబ్బు’ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2 నుంచి స్ట్రీమింగ్ Telugu News

సుబ్బు సార్ క్లాస్ అందరికీ స్వాగతం, ఒక అమాయకమైన ప్రశ్నతోనే మొత్తం మాకిపూర్ గ్రామంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాధ్యాయుడు సుబ్బు! మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ కథలో సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే యువకుడు, మాకిపూర్ అనే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందుతాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా, గ్రామస్తులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడుగుపెట్టిన సుబ్బు, అక్కడ అనుకోని సంఘటనలు, విచిత్రమైన ప్రశ్నలు, హాస్యభరిత పరిస్థితులు, జీవితాన్ని మార్చే అనుభవాల మధ్య చిక్కుకుంటాడు. ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం, కెరీర్‌ను పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చివరికి అతను తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోగలడా? అనేదే కథ.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. “సూపర్ సుబ్బు హృదయాన్ని హత్తుకునే కామెడీ సిరీస్. మాకిపూర్ గ్రామం నేపథ్యంగా, సెక్స్ ఎడ్యుకేషన్, సమ్మతి (కన్సెంట్) వంటి అంశాలను వినోదాత్మకంగా, సహజంగా చర్చిస్తుంది. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ, మానస చౌదరి, బ్రహ్మానందం తదితరులు అద్భుతమైన నటనను కనబరిచారు. మా తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా ‘సూపర్ సుబ్బు’ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని నమ్ముతున్నాం” .

సిరీస్ క్రియేటర్, దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ, “సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ఉన్న సంకోచాన్ని తగ్గిస్తూ, వినోదంతో కూడిన కథ చెప్పాలని అనుకున్నాం. అందుకే హాస్యాన్ని ప్రధాన సాధనంగా ఎంచుకున్నాం. సుబ్బు అనే అమాయక పాత్ర ద్వారా కుటుంబ బంధాలు, తరాల మధ్య ఆలోచనా విధానాల్లో తేడాలు, సంబంధాల అందాన్ని చూపించాం. అద్భుతమైన నటీనటులతో మాకిపూర్ ప్రపంచాన్ని సృష్టించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ గ్రామాన్ని ప్రేమిస్తారని నమ్ముతున్నాం” అన్నారు.

మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌ను రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మలతో పాటు గెటప్ శ్రీను, మానస చౌదరి, జీవన్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాస్యం, భావోద్వేగాలు, ఆసక్తికరమైన పాత్రలతో ‘సూపర్ సుబ్బు’ ప్రేక్షకులకు వినోదభరితమైన అనుభూతిని అందించనుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.