Skip to content

పలు భారతీయ భాషల్లోకి ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’

గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌తో చేతులు కలిపిన శ్రావ్య ఫిల్మ్స్

ఉత్తమ చిత్రాల అవార్డు గ్రహీత, సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందేందుకు సిద్ధమవుతోంది.

జూన్ 19న ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రేక్షకులు, విమర్శకులు, ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం విజయవంతంగా రెండో వారంలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ…

“సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రంతో శ్రావ్య ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్ ప్రాంతీయ చిత్రంగా కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి కలిగిన సినిమా అని మేము విశ్వసిస్తున్నాం.”

ఈ భాగస్వామ్యానికి ప్రముఖ వ్యాపారవేత్త, టీపీఎల్ ఛైర్మన్ రాజేష్ అగర్వాల్ విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

“మంచి సినిమాలకు సరైన వేదిక దొరికితే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోగలవు. పి. సునీల్ కుమార్ రెడ్డి గారి సృజనాత్మక దృష్టి, గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ మార్కెటింగ్ సామర్థ్యం కలిస్తే ఈ సినిమా మరింత విశాలమైన ప్రేక్షకులకు చేరుతుంది. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని విలువైన, సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతున్నాను.”

మీడియా కన్సల్టెంట్ సందీప్ జైన్ మాట్లాడుతూ…

“ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్ ఒక ప్రాంతీయ కథ మాత్రమే కాదు. భారత ఉపఖండ సమాజంలో నిశ్శబ్దంగా మిగిలిపోయిన అనేక జీవితాల కథ ఇది. ఇలాంటి నిజాయితీతో కూడిన చిత్రాలు భాషల సరిహద్దులు దాటి ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉంటాయి.”

ఈ సందర్భంగా శ్రావ్య ఫిల్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

“గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. వారి అనుభవం, మార్కెటింగ్ నెట్‌వర్క్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నాను.”

ఆయన ఇంకా మాట్లాడుతూ…

“నిజాయితీగా చెప్పిన కథలకు భాషా, భౌగోళిక సరిహద్దులు ఉండవు. మంచి కథ ఎక్కడైనా ప్రేక్షకుల మనసును తాకుతుంది. ఈ భాగస్వామ్యం మా రెండు సంస్థల మధ్య దీర్ఘకాలిక అనుబంధానికి నాంది కావాలని, భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన, ప్రపంచ స్థాయి చిత్రాలను కలిసి నిర్మించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.”

త్వరలోనే పలు భారతీయ భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’ దేశవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులను చేరుకునేందుకు సిద్ధమవుతోంది. సామాజిక స్పృహ కలిగిన ఈ చిత్రాన్ని భారతదేశంతో పాటు ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయాలనే లక్ష్యంతో శ్రావ్య ఫిల్మ్స్ – గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

ఈ చిత్రంలో తారాగణం ; ఎల్ బి శ్రీరామ్ , ఎస్తర్ నోరోన్హా , రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతి నిగమ్ , విష్ణు తేజ , హిమ రాథోడ్, సనా ఖాన్ , లైలా ఓరుగంటి చంద్రముఖి తదితరులు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి బాపిరాజు , సహ నిర్మాత : సుభాష్ చక్రవర్తి రావాడ , రచన , దర్శకత్వం : పి సునీల్ కుమార్ రెడ్డి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.