Skip to content

‘రంభ ఊర్వశి మేనక’ నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది: హీరో అల్లరి నరేష్

అల్లరి నరేష్, చంద్ర మోహన్ చింతడ, అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫాంటసీ కామెడీతో కడుపుబ్బా నవ్వించే టీజర్ లాంచ్

కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నా కంటి మీద కనులే’ పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ ఓ తండ్రి తన కుమారుడికి ఒక మిస్టరీ ఫ్యామిలీ మ్యాజిక్ బుక్‌ను పరిచయం చేయడంతో మొదలవుతుంది. ఆ పుస్తకంపై సరైన ముగ్గు వేస్తే ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనకలను భూలోకానికి రప్పించవచ్చని చెబుతాడు. 25 ఏళ్లుగా ప్రయత్నించిన తర్వాత చివరకు ఆ ముగ్గురూ భూలోకంలోకి వస్తారు. అయితే ఇంతకాలం ఎదురుచూసిన కల నిజమైన ఆనందం ఎంతోసేపు ఉండదు. ఆ ముగ్గురు అప్సరసలను హ్యాండిల్ చేయడం అనుకున్నంత సులభం కాదని హీరోకు అర్థమవుతుంది.

టీజర్‌లో అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంలోని కామెడీ ఆయనకు బాగా సెట్ అవుతుందని మరోసారి నిరూపించేలా ఉంది. సురభి హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిశోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పంచబోతున్నారు. చివర్లో కృష్ణంరాజుకు సంబంధించిన ‘కత్తి అందుకో జానకి’ డైలాగ్‌ను వెన్నెల కిశోర్ తనదైన శైలిలో చెప్పడం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అల్లరి నరేష్ తండ్రిగా నరేష్ వీకే నటించగా, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించారు. శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ సినిమాకు మరింత కామెడీని యాడ్ చేస్తోంది,

దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ ఫాంటసీ, కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి పల్లెటూరి వాతావరణంతో పాటు ఇంద్రలోకంలోని గ్రాండ్ విజువల్స్‌ను అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి వర్క్ ఫాంటసీ ప్రపంచానికి మరింత గ్రాండియర్‌ను తీసుకొచ్చింది. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం కామెడీ సన్నివేశాలకు మరింత ఎనర్జీని అందిస్తోంది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటర్. ఫాంటసీ, కామెడీ, గ్రామీణ నేపథ్యాన్ని కలిపి ప్రేక్షకులకు ఫుల్ ఫన్ అందించే సినిమాగా టీజర్ మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను సరైన కామెడీ సినిమా చేసి దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశాను. కాకపోతే నేను కామెడీని ఎప్పుడూ వదల్లేదు. ఒక మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. చాలా రోజుల తర్వాత చంద్ర మోహన్ గారు వచ్చి ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలతో కలిసి ఈ సినిమా చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారికి పెద్ద అభిమానిని. ‘నా సామిరంగ’ సినిమాలో ఆయనతో కలిసి నటించాను. ఇప్పుడు ఆయన బ్యానర్‌లో సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్లో ఉన్న నటీనటులందరినీ చూస్తుంటే నాన్నగారి సినిమాలు గుర్తొచ్చేవని సెట్లో అందరూ చెప్పేవారు. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దాదాపు పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు థాంక్యూ. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. చైతన్ భరద్వాజ్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 4న కచ్చితంగా మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను. ఈ సినిమాతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని గ్యారెంటీగా చెబుతున్నాను.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నిర్మాతగా నా జర్నీ ప్రసాద్ గారితో కలిసి మొదలైంది. నేను ప్రతి సినిమా కథ విన్న తర్వాత ప్రసాద్ గారిని సంప్రదిస్తాను. అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ బ్యానర్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నరేష్ గారు తన వింటేజ్ కామెడీతో మీ అందరినీ అలరించబోతున్నారు. ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రసాద్ గారికి, నాగార్జున గారికి ధన్యవాదాలు. దర్శకుడు చంద్ర మోహన్ ఇప్పటివరకు నేను పనిచేసిన దర్శకుల్లో బెస్ట్ డైరెక్టర్. ఆయన ఏదైతే కథ చెప్పారో, అంతకంటే అద్భుతంగా సినిమాను తీశారు. థియేటర్లలో నవ్వుల మోత మోగిపోతుంది. ఈ సినిమా ఒక చరిత్ర. సెప్టెంబర్ 4న అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదలకు ముందే నరేష్ గారితో మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాను. సినిమా మీద అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.

హీరోయిన్ సురభి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ టీజర్ మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అల్లరి నరేష్ గారు నా ఫేవరెట్. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సెప్టెంబర్ 4న అందరం థియేటర్లలో కలుద్దాం.

రాశి సింగ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నాకు ఇలాంటి మంచి పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ. అల్లరి నరేష్ గారికి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. ఈ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు.”

ప్రిష రాజేష్ మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కలిసి నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. మా హీరో నరేష్ గారు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 4న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.

విష్ణుప్రియ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, హీరో గారికి ధన్యవాదాలు. నాకు ఇలాంటి మంచి అవకాశం రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కూడా థాంక్యూ. ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను.”

డైరెక్టర్ చంద్ర మోహన్ మాట్లాడుతూ: ఈ సినిమాలోని పాత్రలన్నింటినీ మీకు పరిచయం చేయడాని టీజర్‌ను విడుదల చేశాం. ఇందులో హీరో పాత్ర పేరు సూరి. మన పక్కింటి కుర్రాడిలా చాలా సహజంగా ఉంటాడు. అలాగే రంభ, ఊర్వశి, మేనక పాత్రలు ఎలా ఉంటాయో కూడా ఈ టీజర్‌లో చూపించాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, మా నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్‌కు మీరు ఇచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. సెప్టెంబర్ 4న థియేటర్లు దద్దరిల్లిపోతాయి.

రైటర్ నందు మాట్లాడుతూ: టీజర్‌లో పది శాతం మాత్రమే చూపించాం. సినిమా 200 శాతం ఉంటుంది. నేను చాలాసార్లు సినిమా చూశాను. చంద్ర మోహన్ అదరగొట్టారు. అల్లరి నరేష్ గారిని చూసి చాలా ఎంజాయ్ చేశాను. మనం మిస్ అయిన ‘కితకితలు’, ‘బ్లేడ్ బాబ్జీ’, ‘సీమశాస్త్రి’, ‘సుడిగాడు’ రోజుల్లోని ఆ అల్లరంతా ఈ సినిమాలో చూడబోతున్నారు. పెద్ద నరేష్ కూడా చాలా అల్లరి చేస్తారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది.

మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ: “మీ అందరికీ టీజర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. ఫుల్ ఫన్ ఉంటుంది. తొలి పాట ఇప్పటికే మీ అందరికీ నచ్చింది. మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాకు ఆర్‌ఆర్ చేస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. తప్పకుండా ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

ఎడిటర్ చోటా కె. ప్రసాద్ మాట్లాడుతూ: నరేష్ గారి కామెడీని కొన్నాళ్లుగా మిస్ అయ్యాం. ఈ సినిమాతో ఆ లోటు అంతా తీర్చబోతున్నారు. పది రెట్లు ఎక్కువ కామెడీని అందించబోతున్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది మంచి ఎంటర్‌టైనర్. మీ అందరినీ అద్భుతంగా ఎంటర్‌టైన్ చేయబోతుంది.

నటీనటులు: అల్లరి నరేష్, సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్

సాంకేతిక బృందం:
దర్శకత్వం: చంద్ర మోహన్ చింతడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
పి.ఆర్.ఓ : వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.