Skip to content

విశాఖలో జరిగిన సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో APFDC చైర్మన్ భరత్ భూషణ్

భీమిలి సాగర తీరంలోని తిమ్మాపురం వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో సినీ సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 12 ఏళ్లకు ఏర్పడిన APFDC కమిటీ సభ్యులను వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ కమిటీ సభ్యులు, టాలెంట్ రియల్ స్టూడియో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే టాలెంట్ ప్రొడక్షన్స్, కంటిపూటి క్రియేషన్స్ పేరుతో రెండు నూతన సినీ నిర్మాణ సంస్థలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా APFDC ఛైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ… “అమరావతి అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖపట్నాన్ని సినీ రంగానికి ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాము. విశాఖలో డబ్బింగ్ థియేటర్లను అభివృద్ధి చేయడంతో పాటు, త్వరలో జాతీయ స్థాయి అవార్డుల వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తాము. సినిమా షూటింగ్స్‌కు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో విధానం తీసుకురానున్నాము. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో సినిమా షూటింగ్స్ జరిగేలా చర్యలు తీసుకుంటాము. చిన్న సినిమాలే సినీ పరిశ్రమకు బలం, వాటి వల్లే పరిశ్రమలో కొత్త ప్రతిభకు అవకాశాలు లభిస్తున్నాయి. సినిమాలో మంచి విషయం, బలమైన కంటెంట్ ఉంటే ఎవరితో సినిమా తీశారనేది పెద్దగా ముఖ్యం కాదు” అన్నారు.

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ… “విశాఖపట్నం త్వరలో సినిమా రాజధానిగా మారబోతోంది. తొలిసారిగా భోగాపురం విమానాశ్రయానికి వచ్చాము, విశాఖ నగరం ఇప్పటికే గూగుల్, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో విశాఖ అభివృద్ధి కొనసాగుతోంది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు, భవిష్యత్‌లో పెద్ద సంఖ్యలో సినిమా షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తున్నాము” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎఫ్డిసి నుండి సుమన్, శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, సాయిబాబా బుర్ర, ఝాన్సీ, సముద్ర, సత్యనారాయణ, అలాగే చిత్ర పరిశ్రమ నుండి టీఎస్పీసీ సెక్రెటరీ గౌరవనీయులు తుమ్మల ప్రసన్నకుమార్, టిఎఫ్డిఏ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ప్రముఖ దర్శక నటుడు విశ్వనాథ్, దర్శకనిర్మాత సాయి రాజేష్, నటుడు సత్య ప్రకాష్, షణ్ముఖ్, కార్తీక్ రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. టాలెంట్ రియల్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ కార్యక్రమంలో అవార్డులు అందజేశారు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందించారు. అలాగే గాయని, గాయకులు ఆలపించిన సినీ గీతాలు కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినీ రంగ ప్రముఖులు, కళాకారులు, నిర్వాహకులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశాఖను సినీ షూటింగ్స్‌కు అనుకూలమైన ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.