Skip to content

‘డాయ్‌రా’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

– జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘డాయ్‌రా’ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్

‘డాయ్‌రా’ మూవీ ట్రైలర్ విడుదలైంది. నిజం ఎప్పుడూ ఒకేలా ఉండదని, న్యాయం ఎవరి కోణంలో వారు ఎలా అర్థం చేసుకుంటారనేదానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి నిర్ణయం వెనుక ఓ ఘ‌ట‌న ఉంటుంద‌నే అంశాలను ఈమూవీ ట్రైలర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. క్రైమ్, న్యాయం, శిక్ష వంటి అంశాలను భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా, విభిన్న కోణాలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను యష్ కేస్వానీ, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ కలిసి అందించారు.

నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘డాయ్‌రా’ కథ.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆగ్రహానికి కారణమైన ఓ నేరం తర్వాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ సాగుతుంది. ఆ నేరానికి సంబంధించిన నిజాలను వెలికితీసే క్రమంలో రెండు వేర్వేరు దర్యాప్తులు ప్రారంభమవుతాయి. సమాధానాల కోసం అన్వేషణ మరింత లోతుగా సాగే కొద్దీ, కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల దారులు కలుస్తాయి. అయితే విధి నిర్వహణ, న్యాయం విషయంలో ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒకే కేసులో రెండు వ్యతిరేక వైపులా నిలిచిన వీరిద్దరూ.. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆలోచ‌న‌కే సవాల్ విసిరే పరిస్థితులను ఎదుర్కొంటారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..వాస్తవికతకు దగ్గరగా సాగుతున్న‌ట్లుపిపిస్తుంది. కథ ముందుకు సాగే కొద్దీ ఒక్కో కొత్త విషయం బయటపడుతూ కేసుపై ఉన్న ఆలోచ‌న‌నే మార్చేస్తుంది. ఉత్కంఠను క్రమంగా పెంచుతూ సాగిన ట్రైలర్‌లోని పదునైన, ఆలోచింపజేసే సంభాషణలు నిజం, న్యాయం గురించి కొన్ని కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అదే సమయంలో ‘డాయ్‌రా’ కేవలం జరిగిన నేరం గురించే కాకుండా.. ఆ ఘటనపై ప్రజల్లో ఏర్పడే అభిప్రాయాలు, దాని చుట్టూ అల్లుకుపోయే విభిన్న కథనాలను కూడా ఆసక్తికరంగా ఆవిష్కరిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

‘డాయ్‌రా’ కథలో ప్రధానంగా సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక కథనం ఎంత త్వరగా తీర్పుగా మారిపోతుంది? ప్రతి ఒక్కరికీ ఓ అభిప్రాయం ఉన్నప్పుడు.. అసలు న్యాయం ఎలా ఉండాలనేది నిర్ణయించేది ఎవరు? మనం కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉన్నప్పుడు.. ఏది నిజమని నమ్మాలని ఎంచుకుంటాం? అనే ఆలోచింపజేసే ప్రశ్నలను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

ట్రైలర్‌లో కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు జితేంద్ర జోషి, క్షితీ జోగ్, కన్వల్‌జీత్ సింగ్, సందీప్ కులకర్ణి, తృప్తి ఖమ్కర్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. వీరి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లు కథకు మరింత భావోద్వేగాన్ని జోడిస్తున్నాయి. భిన్నమైన ఆలోచనా విధానాలు, కఠినమైన నిర్ణయాలు, వాటి పర్యవసానాల నేపథ్యంలో సాగే ఈ కథలో.. ప్రతి పాత్ర తనదైన కోణంలో కథకు మరింత ప‌దును తెచ్చేలా ఉంద‌ని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా…

కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ.. “మేఘనాతో కలిసి పనిచేసే క్ర‌మంలో.. ఒక పాత్ర గురించి మనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఆమె ప్రశ్నించేలా చేస్తుంది. ప్రతి చిన్న విష‌యం వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది. అయితే నటిగా మన సహజమైన భావోద్వేగాలను ఆమె ఎప్పుడూ దూరం చేయదు. ఇందులో నేను చేసిన డీసీపీ అజూనీ కోహ్లీ పాత్ర నా మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. ఎందుకంటే నన్ను నేను పెద్ద‌గా అన్వేషించని ఒక కొత్త కోణంలోకి ఈ పాత్ర నన్ను తీసుకెళ్లింది. నా కెరీర్‌లో ఈ దశలో ఇలాంటి కొత్త అనుభవాలు రావడం ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇక నాకు స‌మాన‌మైన ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో పృథ్వీరాజ్ ఉండటం కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయన చాలా తెలివైన నటుడు. పాత్రలో పూర్తిగా లీనమై, సహజంగా స్పందించే నటన ఆయనది. కలిసి పనిచేసేటప్పుడు మా మధ్య చాలా సహజమైన అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాలో మన చుట్టూ ఉన్న వ్యక్తులే ఆ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేలా చేశారు” అని అన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ “డీసీపీ రామన్ కుమార్ పాత్రలోని సంక్లిష్టతే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించే ఈ పాత్రలో లోపల ఎన్నో భావోద్వేగాలు, సంఘర్షణలు ఉన్నాయి. దర్యాప్తు సమయంలో ఆయన ఎదుర్కొనే ప్రశ్నలు కూడా ఈ పాత్రను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ సినిమా చివరి వరకు ఎలాంటి పక్షపాతం లేకుండా సాగుతూ.. ప్రేక్షకులు తమదైన కోణంలో కథను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వడం నాకు బాగా నచ్చింది. మేఘనా గుల్జార్ సినిమాల మేకింగ్‌ను నేను చాలా కాలంగా ఆసక్తిగా గమనిస్తున్నాను. ‘డాయ్‌రా’ ద్వారా ఆమెతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రయాణం నాకు ఎంతో మంచి అనుభవాన్ని ఇచ్చింది. కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి పనిచేయడం ఆ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. మేము సృష్టించిన ఈ ప్రపంచంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఉత్కంఠభరితంగా సాగుతూనే.. మనుషుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథ ఇది” అని అన్నారు.

డైరెక్ట‌ర్‌ మేఘనా గుల్జార్ మాట్లాడుతూ “’డాయ్‌రా’ కథను కేవలం ఏది పూర్తిగా సరైనది.. ఏది పూర్తిగా తప్పు అనే కోణంలో చూడలేం. ఇందులోని పాత్ర‌ల్లో మ‌న‌కు గ్రే షేడ్స్ కూడా క‌నిపిస్తాయి. వాటి వెనుక ఉన్న సంక్లిష్టతను కూడా ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఒక దర్శకురాలిగా ఇలాంటి గ్రే ఏరియాను తెరపై చూపించడం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే అయినా.. అదే సమయంలో ఎంతో ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇందులో పాత్రలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి, వాటి పర్యవసానాలను ఎదుర్కొంటాయి. చివరికి తెరపై జరిగే పరిణామాలను ప్రేక్షకులు తమదైన కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ‘డాయ్‌రా’లోని ప్రధాన పాత్రలకు కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు. వీరిద్దరి వంటి విభిన్నమైన, ప్రతిభావంతమైన నటీనటులతో పాటు అద్భుతమైన తారాగణం ఈ సినిమాలో భాగం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌తో నిండిన ‘డాయ్‌రా’ ప్రపంచాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులందరినీ ఈ ప్రపంచంలోకి ఆహ్వానించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని అన్నారు.

జంగ్లీ పిక్చర్స్ సీఈఓ అమృతా పాండే మాట్లాడుతూ.. “జంగ్లీ పిక్చర్స్‌లో మేం ఎప్పుడూ మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి పుట్టుకొచ్చే కథలకే ప్రాధాన్యత ఇస్తుంటాం. ముఖ్యంగా నిజ జీవిత ఘటనలు, వాస్తవ అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథలు మమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ‘డాయ్‌రా’ కూడా మా రచయితలు, మేఘనాతో కలిసి డెవ‌ల‌ప్‌ చేసిన కథ. మనం జీవిస్తున్న కాలానికి ఎంతో దగ్గరగా అనిపించే ఈ సినిమా.. కథాంశాన్ని ఎంతో సున్నితత్వంతో, బాధ్యతగా తెరకెక్కించింది. అదే సమయంలో ఇది సంఘర్షణ, నైతిక సందిగ్ధతలు, కఠినమైన నిర్ణయాలు, రెండు బలమైన భిన్నమైన దృక్కోణాలతో సాగే పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అద్భుతమైన నటీనటులు ఈ పాత్రలకు ప్రాణం పోయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పెన్ స్టూడియోస్‌తో కలిసి మేం నిర్మిస్తున్న తొలి సినిమా ‘డాయ్‌రా’ కావడం కూడా ప్రత్యేకం. వారితో కలిసి ఈ ప్రయాణంలో భాగస్వాములం కావడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ‘తల్వార్’, ‘రాజీ’ తర్వాత మేఘనాతో కలిసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాను తెరకెక్కించిన ప్రతి క్షణాన్ని మేమెంతో ఆస్వాదించాం. మాకు ఎంతగా కనెక్ట్ అయిందో.. ప్రేక్షకులు కూడా అంతే బాగా క‌నెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాం” అని అన్నారు.

పెన్ స్టూడియోస్ సీఎండీ డాక్టర్ జయంతీలాల్ గడా మాట్లాడుతూ “సినిమా కేవలం వినోదాన్ని అందించడమే కాదు.. సరైన ప్రశ్నలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలదు. ‘డాయ్‌రా’ రెండో కోవకు చెందిన సినిమా. అందుకే ఈ కథ మాకు మరింత ప్రత్యేకం. మేఘనా గుల్జార్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. కథను లోతుగా, సున్నితంగా, ఎలాంటి హడావుడి లేకుండా చెప్పడంలో ఆమె ప్రతిభ నిజంగా అభినందనీయం. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్‌ను ఒకే సినిమాలో తీసుకురావడం సినిమాకు మరింత బ‌ల‌మైన అంశంగా మారింది. వారిద్ద‌రూ తమ పాత్రలకు ఎంతో నమ్మకంతో, ఇంటెన్స్‌తో ప్రాణం పోశారు. అలాగే అర్థవంతమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే జంగ్లీ పిక్చర్స్‌తో కలిసి పనిచేయడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. వారి ఆలోచనా విధానం, మంచి కథలు చెప్పాలనే నిబద్ధత మా ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నాయి. డాయ్‌రా ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేయడమే కాకుండా.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి మనసుల్లో నిలిచిపోయే సినిమా అవుతుంద‌ని భావిస్తున్నాం” అని అన్నారు.

‘డాయ్‌రా’తో దర్శకురాలు మేఘనా గుల్జార్.. వ్యక్తిగత నమ్మకాలు, చట్టం విధించే హద్దులు రెండూ పోటాపోటీగా నిలిచినప్పుడు ఎదురయ్యే కఠినమైన నిర్ణయాలను ఆవిష్కరించే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బలమైన తారాగణంతో, విభిన్న కోణాలతో సాగే ఈ సినిమా.. చట్టం, న్యాయం, వ్యక్తిగత ఆలోచనల మధ్య ఉన్న సంఘర్షణను ఆసక్తికరంగా చూపించనుంది. పెన్ మరుధర్ డిస్ట్రిబ్యూషన్‌లో ‘డాయ్‌రా’ సెప్టెంబర్ 18, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.