Skip to content

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం

నంది అవార్డులపై ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC/APSFT&TDC) చైర్మన్‌ శ్రీ పి. భరత్ భూషణ్‌, ఎండీ కె. విశ్వనాథన్ లు నంది అవార్డులకు సంబంధించిన అంశాలపై సంయుక్తంగా పాత్రికేయుల సమావేశాన్ని శనివారం విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ లోని ఎన్‌టీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ మొదటి అంతస్తులోని ఏపీఎస్ఆర్టీసీ మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పి. భరత్ భూషణ్‌ మాట్లాడుతూ… గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టేందుకు చర్యలు చేపడుతోందన్నారు.
అదే విధంగా 2017 నుంచి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులను కూడా అందించనున్నట్లు నిర్ణయించారన్నారు. నంది ఫిల్మ్ మరియు జాతీయ చలనచిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను అమరావతి లేదా విజయవాడ వేదికగా అందించాలని నిర్ణయించారన్నారు. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా అందించాలని నిర్ణయించారన్నారు. ఈ అవార్డులన్నింటినీ డిసెంబర్ 2026 లోగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

అవార్డుల ఎంపిక ప్రక్రియ:
అక్టోబర్‌లో నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామని, నవంబర్‌లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. డిసెంబర్‌లో నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
నంది ఫిల్మ్ అవార్డులు అందించే ప్రధాన కేటగిరీలు చలన చిత్రాలు, జాతీయ సమైక్యతపై చలన చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై రచించిన ఉత్తమ రచనలు, తదితర 46 అవార్డులను అందించనున్నారన్నారు. వాటిలో ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, తృతీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, తదితర అవార్డులు ఉన్నాయన్నారు.
నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులు, ప్రశంసాపత్రంతో పాటు నగదు పారితోషికం అందించబడుతుందన్నారు. వివిధ కేటగిరీలలో 8 గోల్డ్ మెడల్స్ కూడా అందించనున్నారన్నారు.
జాతీయ చలనచిత్రాల అవార్డులకు అందించే పారితోషికం వివరాలు:
ఎన్.టి.ఆర్. నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.5 లక్షలు
బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు
నాగిరెడ్డి–చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు – రూ.2 లక్షలు

అవార్డు గ్రహీతలకు జ్ఞాపికతో పాటు సన్మాన పత్రం, నగదు పారితోషికం అందించబడుతుందన్నారు.

టీవీ విభాగంలో నంది టీవీ అవార్డులు
టెలి చిత్రాలు
టీవీ ఫీచర్స్
టీవీ మెగా సీరియల్స్
టీవీ డైలీ సీరియల్స్
టీవీ బాలల చిత్రాలు
టీవీ డాక్యుమెంటరీ చిత్రాలు
టీవీ సామాజిక సంబంధిత చిత్రాలు
టీవీ విద్యా విషయక చిత్రాలు

తదితర విభాగాల్లో మొత్తం 48 అవార్డులను అందించనున్నారన్నారు. వాటిలో:

ప్రథమ ఉత్తమ టెలీ ఫిల్మ్
ద్వితీయ ఉత్తమ టెలీ ఫిల్మ్
ప్రథమ ఉత్తమ టెలీ ఫీచర్స్
ద్వితీయ ఉత్తమ టెలీ ఫీచర్స్
ప్రథమ ఉత్తమ మెగా టీవీ సీరియల్
ద్వితీయ ఉత్తమ మెగా టీవీ సీరియల్
ప్రథమ ఉత్తమ డైలీ టీవీ సీరియల్
ద్వితీయ ఉత్తమ డైలీ టీవీ సీరియల్
ప్రథమ ఉత్తమ టీవీ బాలల చిత్రం
ద్వితీయ ఉత్తమ టీవీ బాలల చిత్రం

అదేవిధంగా ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, హాస్య నటుడు, హాస్య నటి, ప్రతినాయకుడు, బాలల నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత తదితర విభాగాల్లో అవార్డులు అందించనున్నారన్నారు. నంది టీవీ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులు, ప్రశంసాపత్రంతో పాటు నగదు పారితోషికం అందించబడుతుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC/APSFT&TDC) చైర్మన్‌ శ్రీ పి. భరత్ భూషణ్‌, ఎండీ కె. విశ్వనాథన్ లు తెలియజేశారు.

https://we.tl/t-NjeUDOPw9Eztib0v

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.