Skip to content

‘డోంట్ స్లీప్’ ఎడ్జ్ అఫ్ ది సీట్ టీజర్ లాంచ్

‘డోంట్ స్లీప్’ చాలా కొత్త కథతో వస్తున్న సినిమా. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఇంద్ర రామ్

మలయాళ దర్శకుడు షామ్‌దత్, యంగ్ హీరో ఇంద్ర రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మమ్ముట్టి నటించిన మలయాళం–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ .. ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 2.

నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ కలిసి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. పెళ్లి తర్వాత సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్న కథానాయకుడి జీవితంలోకి ఓ కల రూపంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంటుంది. అతను కన్న కలల్లో ఒకటి నిజం కావడం మొదలైనప్పటి నుంచి అతని జీవితం తలకిందులవుతుంది. అతన్ని చంపాలని ప్రయత్నిస్తున్న ఓ మిస్టరీ వ్యక్తి నిరంతరం వెంటాడుతుంటాడు. ప్రాణాలు ప్రమాదంలో పడటంతో అప్రమత్తంగా ఉంటూ, తనను తాను కాపాడుకోవడానికి కథానాయకుడు పోరాడాల్సి వస్తుంది. ‘ “The longer you sleep, the closer he gets.’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా ఉత్కంఠను పెంచుతోంది.

ఇంతకుముందెన్నడూ చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు షామ్‌దత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కథనం, ఆకట్టుకునే వాయిస్ ఓవర్, ప్రత్యేకమైన విజువల్ ట్రీట్‌మెంట్ టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. సినిమాటోగ్రాఫర్‌గా కూడా షామ్‌దత్ తన ప్రతిభను చాటుకున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో సినిమా మూడ్‌ను, ఉత్కంఠను మరింత పెంచారు. గోకుల్ హర్షన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది.

‘పుష్ప: ది రైజ్’, ‘రంగస్థలం’ చిత్రాలకు పనిచేసిన మోనికా–రామకృష్ణ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టేట్ అవార్డు గ్రహీత మనోజ్ ఎడిటింగ్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ చిత్రానికి పనిచేసిన సజీర్ బాబా, లూనా ఈ కథను అందించారు.

ఇంద్ర రామ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో రవీంద్ర విజయ్ బలమైన ముద్ర వేశారు. ముఖ్యంగా చివరి సన్నివేశంలో ఆయన నటనలోని వైవిధ్యం కనిపిస్తోంది. తబా రీమా, జోయీత బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విభిన్నమైన కథాంశం, విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో ‘డోంట్ స్లీప్’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో పాటు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఆసక్తికరమైన థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాగచైతన్య గారికి, దుల్కర్ సల్మాన్ గారికి, విజయ్ సేతుపతి గారికి ధన్యవాదాలు. అలాగే ఈవెంట్‌కు వచ్చిన డైరెక్టర్లకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. షామ్ గారు కథ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇద్దరం కలిసి కేరళ వెళ్లి లొకేషన్స్ రెక్కీ చేశాం. 15 రోజుల్లో షూటింగ్ మొదలుపెట్టాం. డీఓపీనే డైరెక్టర్ అవడం వల్ల తనకు అనుకున్నట్టుగా చేయగలిగారు. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఈ జర్నీలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి క్వాలిటీతో సినిమా వచ్చింది. మా నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. శ్యామ్ గారితో నాకు చాలా ఎమోషనల్ జర్నీ. ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో కేర్ తీసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది. దేవకట్ట గారు తన టైమ్ కేటాయించి కొన్ని డైలాగ్స్ రాశారు. అలాగే ఒక సాంగ్ కూడా రాశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

డైరెక్టర్ షామ్ దత్ మాట్లాడుతూ.. నేనొక విజువల్ పర్సన్‌ని. నేను తీసిన విజువల్ సినిమాలో ఉంటుంది. అదే మాట్లాడుతుంది. ఈ వేడుకకు వచ్చిన ప్రసాద్ గారికి, నా డైరెక్టర్ మిత్రులందరికీ థాంక్యూ. వాళ్లందరూ నా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా కొత్త కథ. సినిమా చూసి మీరే చెప్పాలి. అందరికీ థాంక్యూ సో మచ్. చాలా మంచి టీమ్‌తో కలిసి సినిమా చేశాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంద్ర ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను అన్ని విభాగాల్లో పని చేశాడు. తనలాంటి ప్యాషనేట్ యాక్టర్ దొరకడం నాకు హ్యాపీగా అనిపించింది.

హీరోయిన్ జోయీతా బెనర్జీ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా తొలి సినిమా.అందరికీ ఫస్ట్ సినిమా చాలా స్పెషల్. నిర్మాతలకు ధన్యవాదాలు. ఇంత మంచి టీమ్‌తో కలిసి పని చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్యామ్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఇంద్ర కూడా చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీరందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

అనీష్ కురువిల్లా మాట్లాడుతూ.. షామ్ గారు ప్రతి ప్రాజెక్ట్‌లో ఏదో ఒక స్పెషల్ చేసేవారు. ఇది చాలా హై కాన్సెప్ట్ ఐడియా ఉన్న సినిమా. తెలుగు సినిమాకు ఇప్పుడు చాలా ఫ్రెష్, కొత్త కంటెంట్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. శ్యామ్ గారు ఎంతోమందిని లాంచ్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్‌గా లాంచ్ అవుతున్నారు. నిజంగా ఆయనలో చాలా మంచి డైరెక్టర్ ఉన్నారు. నాకు చాలా హెల్ప్ అయ్యారు. ఆయన చాలా మంచి వ్యక్తి. టీజర్ చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. నిజంగా ఒక హాలీవుడ్ కంటెంట్‌ను మీరు ఆశించవచ్చు.

డైరెక్టర్ దేవకట్టా మాట్లాడుతూ.. నేను షామ్ ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాం. ఆయన లేకుంటే ప్రస్థానం అయ్యేది కాదు. తను మంచి సినిమా లవర్. ప్రస్థానం టైమ్‌లో తనను డైరెక్షన్ చేయమని చెప్పాను. కచ్చితంగా ఇది చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అవుతుంది. ఇందులో చిన్న కామియో కూడా చేశాను. తనతో పని చేస్తున్నప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. శ్యామ్ గారిలో చాలా ఆలోచనలు ఉంటాయి. అన్ని క్రాఫ్ట్స్‌పై చాలా మంచి కమాండ్ ఉంది. ఈ టీజర్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా విజువల్స్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. ఈ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. శ్యామ్ నాకు మంచి స్నేహితుడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్‌తో వస్తుంటారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్యామ్ దత్ డీఓపీగా పనిచేసిన సినిమాల్లో 80 శాతానికి పైగా విజయాలు ఉన్నాయి. ఈ సినిమాతో దర్శకుడిగా కూడా ఆయన గ్యారెంటీగా మంచి సినిమా అందిస్తారనే నమ్మకం ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్.

నటీనటులు: ఇంద్ర రామ్, రవీంద్ర విజయ్, తబా రీమా, జోయీతా బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్పలత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిశోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రం, రఘుబాబు

సాంకేతిక బృందం:
దర్శకత్వం, డీవోపీ: షామ్‌దత్ ఐఎస్‌సీ
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: సజీర్ బాబా, లూనా జబిన్
నిర్మాత: వీ చుడామణి
నిర్మాణ సంస్థ: వీ డ్రీమ్ ఫిలిమ్స్
సంగీతం: గోకుల్ హర్షన్
ప్రొడక్షన్ డిజైన్: మోనికా రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.