Skip to content

‘హై’ జెన్ జీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా: డైరెక్టర్, హీరో ఎస్ కృష్ణ

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు ఎస్ కృష్ణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి? హై సినిమా ఎలా మొదలైయింది?
నేను డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి సినిమాలకు రచయితగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తుంటాను. ‘గాలి సంపత్’ సినిమాకు నిర్మాతగా కూడా చేశాను. నేను దర్శకుడు, నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ‘అతడు’ సినిమా సమయంలో అనిల్ రావిపూడి గారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరం రూమ్‌మేట్స్ అయ్యాం. నేను సీరియల్స్‌లో కూడా నటించాను. ‘అమృతం’ సీరియల్‌లో హర్షవర్ధన్ గారు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత అనిల్ గారి బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారి దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేశాం. అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. తర్వాత అనిల్ గారి ‘పటాస్’ సినిమా నుంచి రైటర్‌గా పనిచేశాను.

-రచయితగా నా ప్రయాణం హాయిగా, కంఫర్ట్‌గా సాగుతోంది. కాకపోతే నేను నటుడు, దర్శకుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ఒక మంచి కథ చెప్పాలని ‘హై’ సినిమా రాసుకున్నాను. ఈ కథను నేనే దర్శకుడిగా, నటుడిగా చేస్తే బాగుంటుందనిపించింది. సినిమా చూసిన తర్వాత నటుడిగా, దర్శకుడిగా ఏది బాగా చేశానో ప్రేక్షకులు చెప్పాలి. అనిల్ సినిమాలకు పనిచేస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడు నా సొంత డబ్బులతో ఈ సినిమా చేశాను. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకారం అందించారు.

-ఇది డిఫరెంట్ మూవీ. కొత్త నటులు ఉన్నప్పుడు బిగినింగ్‌లో కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, ఒక్కసారి కథలోకి వెళ్లిన తర్వాత అందులో లీనమైపోతారనే నమ్మకం ఉంది. ఇందులోని పాత్రలన్నింటికీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

-ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక హై ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘హై’ అనే టైటిల్ పెట్టాను. ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారు.

-నేను డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. దాదాపు అనిల్ సినిమాలన్నీ పలు ఏరియాల్లో పంపిణీ చేశాను. అలాగే కొన్ని ఇతర సినిమాలు కూడా చేశాను. దాదాపు నేను పనిచేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ‘హై’ కథ రాసుకున్నప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో ఎంత ఆస్వాదిస్తారనేది చూసుకున్నాను. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా హై ఫీలయ్యారు. కచ్చితంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుంది. ఇది జెన్జీ యూత్, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా.

మీకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడు పుట్టింది?
-మాది గుడివాడ. అక్కడ సినిమా వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక స్వీట్ మెమొరీ ఉంది. నా చిన్నతనంలో ఎన్టీఆర్ గారు మా నియోజకవర్గానికి వచ్చారు. మా అమ్మ నన్ను ఎత్తుకుంది. నేను ‘జై ఎన్టీఆర్’ అని గట్టిగా అరిస్తే ఆయన అభివాదం చేసిన సందర్భం నాకు గుర్తుంది. అది చిన్నప్పుడు నాకు చాలా హై మూమెంట్.

-అలాగే నేను సినిమాల్లోకి రావడానికి మరొక కారణం చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు.. అందరి సినిమాలనూ ఎంజాయ్ చేశాను.

-నేను ఏఎన్‌ఆర్ కాలేజీలో చదివాను. ఆ కాలేజీకి మా నాన్నగారు సూపరింటెండెంట్. అక్కడ మూడు నెలలకు ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చేవారు. అప్పుడప్పుడు ఆయనను కలుస్తుండేవాడిని. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఒక ఆసక్తి ఉండేది.

ఈ కథ రాసుకున్నప్పుడు ముందు ఎవరికైనా చెప్పారా?
-అంతా కొత్తవాళ్లతో చేయాలనేది నా ఆలోచన. కాకపోతే నా క్యారెక్టర్‌ను ముందు నేనే యాక్ట్ చేస్తానని అనుకోలేదు. ఒకరిద్దరిని అప్రోచ్ అయ్యాను. కాకపోతే డేట్స్ కుదరలేదు. దానివల్ల నేను నటుడిగా చేయాల్సి వచ్చింది. కాకపోతే ఇకపై నేను డైరెక్ట్ చేసే సినిమాల్లో యాక్టింగ్ చేయకూడదని, యాక్టింగ్ చేసే సినిమాల్లో డైరెక్షన్ చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్షన్, యాక్టింగ్ రెండూ డిఫరెంట్. ఈ రెండూ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.

బుల్లిరాజుతో పెట్టిన ఫైట్ గురించి?
-నాకు చిన్నప్పటి నుంచి యానిమేషన్, యానిమో సినిమాలంటే ఇష్టం. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. దానికి యానిమేషన్ మిక్స్ చేస్తూ, అలాగే ఫాంటసీని కూడా మిక్స్ చేసి చూపించాం. అందులో ఉండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తుంది. జెన్ జీ ఆడియన్స్‌కు అది నచ్చుతుందని నమ్ముతున్నాను.

అనిల్ రావిపూడి గారి సినిమాలన్నీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి కదా.. మీ తొలి సినిమాకు ఇలాంటి కథను ఎంచుకోవడానికి కారణం?
-అనిల్ గారికి ఒక మార్క్ ఉంది. ఆయన కథను ఆయనే రాసుకుంటారు. ప్రతి విషయాన్ని ఆయనే ఎంపిక చేసుకుంటారు. అనిల్ గారికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. తను అలాంటి ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

నేను కథ రాసుకున్నప్పుడు నాదంటూ ఒక స్టైల్‌లో రాసుకున్నాను. బడ్జెట్ విషయంలో కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాం. ఇందులో స్క్రీన్‌ప్లే ఆంథాలజీ స్టైల్‌లో ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆంథాలజీ అనే ఫీలింగ్ రాదు. ఆ పాత్రలన్నీ ఒకే సినిమాలా అనిపిస్తాయి.

-తెలుగు ఆడియన్స్, ప్రపంచ ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు. సినిమా బాగుంటే ఏ భాష సినిమా అయినా చూస్తారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకుల మీద నమ్మకంతో, మంచి కంటెంట్‌ను ఆదరిస్తారనే నమ్మకంతో చేశాను.

మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు?
-నాకు అనిల్ రావిపూడి గారు కూడా ఇష్టం. కాకపోతే తన స్టైల్‌ను నేను అనుకరించలేను. అలాగే మణిరత్నం గారంటే ఇష్టం. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను ఇష్టపడతాను.

‘గాలి సంపత్’ సినిమా మీరు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు కదా?
-అది చాలా మంచి కథ. కాకపోతే ఆ సమయానికి అది కరెక్ట్ సినిమా కాదని అనిపిస్తుంది. కరోనా సమయంలో వచ్చిన సినిమా అది. ఆ టైమ్‌లో అందరూ నవ్వులు కోరుకున్నారు. నిజానికి అది ఓటీటీకి చేయాల్సిన సినిమా. ఎందుకో థియేటర్స్‌లో ప్రేక్షకులను సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయిందని అనిపించింది. కాకపోతే రామోజీరావు గారికి ఆ సినిమా చాలా నచ్చింది. ఆయన చాలా అభినందించారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి?
-నాదంటూ ఇంకా ఏ ప్రాజెక్ట్ అనుకోలేదు. కాకపోతే అనిల్ గారివి ఉంటాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లోనే మరో కథపై కూర్చోబెడతారు. సినిమా పూర్తయిన తర్వాత దుబాయ్ వెకేషన్‌కు వెళ్దామని మాటిస్తారు కానీ అవేమీ జరగలేదు. సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లోనే వైజాగ్ తీసుకెళ్లి కూర్చోబెడతారు.(నవ్వుతూ) మళ్లీ స్క్రిప్ట్ వర్క్ మొదలవుతుంది.

‘హై’ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా సరే, నాకు నటుడిగా కొన్ని పాత్రలు తీసుకొస్తే చేయాలని కోరుకుంటున్నాను. అనిల్ గారితో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.

ఎన్టీఆర్ గారు, అనిల్ గారి ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది?
-అది చాలా క్రేజీ ప్రాజెక్ట్. ఎన్టీఆర్ గారు, అనిల్ గారిది బెస్ట్ కాంబినేషన్. ఎప్పుడెప్పుడు దానిపై వర్క్ చేస్తానా అనే ఉత్సాహం ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.