Skip to content

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ Telugu News
టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ Telugu News

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్ సాయి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో..

వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ .. ‘మా కమిటీ కొత్తగా ఎన్నికైంది. మేం విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాల మీదే ఫోకస్ పెట్టాం. చదలవాడ శ్రీనివాసరావు గారు ఉగాది నాడు ఓ గొప్ప ఆలోచనను మాతో పంచుకున్నారు. నిర్మాతలుంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. టాలెంట్ ఉండి కూడా యూనియన్ మెంబర్ షిప్ కోసం కష్టపడాల్సి వస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. మా అసోసియేషన్‌లోని మెంబర్లకు ఆయన గొప్ప అవకాశం ఇస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు. మా డైరెక్టర్ అసోసియేషన్‌లోని మెంబర్లు చెప్పిన కథలు, బౌండెడ్ స్క్రిప్టుల్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఈ మేరకు కమిటీ ఆల్రెడీ పని చేస్తోంది. ఒకరికి ఒక అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఒకేసారి ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఆ సినిమాల్లో లాభాలు వస్తే.. యూనియన్‌కే ఇస్తాను అని ఆయన అన్నారు. ఇది మాకు అవకాశం కాదు.. వరం.. ఆయనకు శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘టీఎఫ్‌డీఏకి ట్రెజరర్‌గా ఉండటం గర్వంగా ఉంది. విద్య, వైద్యం, ఉపాధి అనే నినాదంతో మేం ఎన్నికల్లో గెలిచాం. ఉపాధి ఎలా కల్పించాలనే మథనం మా అందరిలో ఉండేది. అయితే ఉగాది నాడు చదలవాడ శ్రీనివాసరావు గారు దేవుడి రూపంలో మాకు వరమిచ్చారు. ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తానని, లాభాల్ని కూడా మా యూనియన్‌కే ఇస్తానని ఆయన అన్నారు. ఆయన ఇచ్చిన అవకాశంతో ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్, కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని, లాభాల్ని కూడా తెచ్చి పెడతామని హామీ ఇస్తున్నాం. బెస్ట్ కథల్ని ఎంచుకుంటున్నాం. ప్రసన్న గారి డైరెక్షన్‌లో ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి చిత్రాల్ని అందిస్తామ’ని అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘మీడియా నాకు ఎన్నో ఏళ్ల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇలా పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ వీఎన్ ఆదిత్య గారు మాత్రం నా చేతుల మీదుగానే ఈ ప్రకటన జరగాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించలేకపోయినా.. కళామతల్లికి చేసిన సేవతో నాకు సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏఎన్నార్ గారు, శోభన్ బాబు గార్ల దగ్గరి నుంచి నేను ఎంతో మందితో ఎన్నో సినిమాలు తీశాను. నాకు అజయ్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్‌. ఆయన నాకు ‘జీవిత ఖైదు’ 75 లక్షల్లో తీసి పెట్టారు. అప్పట్లో నాకు ఏడు కోట్ల షేర్ వచ్చింది. నేను అప్పట్లో ప్రతీ సినిమాని 30 నుంచి 40 రోజుల్లో తీశాను. నాకు ఇప్పుడున్న ఇండస్ట్రీ కన్నా అప్పుడున్న ఇండస్ట్రీ అంటేనే ఇష్టం. శోభన్ బాబు గారు, ఏఎన్నార్ గారు లాంటి హీరోలు మాకెంతో సపోర్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియ్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని అన్నారు.

ప్రముఖ దర్శకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘ఇలాంటి ఓ నిర్ణయం, ఇలాంటి ఓ గొప్ప కార్యక్రమం ఇంత వరకు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. చదలవాడ శ్రీనివాసరావు గారితో ‘జీవిత ఖైదు’ తీసి.. ఆయన ఇంట్లోనే జీవిత ఖైదీ అయ్యాను. కోదండ రామిరెడ్డి గారి వద్ద నేను ముఖ్య శిష్యుడ్ని. 30, 40 రోజుల్లోనే క్రమశిక్షణతో సినిమాని తీసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు దర్శకులే బడ్జెట్స్ వేస్తున్నారు. కానీ మాకు మాత్రం అప్పట్లో లావాదేవీల గురించి ఏ మాత్రం తెలిసేది కాదు. స్క్రిప్ట్ కరెక్ట్‌గా ఉంటే బడ్జెట్ కూడా పరిధిలోనే ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు గారికి ఇలాంటి ఓ గొప్ప ఆలోచన రావడం ఎంతో మందికి వరంగా మారింది’ అని అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘చదలవాడ శ్రీనివాసరావు గారు కరోనా సమయంలో ఎంతో మంది నిర్మాతలకు, సినీ కార్మికులు, శ్రామికులకు నేరుగా డబ్బుల్ని పంపించారు. చిత్రపురిలో నాలుగు వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడకూడదని కొన్ని కోట్ల రూపాయల్ని ఇచ్చారు. జర్నలిస్ట్‌ల సోదరులకు కూడా వంద ఫ్లాట్స్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన బ్లెస్ చేసిన అందరూ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత ఆయన ఇంటికి డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్స్ వెళ్తే ముప్పై కోట్లు ఇస్తాను.. పది సినిమాలు తీయండని ఈ ప్రపోజల్ పెట్టారు. అందరికీ అండగా ఉంటానని ఆయన భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారిని మనం కాపాడుకోవాలి.. వాళ్లు మన ఇండస్ట్రీని కాపాడుకుంటారరు’ అని అన్నారు.

ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ .. ‘ఎన్నికలయ్యాక మేం చదలవాడ శ్రీనివాసరావు గారికి ఇంటికి వెళ్లి కలిశాం. ఉగాది నాడు మాకు ఆయన ఇచ్చిన వరమే ఇది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయండని ఆయన అన్నారు. పది సినిమాలు తీయండి.. నష్టమొస్తే పట్టించుకోకండి.. లాభం వస్తే యాభై శాతం టీఎఫ్‌డీఏకి ఇస్తానని ఆయన అన్నారు. బడ్జెట్, సబ్జెక్ట్ పరంగా మేమంతా జాగ్రత్తగా ఉంటాం. పది సినిమాల్ని హిట్ చేస్తామని హామీ ఇస్తున్నామ’ని అన్నారు.

నవీన్ మేడారం మాట్లాడుతూ .. ‘సాయి రాజేష్ గారి ప్రోత్సాహంతో నేను ఇక్కడకు వచ్చాను. ‘90స్ మిడిల్ క్లాస్ మెలోడీస్’ సిరీస్‌ని నేను రెండున్నర కోట్లతో 25 రోజుల్లో తీశాం. నాతో ఆ సినిమాకి పని చేసిన దర్శకుడు ‘లిటిల్ హార్ట్’ అని రెండున్నర కోట్లతోనే తీశాడు. అలాంటిది ముప్పై కోట్లు ఇచ్చి పది సినిమాలు తీయమనడం గొప్ప వరం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.