మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే…
మలయాళ సూపర్‌స్టార్స్, మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’.. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్


జీ5 లో మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయయణన్ తెరకెక్కించారు. 18 ఏళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ చిత్రంలో కలిసి నటించారు. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్చాకో బొబన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పేట్రియాట్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాటకీయతలను కలిపి రూపొందించిన ఈ సినిమాలో అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించారు. కథలో ప్రధాన పాత్రధారి దేశ భద్రత కోసం ఒక అత్యాధునిక ప్రభుత్వ నిఘా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఆ వ్యవస్థను నిరపరాధ ప్రజలపై మోసం, బ్లాక్మెయిల్, నియంత్రణల కోసం వాడుతున్నారని తెలుసుకున్న తర్వాత అతని ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. నిఘా వ్యవస్థను రూపొందించటంతో కీలకంగా మారిన ఆ వ్యక్తే దానికి ఎదురు నిలుస్తాడు. తను నిజాన్ని బయటపెట్టడం దేశద్రోహమా? లేక నిజమైన దేశభక్తి చర్యనా? అనే ప్రశ్నలతో పోరాటం చేయాల్సి వస్తుంది. దేశభక్తి, దేశ ద్రోహం మధ్య ఉన్న సన్నని గీతను ఈ సినిమాలో అర్థవంతంగా, ఆసక్తికరంగా రూపొందించారు.
పేట్రియాట్ మూవీలో భారతీయ సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకున్నప్పటికీ, నిఘా వ్యవస్థలు..ప్రైవసీ వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న అంశాలను స్పృశించేలా, భారీ కుట్ర, భావోద్వేగాలను నిండిన కథతో పేట్రియాట్ సినిమాను తెరకెక్కించారు. మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్చాకొ బొబన్ స్క్రీన్ ప్రెజన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. వీరితో పాటు రేవతి, రాజీవ్ మీనన్, దర్శనా రాజేంద్రన్, జరీన్ సాహిబ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఉత్కంఠభరితంగా, ఆలోచింపజేసేలా దర్శకుడు మహేష్ నారాయణన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా..
దర్శకుడు మహేష్ నారాయణన్ మాట్లాడుతూ, “పేట్రియాట్ మూవీ మనం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ప్రజలను రక్షించడానికి రూపొందించిన టెక్నాలజీనే చివరకు భయం, నియంత్రణకు ఆయుధంగా మారే పరిస్థితులను ఈ సినిమాలో చూపించాం. ఒకప్పుడు పూర్తిగా నమ్మిన వ్యవస్థ వల్ల కలిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పడే భావోద్వేగ సంఘర్షణ అనే అంశం నాకు బాగా నచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ మలయాళం జీ5లో పేట్రియాట్ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
మమ్ముట్టి మాట్లాడుతూ “పేట్రియాట్ మూవీ ఎంతో ప్రత్యేకమైన సినిమా. భారీ రేంజ్లో చేసిన మూవీ. రాజకీయ ఉత్కంఠ అనే అంశం మాత్రమే కాకుండా.. ఇది మనసాక్షి, బాధ్యత, ధైర్యం గురించి చెప్పే బలమైన మానవీయ కథ. ఈ సినిమా కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతూనే భావోద్వేగాలకు కనెక్ట్ అవుతుంటుంది. ప్రేక్షకులు దీన్ని మలయాళం జీ5లో చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
మోహన్ లాల్ మాట్లాడుతూ ‘‘ పేట్రియాట్’ ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం గురించి మాట్లాడే సినిమా. నిజం, అధికారం మధ్య జరిగే నిరంతర సంఘర్షణను ఆవిష్కరిస్తుంది. సినిమాటిక్‌గానే కాకుండా, సమకాలీనంగా కూడా అనిపించే చిత్రంలో భాగం కావడం ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఇలాంటి సినిమాలో ఎన్నో ఏళ్ల తర్వాత మమ్ముట్టితో మళ్లీ కలిసి నటించడం ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది” అని తెలిపారు.
జూన్ 5 నుంచి మలయాళ జీ5లో మలయాళం, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘పేట్రియాట్’ మూవీని మిస్ చేయకండి.
