Skip to content

‘ఫంకీ’ చిత్రం నుంచి మూడో గీతం ‘యమ యమ్మ’ విడుదల

  • MOVIES
  • Vishwanath
‘ఫంకీ’ చిత్రం నుంచి మూడో గీతం ‘యమ యమ్మ’ విడుదల Telugu News

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న ‘ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది. సోమవారం సాయంత్రం తిరుపతిలో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.

శ్రోతలను ఉర్రూతలూగించేలా భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతం, విన్న వెంటనే ఆకట్టుకునేలా ఉంది. అందరూ కాలు కదిపేలా భీమ్స్ అందించిన ఉత్సాహభరిత సంగీతం, ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేవ్ పవార్ అందించిన సాహిత్యం, మాస్ పాటకు తగ్గట్టుగా మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఉంది. గాయని రోహిణి సోరట్ తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించడం విశేషం. తమ ఉత్సాహభరితమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. నాయకానాయికలు విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ పై చిత్రీకరించిన ఈ పాట.. అదిరిపోయే మాస్ బీట్ లు, ఆట సందీప్ మాస్టర్ అద్భుతమైన నృత్యరీతులతో మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా మారింది.

గీతావిష్కరణ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ఫంకీ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి థియేటర్ కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు.” అన్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతానికి శ్రోతలలో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తొలి గీతం ‘ధీరే ధీరే’, రెండో గీతం ‘రట్టాటటావ్’ చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ‘యమ యమ్మ’ కూడా అదే జోరును కొనసాగిస్తూ సంగీత ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఫంకీ’ ట్రైలర్ విశేష స్పందనను సొంతం చేసుకుంది. కె.వి. అనుదీప్ శైలి హాస్యంతో విశ్వక్ సేన్ నవ్వులు పూయించిన తీరు కట్టిపడేసింది. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

స్వచ్ఛమైన హాస్యానికి పర్యాయపదంగా నిలిచిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జాతిరత్నాలు’ను అందించిన దర్శకుడు కె.వి. అనుదీప్, తన శైలి కామెడీ విందును మరోసారి అందించడానికి ‘ఫంకీ’తో తిరిగి వస్తున్నారు. ఈసారి రెట్టింపు వినోదంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఫంకీ’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ‘ఫంకీ’ చిత్రం, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాల విందుని అందించనుంది.

చిత్రం: ఫంకీ
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
కళా దర్శకుడు: జానీ షేక్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.