Skip to content

దేవ కట్టా సమర్పణలో రూపొందుతోన్న ‘జో జో’

వైవిధ్యంగా, సీరియస్‌గా, ఆలోచింపజేసే కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘మయసభ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, కొత్త జీవితంపై ఆశ‌లు, జీవితంలో ఎదగాలనే తపన.. మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన వెళ్లే తీరుని వ్యంగ్య హాస్యంతో ‘జో జో’ చిత్రంలో ఆవిష్క‌రించ‌బోతున్నారు.

ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు పేద యువకులు, ఒక ధైర్యమైన యువతి తమ జీవితాలను ఒక్కసారిగా మార్చేయగల ఓ వజ్రం కోసం వేట మొదలుపెడతారు. ఆ ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, జీవితాలు మారిపోతాయని వారు ఆశపడతారు. అయితే డబ్బు కోసం మొదలైన వారి వేట అంత సులభంగా సాగదు. ప్రేమ, సరదా సంఘటనలు, అత్యాశ, మోసం, ప్రమాదాలు.. ఇలా ఊహించని పరిణామాలతో వారి ప్రయాణం గందరగోళంగా మారుతుంది. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని మలుపులతో ఆ వజ్రం కోసం సాగించే వేట మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో అక్కడి విచిత్రమైన మనుషులు, పరిస్థితుల చుట్టూ ‘జో జో’ ఓ భిన్నమైన, నేటివిటీతో కూడిన రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది.

శుక్ర‌వారం రోజున మేక‌ర్స్ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీన్ని గ‌మ‌నిస్తే.. రా అండ్ ఎర్తీ నేచర్‌ను ప్రతిబింబించేలా, పచ్చి నేటివిటీతో కూడిన విజువల్స్‌తో పోస్ట‌ర్‌ను రూపొందించారు. జొన్నగిరి ప్రాంతపు ల్యాండ్‌స్కేప్‌ను బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తూ, పోస్టర్‌లో ప్రధాన పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేశారు. అలాగే “హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!” అంటూ సరదాగా ఇచ్చిన వార్నింగ్‌తో సినిమాకు ఉన్న డిఫరెంట్ కామెడీ టోన్‌ను మేకర్స్ స్పష్టం చేశారు. ప్రేమ, కామెడీని ఎలాంటి హద్దులు, దాపరికాలు లేకుండా తమదైన శైలిలో చూపించబోతున్నామనే సంకేతాన్ని ఈ హెచ్చరిక ఇస్తోంది.

‘జో జో’ చిత్రాన్ని విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. కిరణ్ జయ్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మ‌య‌స‌భ త‌ర్వాత వీరి కాంబోలో వ‌స్తోన్న సినిమా ఇది. ఇందులో కృష్ణ‌ కమల్ ‘శీను’..మాహీ శ్రీ ‘సుప్రజ’ పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నారు. ఫణీంద్ర దేవరపల్లి వెంకటేష్‌గా, ప్రభావతి విజయమ్మగా, మహబూబ్ బాషా సూరిగా, సతీష్ దేవట్టే తంజోర్ రంగసామిగా, పూడూరు శరత్ బాబు రమణగా, మకరంద్ దేశ్‌పాండే ముఖేష్ షాగా కనిపించనున్నారు. టెక్నిక‌ల్‌గా రోహిత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేష్ శంకర్ సంగీత దర్శకుడిగా, మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెహమాన్, శ్రీనివాస్ మౌళి, రామచంద్ర సాహిత్యాన్ని అందిస్తున్నారు.

‘జో జో’మూవీపై ఆసక్తి పెంచే ప్రధాన అంశం.. ఈ సినిమా ప్రెజెంటేషన్‌లో కనిపించే భిన్నమైన కాంబినేషన్. సాధారణంగా సీరియస్, ఆలోచింపజేసే కథలతో సినిమాలు తెరకెక్కించే దేవ కట్టా, పూర్తిగా భిన్నమైన రూరల్ నేటివిటీ, విచిత్రమైన పాత్రలు, ప్రేమ, కామెడీతో కూడిన సినిమాను సమర్పిస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు డైమండ్ కోసం జరిగే వేటను కథాంశంగా ఎంచుకోవడం, కిరణ్ జయ్ కుమార్ అనే కొత్త క్రియేటివ్ వాయిస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ‘జో జో’పై మొదటి నుంచే క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.

కరువు పరిస్థితులతో ఉన్న గ్రామీణ నేపథ్యం, ఊహించని విధంగా వ‌జ్రం కోసం జ‌రిగే అన్వేష‌ణ‌, అదృష్టం కోసం కలలు కనే పాత్రలు.. ఆ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ‘జో జో’ ఓ డిఫరెంట్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. రా అండ్ రస్టిక్ ఫీల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సినిమా ప్రమోషనల్ జర్నీ మొదలైంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు రిలీజ్ ప్లాన్స్‌ను త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు:

కృష్ణ క‌మ‌ల్‌, మాహి శ్రీ, ఫ‌ణీంద్ర దేవ‌ర‌ప‌ల్లి, ప్ర‌భావ‌తి, మ‌హ‌బూబ్ బాషా, స‌తీష్ దేవ‌ట్టే తంజోర్‌, పూడూరు శ‌ర‌త్ బాబు, మ‌క‌రంద్ దేశ్‌పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: విజ‌యం
స‌మ‌ర్ప‌ణ‌: దేవ క‌ట్టా
నిర్మాత‌: విజ‌య్ కృష్ణ‌ లింగ‌మ‌నేని
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ జ‌య్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ: రోహిత్ కుమార్‌
సంగీతం: మ‌హేష్ శంక‌ర్‌
ఎడిట‌ర్‌: మాధ‌వ్ కుమార్ గుళ్ళ‌ప‌ల్లి
పాట‌లు: రెహ‌మాన్‌, శ్రీనివాస్ మౌళి, రామ‌చంద్ర‌
పి.ఆర్‌.ఒ: ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి(బియాండ్ మీడియా)

Deva Katta Presents l New Movie Announcement VIDEO (Copyright FREE)
https://we.tl/t-7BJXB5WnJLorsSg8

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.