నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’…
మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న ‘సర్దార్ సర్వాయి పాపన్న’ మూవీ

▪️రెండో వారంలోనూ థియేటర్లలో కొనసాగుతున్న సందడి
▪️ పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ
▪️ ఏఐ యానిమేషన్‌తో రూపొందిన తొలి తెలుగు ప్రయోగం
▪️ పాజిటివ్ రివ్యూలే మాకు గొప్ప అవార్డులు: దర్శకుడు వెంకటేష్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ నేలపై పుట్టిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘సర్దార్ సర్వాయి పాపన్న – ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల మౌత్ టాక్‌తో సినిమా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వెంకటేష్ గౌడ్ అన్నారు. ప్రేక్షకులు సినిమాలోని చారిత్రక అంశాలను, మరికొందరు సాంకేతికతను ప్రశంసిస్తున్నారని, ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. సినిమాకు మీడియా అందిస్తున్న ప్రోత్సాహానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మీడియా సంస్థలు పాజిటివ్ రివ్యూలు అందించడం తమ శ్రమకు అందించిన గొప్ప అవార్డు అని చెప్పారు. తమ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరి కృషి వల్లే సినిమా థియేటర్ల వరకు చేరిందని పేర్కొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను సినిమాగా తెరకెక్కించడం సాధారణ ప్రయాణం కాదని అన్నారు. చారిత్రక వ్యక్తి జీవితం, పోరాటం, ధైర్యం, ఆత్మగౌరవం, ఆయన కాలం నాటి సామాజిక పరిస్థితులను నేటి తరానికి అర్థమయ్యే రీతిలో తెరపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
“పాపన్న గారి చరిత్రను కేవలం ఒక యాక్షన్ కథగా చూపించకుండా, ఆయన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవం, ఆయన కాలం నాటి పరిస్థితులను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించేందుకు ప్రయత్నించాం. ఈ సినిమా ద్వారా ఆయన చరిత్ర దేశవ్యాప్తంగా మరింతమందికి చేరాలన్నదే మా ప్రధాన ఉద్దేశం” అని వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ చిత్రంలో AI ఆధారిత యానిమేషన్ టెక్నాలజీని వినియోగించడం తమకు ఒక సవాలుతో కూడిన ప్రయోగమని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించినప్పటికీ కథలోని భావోద్వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
“ఒక ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గారి గురించి తెలుసుకోవాలనుకుంటే, మా సినిమా తన లక్ష్యంలో కొంత భాగం సాధించినట్టే భావిస్తాను” అని ఆయన అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన చరిత్రగా చూడకూడదని వెంకటేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన ఒక ముఖ్యమైన చారిత్రక వ్యక్తి అని, ఆయన పోరాటం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
“మన పిల్లలు మన ప్రాంత చరిత్రను తెలుసుకోవాలి. మన యువత తమ నేలపై పుట్టిన చారిత్రక వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఎవరు గొప్పవారు, ఎవరు చిన్నవారు అనే పోటీ కంటే మన చరిత్రలోని ప్రతి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం ముఖ్యం” అని అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ పాపన్న గారి చరిత్రను మరింతమంది ప్రేక్షకులకు పరిచయం చేసే ఆలోచన ఉందన్నారు.
“ఒక సినిమా ముగియవచ్చు.. ఒక థియేటర్ రన్ ముగియవచ్చు.. కానీ చరిత్ర ముగియదు. సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్ర మరింతమంది ప్రజలకు చేరే వరకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి చేరాలి.. ఆయన ధైర్యం యువతకు స్ఫూర్తిగా నిలవాలి” అని వెంకటేష్ గౌడ్ లింగంపల్లి అన్నారు.
ప్రస్తుతం ‘సర్దార్ సర్వాయి పాపన్న – ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’ చిత్రం రెండో వారంలోనూ ప్రేక్షకుల ఆదరణతో థియేటర్లలో కొనసాగుతోంది.

