Skip to content

అక్టోబర్ 2న హిందీ జీ5లో ప్రీమియర్ కానున్న ‘పూజా మేరీ జాన్’

ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండ‌దు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ క‌థ‌లు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మ‌న‌ల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి క‌థే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 2, 2026న హిందీ జీ5లో ప్రీమియర్ కానుంది. బ‌ల‌మైన ఇన్‌టెన్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం.. పూజా చుట్టూ చోటుచేసుకునే కలవరపరిచే ఘటనల నేపథ్యంలో సాగుతుంది. తిరస్కరణ, వ్యామోహం, నిజాన్ని అంగీక‌రించ‌టం, అసలు ఏం జరిగిందనే నిజం వంటి అంశాలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుందీ చిత్రం.

ఈ సినిమా పూజ అనే ప్ర‌ధాన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమెకు సన్నిహితుడైన ఓ స్నేహితుడు ఆమెపై త‌న ప్రేమను వ్యక్తం చేయగా ఆమె త‌న‌ను తిర‌స్క‌రిస్తుంది. ఆ తర్వాత చోటుచేసుకునే ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌ప‌రుస్తాయి. కథ ముందుకు సాగేకొద్దీ అసలు ఏం జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? పూజా పరిస్థితుల కారణంగా బాధితురాలిగా మారిందా? లేక ఆమె చుట్టూ చోటుచేసుకున్న ఘటనలతో ఆమెకు ఏదైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలు మ‌న‌సులో మెదులుతాయి. పూజా చుట్టూ జరిగిన పరిణామాల వెనుక అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఈ కేసులోకి అడుగుపెట్టే న్యాయవాది సనా పాత్రలో హుమా ఖురేషీ నటించారు. పరస్పర విరుద్ధమైన వాదనల వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీసేందుకు ఆమె ప్రయత్నిస్తుంటుంది. అసలు నిజం అంతుచిక్కని పరిస్థితుల్లో ‘పూజా మేరీ జాన్’ ప్రేక్షకులను కూడా ఆలోచింపజేస్తుంది. అమాయకత్వం ఎక్కడ ముగుస్తుంది? బాధ్యత ఎక్కడ మొదలవుతుంది? అనే ప్రశ్నలతో పాటు.. తిరస్కరణ, వ్యామోహం, ఓ విష‌యంపై స‌మాజం ఎలా ఆలోచిస్తుందనే విష‌యాల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను క్రమంగా ఈ క‌థ ఆవిష్కరిస్తుంది. అక్టోబ‌ర్ 2న పూజా మేరీ జాన్ ప్రీమియ‌ర్ కానున్న సంద‌ర్భంగా…

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘‘మొదటి నుంచే పూజ పాత్ర నన్ను ఎంతగానో ఆకర్షించింది. నటిగా నాలోని విభిన్న కోణాలను ఆవిష్క‌రించుకునే అవ‌కాశం ఈ పాత్ర‌తో కుదురుతుంద‌ని, కొత్తదనాన్ని చూపించగలనని అనిపించింది. లోతైన, ఎన్నో భావోద్వేగ కోణాలు ఉన్న పాత్ర. పాత్ర చుట్టూ ఉన్న సంక్లిష్టత కార‌ణంగా న‌న్ను సినిమా న‌న్ను ఆక‌ట్టుకుంది. న‌టించే సంద‌ర్భంలో ఎన్నో రకాల భావోద్వేగాలను పలికించాల్సి వచ్చింది. అదే సమయంలో ప్రేక్షకులు స్వయంగా తెలుసుకోవాల్సిన విషయాలకు సంబంధించిన సమాధానాలను ముందే బయటపెట్టకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. సినిమాలో కనిపించేది నిజమేనా? మనం నమ్మేది సరైనదేనా? ఒక వ్యక్తి లేదా పరిస్థితి గురించి మన అభిప్రాయాలు ఎంత త్వరగా మారిపోతాయి? అనే ప్రశ్నలను కథ ఎప్పటికప్పుడు మనల్ని ప్ర‌శ్నిస్తుంది. ఈ సినిమా నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అదే సమయంలో ఎంతో సంతృప్తిని కూడా అందించింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి మన అభిప్రాయాలు, చివరికి సమాజంగా మనం చేసే తీర్పుల గురించి ఈ సినిమా లేవనెత్తే ప్రశ్నలను ఆలోచిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

హూమా ఖురేషి మాట్లాడుతూ ‘‘పూజా మేరీ జాన్’ ఆసక్తికరంగా అనిపించడానికి ప్రధాన కారణం.. సినిమాలోని కీలకమైన ఘటనను కేవలం ఒక కోణంలో మాత్రమే చూపించకపోవడం. పూజా చుట్టూ అసలేం జరిగిందో తెలుసుకునేందుకు, పరస్పర విరుద్ధంగా ఉన్న వాదనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించే సనా పాత్ర ద్వారా కథలోకి న్యాయపరమైన కోణం కూడా వస్తుంది. మన అభిప్రాయాలు వ్యక్తులను, సంఘటనలను మనం అర్థం చేసుకునే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మన ఊహలకు, అసలు నిజానికి మధ్య తేడాను గుర్తించడం ఎంత కష్టంగా ఉంటుంది? అనే అంశాలను ఈ సినిమా పరిశీలిస్తుంది. అదే సమయంలో భావోద్వేగాలకు కనెక్ట్ చేస్తూనే.. సమ్మతి, బాధ్యత, న్యాయం, సమాజం చేసే తీర్పులు వంటి అసౌకర్యం కలిగించే అంశాలపై ప్రశ్నలు సంధించే కథలో భాగం కావడం న‌టిగా నాకు ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది’’ అన్నారు.

విక్ర‌మ్ సింఘాల్ చౌహాన్ మాట్లాడుతూ ‘‘పూజా మేరీ జాన్’.. మనకు ఒక పరిస్థితి గురించి..అందులో భాగమైన వ్యక్తుల గురించి ఎంతవరకు తెలుసు? అనే ప్రశ్నను ప్రేక్షకుల మదిలో ప్రశ్నను రేకెత్తించే కథ. అందుకే ఈ సినిమా మనతో పాటు చాలాసేపు ఉండిపోతుంది. సంబంధాలు, తిరస్కరణ, హద్దులు దాటినప్పుడు పుట్టుకొచ్చే భావోద్వేగాలను ఈ కథ చూపించే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కథలోకి వెళ్లే కొద్దీ మనం సినిమా చూసే కోణం మారుతూ ఉంటుంది. అసలు నిజం ఏంటి? మనం చూస్తున్నది నిజమేనా? లేక మన అభిప్రాయాలు, ఊహల వల్ల అది అలా అనిపిస్తోందా? అనే ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి. ప్రేక్షకులకు సులభమైన సమాధానాలు ఇవ్వకుండా.. లోతుగా ఆలోచించేలా, తమ అభిప్రాయాలను మరోసారి ప్రశ్నించుకునేలా, సినిమాలో చోటుచేసుకునే పరిణామాలను తమదైన కోణంలో అర్థం చేసుకునేలా చేసే ఈ సినిమాలో భాగం కావడం నాకు ఆసక్తికరమైన, ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు.

“Pooja Meri Jaan” Trailer – https://www.instagram.com/reel/Ddqcx2aNERb

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.