Skip to content

ప్రతి జర్నలిస్టు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: ముద్దం నరసింహస్వామి

▪️తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ జర్నలిజంపై శిక్షణ
▪️ కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ఆధునిక మీడియాపై అవగాహన
▪️ ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఏఐ, సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణ

బాన్సువాడ, (కామారెడ్డి జిల్లా): మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి జర్నలిస్టు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అర్థం చేసుకుని, అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహస్వామి అన్నారు.

కామారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీయూడబ్ల్యూజే సహకారంతో ఈ శిక్షణ తరగతులు జరిగాయి.

కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి సభాధ్యక్షత వహించగా, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఏఐ జర్నలిజంపై ప్రత్యేక శిక్షణ
శిక్షణలో భాగంగా ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, కృత్రిమ మేధ, సోషల్ మీడియా, డిజిటల్ జర్నలిజం తదితర అంశాలపై ముద్దం నరసింహస్వామి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు.

మీడియా రంగంపై ఏఐ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు కొత్త సాంకేతికతను అర్థం చేసుకోవడంతో పాటు దానిని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. వార్తల సేకరణ, పరిశోధన, కంటెంట్ తయారీ, సమాచార విశ్లేషణ వంటి అంశాల్లో ఏఐ సాధనాలు జర్నలిస్టులకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏఐ ద్వారా లభించిన సమాచారాన్ని మానవీయంగా ధృవీకరించుకోవడం, సంపాదకీయ విచక్షణతో వ్యవహరించడం అత్యంత కీలకమని వివరించారు.

ఫేక్ న్యూస్.. డీప్‌ఫేక్‌లపై అప్రమత్తత
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి సమాచారాన్ని వార్తగా పరిగణించకుండా.. దాని మూలాలను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని జర్నలిస్టులకు సూచించారు.

ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్‌లు, ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించడం, సోషల్ మీడియా సమాచారాన్ని ధృవీకరించడం, సైబర్ మోసాలు–దాడుల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలను శిక్షణలో వివరించారు.

వార్తను వేగంగా అందించడం ఎంత ముఖ్యమో.. వార్త వాస్తవికత, విశ్వసనీయతను కాపాడటం అంతకంటే ముఖ్యమని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో జర్నలిజం కేవలం వార్తా సేకరణ, ప్రచురణకే పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారాలు, సోషల్ మీడియా, ఏఐ ఆధారిత సాధనాలతో ముడిపడి ఉందన్నారు.

సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి
ప్రస్తుత మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని ముద్దం నరసింహస్వామి సూచించారు. కొత్త సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, జర్నలిజం యొక్క ప్రాథమిక విలువలైన వాస్తవ నిర్ధారణ, నిష్పక్షపాతత్వం, బాధ్యత, విశ్వసనీయతను కాపాడుకోవాలని అన్నారు.

ముద్దం నరసింహస్వామికి సత్కారం
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ముద్దం నరసింహస్వామిని ఘనంగా సత్కరించారు. శిక్షణ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.