Skip to content

అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ సినిమా నుంచి ‘అమ్మ కనకదుర్గ’ పాటను ఆవిష్కరించిన తమన్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించారు. కనకదుర్గమ్మ దివ్య అనుగ్రహం, శక్తి, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. భక్తి ప్రధానంగా తెరకెక్కుతోన్న‌ ఈ చిత్రంలోని అంతర్లీన భావాన్ని ఈ పాట‌ ఆవిష్కరిస్తోంది.

విజయవాడలో ఈ పాటను విడుదల చేయడం వెనుక ప్రత్యేకమైన కార‌ణం ఉంది. శ్రీ కనకదుర్గమ్మవారి ప్రసిద్ధ ఆలయం ఉన్న ఈ నగరానికి అమ్మవారితో విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ముఖ్యంగా నవరాత్రులు, భవానీ దీక్షల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర నగరంలో ఈ పాటను విడుదల చేయడం ద్వారా, అమ్మవారిపై ప్రజలకు ఉన్న భక్తి విశ్వాసాలను ఈ పాట‌తో ముడిపెట్టారు. సినిమా సంగీత ప్రయాణానికి శ్రీకారం చుడుతున్న ఈ పాట, అమ్మవారి పట్ల భక్తులకున్న ఆరాధనా భావానికి ప్రతిబింబంగా నిలుస్తోంది.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్‌కు ఈ పాట ఎంతో ప్రత్యేకమైనది. కనకదుర్గమ్మవారికి పరమ భక్తుడైన తమన్, అమ్మవారి దర్శనం కోసం తరచూ విజయవాడకు వెళ్తుంటారు. ఆ భక్తి భావమే ఈ పాటలోనూ ప్రతిబింబించింది. మధురమైన స్వరాలు, అర్థవంతమైన సాహిత్యంతో రూపొందిన ‘అమ్మ కనకదుర్గ’ గీతం.. భక్తుడు అమ్మవారిని ప్రార్థించే భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తోంది. సినిమా పరిధిని దాటి, అమ్మవారిపై భక్తులకు ఉన్న ఆరాధనా భావాన్ని సంగీత రూపంలో ఈ పాట చాటిచెబుతోంది.

ఈ చిత్రంలో అల్లరి నరేశ్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా, బీవీఎస్ రవి కథను అందించారు. అమ్మవారి ఆధ్యాత్మిక విశిష్టత నేపథ్యంలో భక్తి, యాక్షన్, భావోద్వేగాల కలయికగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన తొలి పాట.. అమ్మవారిపై భక్తి విశ్వాసాలను ప్రతిబింబిస్తూ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.

భవానీ దీక్ష సంప్రదాయంతో ఈ సినిమాకు ఉన్న అనుబంధం.. అల్లరి నరేశ్ తన పాత్ర కోసం సిద్ధమైన తీరులోనూ కనిపించింది. షూటింగ్ సమయంలో ఆయన దీక్ష నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని తీసుకోలేదు. చెప్పుల‌ను ధ‌రించ‌లేదు.

విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు. ‘అమ్మ కనకదుర్గ’ పాటతో సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టిన చిత్ర బృందం.. భక్తి, సంగీతానికి ప్రాధాన్యమిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ సంద‌ర్భంగా..

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్నఈవీవీ సత్యనారాయణ గారు విజయవాడ కనకదుర్గమ్మకు పరమ భక్తులు. నేను ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ జోనర్స్ మూవీస్ చేశాను. అయితే తొలిసారి ‘కనకదుర్గ’ అనే భక్తిరస చిత్రంలో నటిస్తున్నాను. అందుకే ఈ వేడుకను నిర్వహించడానికి విజయవాడ సరైన వేదిక అని భావించాం. ఈ నవరాత్రుల్లో ఎక్కడ చూసినా మార్మోగిపోయేలా ఒక పాటను కంపోజ్ చేయాలని తమన్ గారిని కోరాను. ఆయ‌న అద్భుత‌మైన పాట‌ను అందించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన బీవీఎస్ రవి గారికి, అజిత్ ఠాకూర్ గారికి, సునీల్ చైనాని గారికి నా కృతజ్ఞతలు. అలాగే మా దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారికి, పాటల రచయిత సిరాశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది” అని అన్నారు.

బిర్లా స్టూడియోస్ సహ నిర్మాత సునీల్ చైనాని మాట్లాడుతూ.. “కనకదుర్గమ్మవారి భక్తి విశ్వాసాలతో ముడిపడిన విజయవాడలో, నవరాత్రుల పవిత్ర సమయంలో ‘అమ్మ కనకదుర్గ’ పాటను విడుదల చేయడం ఎంతో ప్రత్యేకం. తమన్ త‌న‌దైన శైలిలో ఈ పాటకు ప్రాణం పోశారు. సినిమాలో కీలకమైన భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను తన సంగీతంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అమ్మవారి ఆలయంలోనే ఆమెను కీర్తిస్తూ రూపొందించిన ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సందర్భంగా కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాం” అన్నారు.

టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “అమ్మవారితో ఎంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న విజయవాడలో ‘అమ్మ కనకదుర్గ’ పాటను విడుదల చేయడం మాకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం. తమన్ ఎస్ సంగీతం, సిరాశ్రీ సాహిత్యం ఈ పాటలో కనకదుర్గమ్మవారి భక్తి భావాన్ని, దివ్యశక్తిని అద్భుతంగా ఆవిష్కరించాయి. ఈ పాట భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు, వారి ప్రార్థనలు, పండుగ వేడుకల్లో భాగం కావాలని కోరుకుంటున్నాం. భక్తి విశ్వాసాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే మా ప్రయాణంలో ఈ పాట విడుదల ఒక అర్థవంతమైన తొలి అడుగు” అన్నారు.

జీ మ్యూజిక్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుజల్ పరేఖ్ మాట్లాడుతూ “సంగీతానికి భాష, సంస్కృతి, తరాలకు అతీతంగా ప్రజలను అనుసంధానించే శక్తి ఉందని జీ మ్యూజిక్ కంపెనీ విశ్వసిస్తుంది. ‘అమ్మ కనకదుర్గ’ పాట కనకదుర్గమ్మవారి ఆధ్యాత్మిక విశిష్టతను, భక్తి సంగీతానికి ఉన్న శక్తిని చాటిచెబుతుంది. ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ గీతం నవరాత్రి వేడుకల్లో, భక్తులు అమ్మవారిని స్మరించుకునే సందర్భాల్లో ఒక ప్రత్యేక భాగం కావాలని ఆశిస్తున్నాం” అని అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “కనకదుర్గమ్మవారు నా హృదయంలో ఎప్పుడూ ఎంతో పవిత్రమైన స్థానంలో ఉంటారు. అందుకే ‘కనకదుర్గ’ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ‘అమ్మ కనకదుర్గ’ పాటకు సంగీతం అందించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ పాట కేవలం ఓ సంగీత రచనలా కాకుండా.. భక్తుడు అమ్మవారిని ప్రార్థించే సమయంలో కలిగే గాఢమైన భావోద్వేగాన్ని, అమ్మవారి అపారమైన శక్తిని, కరుణను ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాను. అమ్మవారి దర్శనం కోసం తరచూ వచ్చే విజయవాడలో ఈ పాటను విడుదల చేయడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ గీతం ప్రతి భక్తుడి హృదయాన్ని తాకి, వారి ప్రార్థనలు, పండుగ వేడుకల్లో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

*‘అమ్మ కనకదుర్గ’ పాట ప్రస్తుతం జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్‌తో పాటు ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.