Skip to content

‘రౌడీ అల్లుడు’ 35 ఇయర్స్ సెలెబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘రౌడీ అల్లుడు’ చిత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్మరణీయమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ‘రౌడీ అల్లుడు’ 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థలో ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించారు.

1991లో విడుదలైన ‘రౌడీ అల్లుడు’ చిరంజీవి కామెడీ టైమింగ్, స్టైల్, స్వాగ్, డ్యాన్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆయన ద్విపాత్రాభినయం, చిత్రంలోని ఆసక్తికరమైన కథనం, గుర్తుండిపోయే సంగీతం కలసి ‘రౌడీ అల్లుడు’ ప్రేక్షకుల అభిమాన చిత్రంగా నిలిచిపోయింది.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సత్యానంద్ రచనతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో శోభన, దివ్య భారతి నటించగా.. బప్పి లహిరి సంగీతం అందించారు.

ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలెన్నో అందించడంలో గీతా ఆర్ట్స్ తెలుగు సినిమా రంగంలో కీలక పాత్ర పోషించింది. టైం లెస్ క్లాసిక్ చిత్రాల్ని అందించడంలో గీతా ఆర్ట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ‘రౌడీ అల్లుడు’ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మైలురాయి భారతీయ సినిమాకు ఆ నిర్మాణ సంస్థ అందిస్తున్న నిరంతర సేవకు, మరపురాని సినీ అనుభవాలను అందించడంలో దానికున్న వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.

మూడున్నర దశాబ్దాలు గడిచినా ‘రౌడీ అల్లుడు’ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అప్రతిహతమైన ఆదరణకు, తెలుగు సినిమా కాలాతీత మాయాజాలానికి నిదర్శనంగా నిలుస్తూనే ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.