Skip to content

ఆహారమే ఔషధం.. ఆరోగ్యమే మహాభాగ్యం.. ఏడాది పూర్తి చేసుకున్న ఆరోగ్యగ్రామం

మందుల కంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.. లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం సందేశం ఇదే!

హైదరాబాద్, అక్టోబర్ 25, 2026 : మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ఆహార కల్తీ.. శారీరక శ్రమకు దూరమవుతున్న నేటి తరం.. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యతను చాటుతూ ముందుకు సాగుతున్న ‘లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఆహారపు అలవాట్ల నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు.. సంపూర్ణ ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఆరోగ్యగ్రామం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అరుణోదయ విమలక్క, సుమన్ టీవీ వ్యవస్థాపకుడు సుమన్ దూది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ రంగం నుంచి నటుడు సప్తగిరి, కిరాక్ ఆర్‌పీ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొని లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.

ఆహారపు అలవాట్లే ఆరోగ్యానికి పునాది
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతున్న నేపథ్యంలో సమతుల్య ఆహారం, పోషక విలువలు కలిగిన భోజనం, క్రమబద్ధమైన జీవనశైలి ఎంత అవసరమో చాటిచెప్పడమే ఈ ఆరోగ్యగ్రామం ప్రధాన ఉద్దేశం. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే.. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకునే అలవాట్లను పెంపొందించుకోవాలనే సందేశాన్ని ఈ వేదిక అందిస్తోంది.
లక్ష్మణ్ పూడి స్థాపించిన ఈ ఆరోగ్యగ్రామం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. సహజ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రకృతికి దగ్గరగా ఉండే అలవాట్లను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహనను దైనందిన జీవితంలో భాగం చేయాలన్నది నిర్వాహకుల ఆలోచన.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఆహార కల్తీ తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రజలకు ఆహారం అందించడం హానికరమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తదుపరి తరాలకు అందించే సంపదలో స్వచ్ఛమైన నీరు, నాణ్యమైన ఆహారం అత్యంత ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం, పోషకాహారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేసే ఆరోగ్య కేంద్రాలు సమాజానికి మేలు చేస్తాయని తెలిపారు. ముఖ్యంగా జెన్‌జీ యువత ఆహారపు అలవాట్లు, కాలుష్య నియంత్రణ, మంచినీటి వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

ఆరోగ్యం అంటే కేవలం అనారోగ్యం లేకపోవడం మాత్రమే కాదు.. శారీరక, మానసిక శ్రేయస్సును కాపాడుకోవడం కూడా. ఈ దిశగా సమతుల్య ఆహారం, ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణ, జీవనశైలిలో అవసరమైన మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సినీ రంగానికీ ఆరోగ్యగ్రామం ఆహ్వానం
లక్ష్మణ్ ఆరోగ్యగ్రామాన్ని మరింత మందికి చేరువ చేయడంలో భాగంగా సినీ రంగానికి చెందిన చిన్న నిర్మాతలు, దర్శకులు కూడా ఇక్కడ తమ సినిమా కార్యక్రమాలను నిర్వహించుకునేలా ప్రోత్సహించాలని లక్ష్మణ్ పూడి తెలిపారు. ఇందుకోసం అవసరమైన సదుపాయాలను ఉచితంగా అందించడంతో పాటు, ఇక్కడి ఆహారాన్ని కూడా అందిస్తామని చెప్పారు. సినిమా కార్యక్రమాల కోసం ఇక్కడికి వచ్చే వారికి ఆరోగ్యకరమైన ఆహారం, సహజ జీవన విధానంలోని ప్రత్యేకతలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా వినోద రంగం ద్వారా కూడా ఆరోగ్యంపై అవగాహనను విస్తృతం చేయవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.