Skip to content

మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయుల కథ ‘ఫూలే’ : డా.పొన్నం రవిచంద్ర

సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఈ మహనీయుల జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ఫూలే’. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మించింది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి మాటలు అందించారు.

వర్ధంతి సందర్భంగా మహనీయుడి జీవితానికి నివాళి!
నవంబర్ 28, 2026 మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, ఆశయాలు, సమాజం కోసం సాగించిన పోరాటాన్ని మరింతమంది ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫూలే దంపతులు ఎదుర్కొన్న అవమానాలు, అడ్డంకులు, చేసిన త్యాగాలు, విద్య మరియు సమానత్వం కోసం వారు వెలిగించిన ఆశయ జ్యోతి ఈ సినిమాలో ప్రధానంగా కనిపించనున్నాయి.

‘ఫూలే’ కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాదు.. తరతరాలకు అందాల్సిన సామాజిక సందేశం. మహిళా విద్య, మానవ హక్కులు, సమానత్వం, మానవ గౌరవం, సామాజిక న్యాయం వంటి విలువలను గుర్తుచేసే చారిత్రక కథనం. నేటి సమాజంలో మనం అనుభవిస్తున్న అనేక హక్కుల వెనుక గత తరాలు చేసిన పోరాటం ఎంత గొప్పదో ఈ సినిమా తెలియజేస్తుంది.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. వారి సామాజిక సేవ, జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా విడుదల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సోషల్ యాక్టివిస్ట్ విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న పొన్నం రవిచంద్ర గారికి ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే గారి జీవితం అందరికీ ఆదర్శనీయం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

సోషల్ యాక్టివిస్ట్ విమలక్క మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే గారు వేసిన పునాదులు ఎంతో ముఖ్యమైనవి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘జ్యోతిరావ్ ఫూలే జీవితాన్ని తెరపైకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి. ఇకపై ఆయన జయంతి సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సునీల్ నారంగ్ గారికి, ఆడియోను విడుదల చేస్తున్న మధుర ఆడియో వారికి ధన్యవాదాలు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు విడుదలైనా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నవంబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సినిమాలో మహాత్మా ఫూలే పాత్రలో నటించిన ప్రతీక్ గాంధీ గారు హాజరవుతారు’’ అని తెలిపారు.

ఫూలే దంపతుల జీవితాలు, వారి ఆశయాలు కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు వారి పోరాటాన్ని, సమాజానికి వారు అందించిన విలువలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి గొప్ప విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర యూనిట్ కోరుతోంది.

చిత్రం : ఫూలే (తెలుగు డబ్బింగ్)
తెలుగు మాటలు: చేతన్ కత్తి
దర్శకత్వం: అనంత్ మహదేవన్
నిర్మాణ సంస్థ: సుపదా క్రియేషన్స్
నిర్మాత: డా. పొన్నం రవిచంద్ర
నటీనటులు: ప్రతీక్ గాంధీ, పత్రలేఖ
తెలుగు విడుదల: నవంబర్ 27, 2026
పీఆర్‌‌ఓ : (GK Media Ganesh, Kumar)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.