లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు…
‘యుఫోరియా’ నాకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. – సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్
సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తన విభిన్న కథనాలు, మేకింగ్, టేకింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చిన గుణ శేఖర్ రీసెంట్‌గా ‘యుఫోరియా’ అంటూ న్యూ ఏజ్ సినిమాని తెరకెక్కించారు. ‘యుఫోరియా’ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పుట్టిన రోజు (జూన్ 2) సందర్భంగా గుణ శేఖర్ మీడియాతో తన సినీ జర్నీకి సంబంధించిన విశేషాలెన్నో పంచుకున్నారు. ఆయన ఏం చెప్పిన సంగతులివే..
‘యుఫోరియా’పై వచ్చిన స్పందన మీకు ఎలా అనిపించింది?
నేను నా కెరీర్‌లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘యుఫోరియా’ ఇంకో ఎత్తు. ఇలాంటి గొప్ప సినిమాలు మళ్లీ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చూశాను. ఎంతో మంది అనలిటికల్‌గా రివ్యూలు చేస్తే.. వాటికే మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. ఈటీవీ విన్‌లోనూ, ఆహాలోనూ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్‌లోనూ రెంటల్ బేస్‌లో ఉంది. అక్కడా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. థియేటర్‌లో మిస్ అయ్యామని, మమ్మల్ని క్షమించండి అని చాలా మంది మెసెజ్‌లు పెడుతున్నారు. నిజంగా ఈ మూవీ నాకు ఒక కొత్త ఎనర్జీని తీసుకు వచ్చింది. నేను మామూలుగా ఇలా బర్త్ డేలకు ప్రెస్ మీట్‌లు పెట్టేవాడ్ని కాదు. కానీ ఇప్పుడు ఈ ‘యుఫోరియా’ ఇచ్చిన ఎనర్జీతో ఇలా మీడియాతో ముచ్చటించేందుకు వచ్చాను.
థియేటర్‌ల వరకు జనాలు రాలేదు.. అంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదా?
నేనే నిర్మాత అవ్వడం కూడా మైనస్ అయి ఉండొచ్చు. మార్కెటింగ్ పరంగా నేను ఫెయిల్ అయినట్టుగా అనిపించింది. నేను సినిమాని తీయగలను. కానీ ఆ మూవీని జనాల వరకు రీచ్ చేయడం అనేది ఓ ఆర్ట్. అందులో నేను సఫలం కాలేకపోయాను. ఇకపై నేను సొంతంగా చిత్రాల్ని చేయను. మార్కెటింగ్ పరంగా నేను కొలాబరేషన్‌లోనే వెళ్తాను.
ప్రస్తుత ట్రెండ్‌ను పట్టుకోవడంలో మీరు చేసే హోం వర్క్ ఏంటి?
నేను రోజుకి ఐదారు న్యూస్ పేపర్లు చదువుతాను. న్యూస్ పేపర్లను చదివితే ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. మైనర్ల మీద జరిగే నేరాలు, మైనర్లు చేసే నేరాలు ఇలా చాలా చాలా ఉన్నాయి. న్యూస్ పేపర్లో క్రైమ్ నైస్‌లను చదివి పక్కన పెట్టేస్తాం. కానీ అందులోని సారాన్ని పట్టి నేను ‘యుఫోరియా’ తీశాను. అసలు ఇలాంటి ఓ సినిమాని ప్రభుత్వమే కొనేసి అందరికీ ఉచితంగా చూపించాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన, అవగాహన కల్పించాల్సిన చిత్రం. కఠిన వాస్తవాల్ని చెప్పి తీరాల్సిందే, చూపించాల్సిందే.
ప్రస్తుతం వస్తున్న కథలపై మీ అభిప్రాయం ఏంటి?
హీరోల కోసం కథ రాయడం మానేయాలి. కథ రాశాక.. హీరో దగ్గరకు వెళ్లాలి. నేను అలా రాసి ఎంతో బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరో డేట్స్ ఉన్నాయి కదా అని, హీరోకి తగ్గ కథని అల్లడంతో మూసలోనే ఉండిపోతోన్నాం. శిక్ష వేయడంతో సినిమా అయిపోవడం అనేది ఒకప్పటి కాన్సెప్ట్. కానీ శిక్ష పడినోడు కూడా సమాజంలోకి వచ్చి ఎలా బతుకుతాడు.. ఎలా ఉంటాడు.. అనేది నేను చూపించే ప్రయత్నం చేశాను. అందుకే ‘యుఫోరియా’లో నేను గిల్ట్ ఫీల్‌ను చూపించాను.
హీరో కోసం కథ రాయకూడదు.. కథలోంచి హీరో రావాలని మీకు ఎప్పుడు అనిపించింది?
ప్రతీ దర్శకుడి ఈ ఆలోచన ముందు నుంచే ఉంటుంది. కానీ పరిస్థితుల దృష్ట్యా కొన్ని సార్లు కుదరకపోవచ్చు. నేను చిరంజీవి గారితో ‘చూడాలనివుంది’ తరువాత ‘మనోహరం’ తీశాను. ‘మనోహరం’ కథ నా వద్ద ముందు నుంచే ఉంది. ఆ కథ నాకు చెప్పాలనిపించింది. అందుకే చేశాను. నా కథ, అందులోని పాత్రలు నాకు సూపర్ స్టార్‌లగానే కనిపిస్తాయి. మన ఆలోచన విధానంలోనూ మార్పులు రావాలి. ముందుగా కథ బాగుండాలని అందరూ చూడాలి.
ప్రస్తుతం ఎలాంటి కథను రాశారు?
‘యుఫోరియా’ ఇచ్చిన ఎనర్జీతో మరో కథను రాశాను. ఆ కథ ఓ హీరోకి సరిపోతుంది. బలమైన కథకి ఆ హీరో తోడవుతాడు. హీరోయిజం, భారీ సెట్లు కావాలి అని ఇక కథను రాయను. ఒక్కడు కథని.. కథగా రాశాను.. ఆ తరువాత అది మహేష్ బాబుకి సెట్ అయింది. ఒక వేళ నేను మహేష్ బాబు కోసం కథ రాసి ఉంటే అది మరో ‘సైనికుడు’ అయ్యేది.
‘యుఫోరియా’తో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
‘యుఫోరియా’తో కొంత ఆర్థికంగా నష్టపోయాను. అసలు ఆర్థిక పరంగా నష్టపోకూడని సినిమా. కొంత మందిని నమ్మి.. లాస్ట్ మినిట్ వరకు వాళ్ల గురించి వెయిట్ చేయడం వంటి విషయాల వల్ల కూడా నష్టపోయాను.
మీ కూతుళ్లను దర్శకులిగా చేయాలనే ఆలోచన ఉందా?
మా కూతుళ్లు కూడా జెన్ జీ. వాళ్లని ఒప్పించడం మామూలు విషయం కాదు.‘యుఫోరియా’ ఇచ్చిన ఎనర్జీతో నాలుగు కథలు రాసేశాను. అందులో ఓ కథ బయటి దర్శకుడితో మా పిల్లలు చేస్తారు.
ఓటీటీలో ‘యుఫోరియా’ ఇతర భాషల్లోకి ఎప్పుడు వస్తుంది?
హిందీ ఆడియెన్స్‌ని ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది. తమిళ వర్షెన్ ఆల్రెడీ రెడీగా ఉంది. హిందీ, తమిళంలో త్వరలోనే వస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో వస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. పాన్ ఇండియా వరకు వెళ్లే ముందు ఈ మూవీని నేను తెలుగులోనే సరిగ్గా మార్కెట్ చేయలేకపోయాను.
ఇకపై కంటిన్యూగా సినిమాలు చేస్తారా?
‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్యకశ్యప’ కోసం ఎనిమిదేళ్లు వృథా అయింది. ఆ గ్యాప్‌లో నేను అనుకున్న పాయింట్స్, కథల మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు టైం వృథా చేయొద్దని ఫిక్స్ అయ్యాను. బౌండ్ స్క్రిప్ట్‌లతోనే రెడీ చేసుకుని హీరో, నిర్మాతలకు ఇచ్చేస్తాను. ‘రామాయణం’ టైంలోనే ‘చూడాలని వుంది’ కథ రాసుకున్నాను.
‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉంటుందా?
‘హిరణ్యకశ్యప’గా అయితే ఉండదు. హాలీవుడ్ సంస్థ ఫాక్స్ స్టార్‌తో కలిసి ‘హిరణ్యకశ్యప’ చేయాలని అనుకున్నాం. మూడు, నాలుగేళ్లు ప్రీ ప్రొడక్షన్‌కి పోయింది. ఆ టైంలోనే కరోనా వచ్చింది. ఆ తరువాత ఆ సంస్థని డిస్నీ కొనేసింది. కొత్తగా వచ్చిన టీంకి మా మీద 300 కోట్ల బడ్జెట్ పెట్టలేకపోయారు. పురాణాల కథలకు రైట్స్ ఉండవు. ఎవరో ఒకరు తీసేస్తారు అని భయపడ్డాను. అనుకున్నట్టుగానే ‘మహావతార్ నరసింహ’ వచ్చింది. యానిమేషన్‌లోనే ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ అయింది.
‘హిరణ్యకశ్యప’లోకి త్రివిక్రమ్ పేరు ఎలా వచ్చింది?
రానా, నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు స్వయంగా త్రివిక్రమ్ ఫోన్ చేసి మాటలు రాస్తాను అని అన్నారు. ఆ తరువాత ప్రాజెక్ట్ ముందుకు రాలేదు. ఆయన రైటర్‌గా అలానే ఉన్నారు. ఆ తర్వాత రానా నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. నా విజువలైజేషన్‌ను వాడుకుంటున్నారేమో అని కొంత మంది దగ్గర నా బాధను చెప్పుకున్నాను. అప్పుడు త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. ‘మహావతార్ నరసింహా’ టైపులో నేను ఆల్రెడీ విజువలైజేషన్ చేసి పెట్టాను. అది వాడుకుంటున్నారేమో అని బాధపడ్డాను.
ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు?
నా వద్ద నాలుగు కథలున్నాయి. ఓ మంచి ప్రొడక్షన్ హౌస్‌తో కొలాబరేట్ అవుతాను. ఆల్రెడీ ఓ కథ డ్రాప్ట్ అయిపోయింది. అది ఒక హీరోకి బాగా సెట్ అవుతుంది. ఆ హీరో వద్దకు వెళ్లి కథను చెప్పాలని అనుకుంటున్నాను. వెరీ హార్డ్ హిట్టింగ్‌గా ఈ కథ ఉంటుంది. ఇలాంటి కథను వెంటనే తీయాలని నా రక్తం మరిగింది. కథలో ఏవో పాటలు పెట్టాలి, ఫైట్లు పెట్టాలని అనుకోవడం లేదు. నా వద్ద ఓ పీరియడ్ డ్రామా కథ కూడా ఉంది. దానికి భారీ బడ్జెట్ అవసరం. ఓ భారీ ప్రొడక్షన్ కంపెనీ దొరికినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తాను

