Skip to content

ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ దృష్టికి చిన్న నిర్మాతల సమస్యలు: నట్టి కుమార్

ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ దృష్టికి చిన్న నిర్మాతల సమస్యలు: నట్టి కుమార్ Telugu News

సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న చిన్న నిర్మాతల సమస్యలను ఇప్పటికైనా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ పరిష్కరించాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో నట్టి కుమార్ అధ్యక్షతన జరిగిన చిన్న నిర్మాతల మీటింగ్ లో చిన్న సినిమాలకు ఎదురవుతున్న పలు సమస్యల గురించి చర్చించి, వాటి పరిష్కారానికి ఈ నెల 15న జరుగనున్న సబ్ కమిటీ దృష్టికి తీసుకుపోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ మేరకు సమస్యలకు సంబందించిన వినతి పత్రాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, సబ్ కమిటీ ప్రొడ్యూసర్స్ మెంబర్ టి.ప్రసన్నకుమార్ కు ఇదే వేదికపై నట్టి కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సినిమా నిర్మాణం పట్ల ఎంతో అభిరుచి కలిగి, అనేక హిట్స్ ఇచ్చిన చిన్న నిర్మాతలెందరో నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. నిర్మాతలకు ఆత్మాభిమానం ఎక్కువని, ఎవ్వరినీ అడగరు, చేయి జాపరని, కొందరు చిన్న నిర్మాతలు ఆర్ధికంగా ఎంతో నష్టపోయి, తిండి సౌకర్యం సరిగా లేక, ఇంటి అద్దెను కూడా చెల్లించలేని బాధాకరమైన పరిస్థితులలో ఉన్నారని ప్రసన్నకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. అలాంటి వారిని గుర్తించి, ప్రొడ్యూసర్స్ కౌన్సెల్ తరపున ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. తప్పకుండా చిన్న నిర్మాతల సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీన జరగబోయే సబ్ కమిటీ మీటింగ్ కు తాను హాజరు కాలేకపోతున్నానని, తన తరపున నట్టి కుమార్ హాజరవుతారని ప్రసన్న కుమార్ వివరించారు.
అనంతరం నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “సబ్ కమిటీ మీటింగ్ లో కేవలం పెద్ద సినిమాలకే కాకుండా చిన్న సినిమాలకు కూడా థియేటర్స్ లో పర్సంటేజీ సిస్టమ్ ను అమలుపరుస్తూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న ప్రత్యేకించి చిన్న సినిమాలకు మధ్యాహ్నం 2-30 గంటల షోను తప్పనిసరిగా కేటాయించాలి. సినిమా కలెక్షన్స్ బావుంటే ఆ తర్వాత షోలు పెంచుకోవచ్చు. డిజిటల్ క్యూబ్, యూఎఫ్ఓ వంటి చార్జీల భారం చిన్న నిర్మాతలపై పడకుండా ఎగ్జిబిటర్స్ భరించాలి. మల్టీఫ్లెక్స్ లలో చిన్న సినిమాలు ఆడేందుకు వీలుగా మొత్తం సీట్ల కెపాసిటీ లో 20 శాతం సీట్లను టిక్కెట్ ధర రూ.100 గా నిర్ణయించాలి. పెద్ద సినిమాల విడుదల సమయంలో చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ రావు,మోహన్ గౌడ్, రవీంద్ర గోపాల, నయీమ్, వింజమూరి మధు, పద్మిని నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు.

See also  "అమరావతికి ఆహ్వానం" సినిమా టీజర్ విడుద‌ల‌

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.