Skip to content

ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం

ఘనంగా  ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం Telugu News

హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, “సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ గారి శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే స‌మాజిక సేవ ఆలోచ‌న వ‌చ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న‌ ఈ సేవా కార్యక్రమాల్లో ఎంద‌రో మ‌హానుభావులు ఆశీర్వ‌దించారు. మ‌ద్ద‌తు తెలిపారు. వారంద‌రి స‌హ‌కారంతోనే ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగిస్తున్నాం” అని అన్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, “కరోనా సమయంలో వందలాది కుటుంబాలకు కాదంబరి కిరణ్ సాయం చేశారు. అవసరమైన కిట్లు అందించారు. అప్పటి నుంచి కిరణ్ గారు నాకు పరిచయం. రాజకీయాలకు సామాజిక సేవలకు సంబంధం లేదు. భారతీయుల్లో సేవా భావం ఉంటుంది. కిర‌ణ్ సేవ‌ల‌కు మా మ‌ద్ద‌తు ఉంటుంది” అని పేర్కొన్నారు.

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ, “సమాజంలో ఒకరికొకరు తోడైతేనే మనుగడ ఉంటుంది. నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ పన్నెండేళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న సైతం ఫౌండేషన్ టీమ్‌కు, ఫౌండర్ కాదంబరి కిరణ్‌కు అభినందనలు, శుభాకాంక్షలు. మీ సేవలు నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మా మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది” అని అన్నారు.

ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ, “మనం సైతం ఫౌండేషన్ పుష్కర కాలం నుంచి ఇలా సేవలు చేయడం మామూలు విషయం కాదు. మున్ముందు చేసే సేవా కార్యక్రమాలకు నా మద్దతు ఉంటుంది” అని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, “కాదంబరి కిరణ్‌తో పాటు నేను కూడా జీ. కృష్ణ గారి శిష్యులం. మనసు పెట్టి చేసే పనిని ఆర్ట్ వర్క్ అంటారు. హార్డ్ వ‌ర్క్ కాకుండా ఆర్ట్ వ‌ర్క్‌తో కాదంబరి కిరణ్ స‌మాజ సేవ చేస్తున్నారు. సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని కోరుకునే కిరణ్‌కు మనందరి సపోర్ట్ ఉండాలి” అని అన్నారు.

సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. కిర‌ణ్‌కు దేవుడు మంచి మ‌నసు ఇచ్చాడు” అని పేర్కొన్నారు.

టీవీ9 జర్నలిస్ట్ ప్రుథ్వి మాట్లాడుతూ, “కరోనా సమయంలో ఆయన సేవా కార్యక్రమాలు నేను ప్రత్యక్షంగా చూశాను. ఎంతో మందికి నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం చేశారు” అని కొనియాడారు.

జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ, “సినిమా వాళ్లు సాధారణంగా తమ ప్రచారాన్ని, ఎదుగుదలను కోరుకుంటారు. కానీ కాదంబరి కిరణ్ సమాజం కోసం నిరంతరం సేవ చేస్తారు. ఆయనను మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి” అని అన్నారు.

టీవీ5 మూర్తి మాట్లాడుతూ, “ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నా, కాదంబరి కిరణ్ మనలో ఉన్న మనిషిని గుర్తు చేస్తున్నారు. ఎవరికైనా కష్టం వస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ మనిషికి కష్టం వస్తే కాదంబరి కిరణ్ వస్తాడు” అని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, టీవీ5 మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, ఏఎన్ఎన్ ఛానల్ సీఈఓ కంది రామచంద్ర రెడ్డి, ఛాంబ‌ర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, జర్నలిస్ట్ సాయి, టీవీ9 ప్రుథ్వి, కాజా సూర్యనారాయణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అశోక్ కుమార్, సురేష్ కొండేటి, టీఆర్ఎస్ రాఘవ, సాంబశివరావు, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌వో: క‌డ‌లి రాంబాబు, ద‌య్యాల అశోక్.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.