Skip to content

‘పురుష:’ నవ్వులు పూయించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

‘పురుషహ’ మూవీ రివ్యూ: ఆ సీక్రెట్ డైరీ ముగ్గురు మొగుళ్ల జీవితాలను ఏం చేసింది? Telugu News

తెలుగు చిత్రసీమలో బలమైన కామెడీ, చక్కటి కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ బంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే హాస్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు వీరు ఉలవల దర్శకత్వంలో, సప్తగిరి, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వెన్నెల కిషోర్, విటివి గణేష్ వంటి అద్భుతమైన నటీనటుల కలయికలో వచ్చిన చిత్రమే “. ‘పురుష:’ ఈ సినిమా కథాంశం పాత ఫార్ములాలోనే సాగినప్పటికీ.. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రాన్ని ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.

కథాంశం:

గోవింద్ (పవన్ కళ్యాణ్ బత్తుల) ఒక రిలేషన్‌షిప్ కౌన్సిలర్. నమ్మకం, అవగాహన ఉంటే ఎలాంటి వైవాహిక బంధమైనా నిలబడుతుందని నమ్మే వ్యక్తి. అతను తన భార్య కమల (రాయంచ కొక్కుర)తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ, అతని స్నేహితులైన థామస్ (సప్తగిరి), జంప్ (రాజ్ కుమార్ క సిరెడ్డి) లు మాత్రం తమ భార్యలతో వచ్చే చిన్న చిన్న గొడవలతో నిత్యం ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే, ఒకరోజు గోవింద్ మద్యం మత్తులో తన భార్య కమలతో తన గతానికి సంబంధించిన కొన్ని రహస్యాలను అనుకోకుండా పంచుకుంటాడు. ఈ చిన్న పొరపాటు వారి బంధంలో పెద్ద చీలికను తెస్తుంది. ఇదే సమయంలో, ఈ ముగ్గురు స్నేహితులు తమ కామన్ ఫ్రెండ్ అయిన కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్లి వేడుకలకు హాజరవుతారు. కిస్సు ఒక విచిత్రమైన ఆర్టిస్ట్. అతని చుట్టూ ఉండే మనుషుల ప్రవర్తన, వారి వ్యక్తిగత విషయాలను ఒక సీక్రెట్ డైరీలో స్కెచ్‌లు, నోట్స్‌ రూపంలో రాసుకునే అలవాటు అతనికి ఉంటుంది.

అనుకోకుండా ఆ సీక్రెట్ డైరీ వీరి భార్యల చేతికి చిక్కుతుంది. దాంతో ఈ ముగ్గురు స్నేహితులకు సంబంధించిన ఎన్నో దాచిన నిజాలు, ఇబ్బందికరమైన విషయాలు బయటపడతాయి. ఆ తర్వాత జరిగే గందరగోళం, ఎమోషనల్ గొడవలు, కామెడీ తప్పిదాలు సినిమాను మలుపు తిప్పుతాయి. చివరకు ఈ స్నేహితులు ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకున్నారు? భార్యల నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నారు? అనేదే ‘పురుష:’ చిత్ర ముఖ్య కథాంశం.

నటీనటుల పర్ఫార్మెన్స్:

పవన్ కళ్యాణ్ బత్తుల: గోవింద్ పాత్రలో ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచాడు. కామెడీ మరియు ఎమోషనల్ సీన్లలో చాలా సహజంగా నటించాడు. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు.

రాయంచ కొక్కుర: కమల పాత్రలో స్క్రీన్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో తన నటనతో మెప్పించింది.

విషిక కీర్తి, హాసిని సుధీర్: తమ గ్లామర్, యూత్‌ఫుల్ ఎనర్జీతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు.

సప్తగిరి & రాజ్ కుమార్ కాసిరెడ్డి: ఈ సినిమాకు ప్రధాన వినోదాన్ని అందించింది వీరే. వీరిద్దరి కామెడీ టైమింగ్, హిలేరియస్ ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. సినిమాకు వీరే అతిపెద్ద అసెట్.

వెన్నెల కిషోర్: ఒక సుదీర్ఘమైన కామియో పాత్రలో కనిపించి, తన మార్క్ కామెడీతో మెప్పించాడు.

విటివి గణేష్, పమ్మి సాయి, హరితేజ, రాజీవ్ కనకాల: తమ పరిధి మేరకు చక్కగా నటించి సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు.

సాంకేతిక విలువల విశ్లేషణ:

దర్శకుడు వీరు ఉలవల కథను నడిపించిన తీరు చాలా బాగుంది, సినిమాను అత్యంతం వినోదాత్మకంగా నడిపించారు. స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల ఊహకు అందేలా ఉన్నప్పటికీ.. చక్కటి కామెడీ సీన్లు, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుడిని బోర్ కొట్టించకుండా కాపాడాయి. స్నేహం, పెళ్లి, బంధాల మధ్య వచ్చే అపార్థాలను చాలా రిలేటబుల్‌గా చూపించారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపించినా, నిరంతర హాస్యం వల్ల సినిమా వేగం తగ్గలేదు.

విజువల్స్ పరంగా సినిమా చాలా అద్భుతంగా , కలర్ ఫుల్ గా ఉంది, సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చక్కగా కుదిరింది. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు (Production Values) చాలా బాగున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించినట్లుగా అర్థమవుతుంది. పాటలు వినసొంపుగా ఉండి కథలో భాగంగానే వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కూడా కామెడీ, ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. కొన్ని విఎఫ్ఎక్స్ (VFX) షాట్స్ బాగున్నాయి.

ముగింపు:

‘పురుష:’ అనేది బరువైన కథలతో కాకుండా.. కేవలం కామెడీ, స్నేహం, బంధాల చుట్టూ తిరిగే ఒక క్లీన్ అండ్ ఎంజాయ్‌బుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కథ కాస్త ప్రెడిక్టబుల్‌గా (ముందే ఊహించేలా) ఉన్నప్పటికీ, నటీనటుల పర్ఫార్మెన్స్ మరియు సిట్యుయేషనల్ కామెడీ సినిమాను నిలబెట్టాయి. ఈ వారాంతంలో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా నవ్వుకుంటూ, ఒక లైట్ హార్టెడ్ రిలేషన్‌షిప్ డ్రామాను చూడాలనుకునే వారికి ‘పురుష:’ఒక మంచి ఛాయిస్.

రేటింగ్: 3.75/5

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.