Skip to content

‘రావు బహదూర్’ ఒక సర్రియల్ సినిమా… ఇండియన్ సినిమా ఇలాంటి చిత్రాన్ని ఇప్పటివరకు చూడలేదు: డైరెక్టర్ సుకుమార్

సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ప్రెజెంటర్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కూడా స్పెషల్ ప్రివ్యూ చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. జూలై 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి.

సుకుమార్ మాట్లాడుతూ..”రావు బహదూర్ ఒక సర్రియల్ సినిమా. భారతీయ సినీ పరిశ్రమలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు వచ్చిందని నేను అనుకోవడం లేదు. ఇది ఒక మ్యాజికల్, ఇమర్సివ్ సినీ అనుభూతిని అందించే చిత్రం. ప్రేక్షకులను ప్రతి క్షణం ఆశ్చర్యపరుస్తుంది”

సత్యదేవ్ నటన గురించి మాట్లాడుతూ ” ఒక నటుడికి జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుంది. సత్యదేవ్‌కు మొత్తం టీమ్ ఇచ్చిన గొప్ప బహుమతి ఈ పాత్ర” అని ప్రశంసించారు.

దర్శకుడు వెంకటేష్ మహాను అభినందిస్తూ.. “కథ రాయడం ఒక విషయం. కానీ ఆ కథ ఆత్మను కోల్పోకుండా, ఇంత సర్రియల్ గా తెరపై ఆవిష్కరించడం గొప్ప విజయం. ఎనిమిదేళ్ల తర్వాత వెంకటేష్ మహా నిజంగా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు”

“ఈ సినిమాలో సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉంది. కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి టెక్నికల్ విభాగం వరకు అద్భుతమైన పనితీరు కనబరిచారు. ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థాయిలో పనిచేశారు”

నిర్మాత అనురాగ్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమా రూపుదిద్దుకోవడంలో అనురాగ్ చాలా కీలక పాత్ర పోషించారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన ప్యాషన్ కనిపిస్తుంది”

ఇప్పటికే మహేష్ బాబు ప్రశంసలు అందుకున్న ‘రావు బహదూర్’, ఇప్పుడు సుకుమార్ నుంచి కూడా విశేషమైన ప్రశంసలు అందుకోవడంతో, విడుదలకు ముందే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.