‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథానాయకుడిగా…
అసలు విషయం ఇదేనా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యష్ తల్లి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వివాదం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి కారణమైన వీడియో మాత్రం 2023లో జరిగిన కోటబొమ్మాళి PS సినిమా కార్యక్రమానికి సంబంధించినది కావడం గమనార్హం. ఆ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. KGFకు ముందు, KGF తర్వాత యష్ ఎదిగిన స్థాయి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఒక సినిమా, ఒక శుక్రవారం కూడా ఓ నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలదనే విషయాన్ని చెప్పే సందర్భంలోనే ఆయన యష్ ఉదాహరణను ప్రస్తావించారు.
అయితే తాజాగా ఆ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వివాదం మొదలైంది. అల్లు అరవింద్ వ్యాఖ్యల్లో యష్‌ను విమర్శించే ఉద్దేశం ఎక్కడా కనిపించలేదని, ఆయన యష్ ఎదుగుదలను ఉదాహరణగా చెబుతూ ప్రశంసించే విధంగానే మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇదే అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.
అసలు 2023లో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు ఎందుకు వివాదంగా మారుస్తున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీడియో పూర్తిగా చూసిన తర్వాతే దాని సందర్భం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అల్లు అరవింద్ చెప్పిన విషయాన్నే మరో సందర్భంలో యష్ కూడా చెప్పినట్లు పలువురు గుర్తు చేస్తున్నారు. ఒక సినిమా విజయంతో నటుడి కెరీర్, మార్కెట్, స్టార్‌డమ్ ఒక్కసారిగా మారిపోవచ్చనే విషయమే ఇద్దరి వ్యాఖ్యల్లోనూ ప్రధానంగా కనిపిస్తుందని అంటున్నారు.
ఇలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని సెకన్ల క్లిప్పులను మాత్రమే చూసి ఒక నిర్ణయానికి రావడం కంటే, పూర్తి వీడియోను చూసి అసలు సందర్భాన్ని అర్థం చేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. 2023లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వ్యాఖ్యలను 2026లో మరో సందర్భంలో వివాదంగా మార్చడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది.
యష్ తల్లి గారు ఈ వీడియోను పూర్తి సందర్భంతో చూసి ఉంటే, అసలు అల్లు అరవింద్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో మరింత స్పష్టంగా అర్థమయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. యష్ వంటి పాన్ ఇండియా స్టార్‌కు సంబంధించిన విషయాలు కాబట్టి, సోషల్ మీడియాలో స్పందించే ముందు పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడితే వివాదాలకు దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం సినీ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి.. ఒకప్పుడు యష్ ఎదుగుదలను ఉదాహరణగా చెబుతూ మాట్లాడిన అల్లు అరవింద్ వీడియోనే ఇప్పుడు వివాదానికి కారణం కావడం ఆసక్తికరంగా మారింది.

