Skip to content

జీ5లో ‘ఆక్టోపస్’.. రహస్యాలు, మిస్టరీతో సాగే ఉత్కంఠ‌భ‌రితమైన క‌థ‌!..

  • జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన‌ 7 ఎపిసోడ్స్‌ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌.. కీల‌క పాత్ర‌ల్లో అశ్విన్, అర్చన, వినోద్‌ కిషన్, సిద్ధు కుమరేశన్, కలైవాణి భాస్కర్

తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌ల‌కు సంబంధించిన‌ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న జోన‌ర్స్‌లో ఆసక్తికరమైన ప్రాంతీయ కథలను ప్రేక్షకులకు అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తన కథనానికి సంబంధించిన‌ శైలిని మరో స్థాయికి తీసుకెళ్తూ.. ‘ఆక్టోపస్’ అనే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్రీమియర్‌కు సిద్ధం చేసింది. ఈ సిరీస్‌లో శక్తివంతమైన మహిళా ప్రధాన కథతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ కథనాలకు భిన్నంగా కొత్త తరహా అనుభూతిని అందించనుంది.

జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ 7 ఎపిసోడ్స్‌ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌లో అశ్విన్, అర్చన, వినోత్ కిషన్, సిద్ధు కుమరేశన్, కలైవాణి భాస్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిస్టరీ, భావోద్వేగాలు, ఉత్కంఠను కలగలిసిన‌ ‘ఆక్టోపస్’ కథ.. తమ ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోవడంతో నిజం ఏంటో తెలుసుకునేందుకు ఒక్కటైన సన్నిహిత పొరుగువారి చుట్టూ సాగుతుంది. ఆమె అదృశ్యం వెనుక అసలు కారణాన్ని తెలుసుకునే క్రమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాంతో ఇప్పటివరకు దాగి ఉన్న ఎన్నో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ.. కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

తమిళ జీ5 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ‘ఆక్టోపస్’ లాంచ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఈ సిరీస్‌పై ఆన్‌లైన్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఆసక్తికరమైన కథాంశంతో పాటు అభిమానుల చర్చలు, అంచనాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో ‘ఆక్టోపస్’పై క్యూరియాసిటీ పెరుగుతోంది. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్‌గానే కాకుండా.. నమ్మకం, సంబంధాలు, పట్టుదల, మనుషుల మధ్య ఉండే బంధాల బలం వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ సిరీస్‌లో చూపించనున్నారు. మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే పరిస్థితులను ఆధారంగా చేసుకుని, బలమైన భావోద్వేగాలతో సాగే కథనం ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేయడంతో పాటు.. అసలు ఏం జరగబోతోందనే ఉత్కంఠను కొనసాగించనుంది.

ఈ సంద‌ర్భంగా జీ5 బిజినెస్ హెడ్ తమిళం, తెలుగు, మలయాళం లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ “‘ఆక్టోపస్’ లాంచ్ ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి మేం ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ ఉత్కంఠభరితమైన కథను ప్రేక్షకులు చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. తమిళ ప్రేక్షకులు చాలా కాలంగా క్రైమ్ మిస్టరీలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లను ఆదరిస్తున్నారు. అయితే ‘ఆక్టోపస్’ ఈ జోనర్‌కు ఓ కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది. ఇందులో ఓ మహిళను కథకు కేంద్రబిందువుగా చూపించడంతో పాటు.. సంక్షోభ సమయంలో ఓ సమాజం మొత్తం ఎలా ఒక్కటై నిలబడుతుందో ఆసక్తికరంగా చూపించాం. ఆసక్తికరమైన కథాంశం, బలమైన భావోద్వేగాలతో కూడిన కథనం, ప్రతిభావంతులైన నటీనటుల బృందంతో ‘ఆక్టోపస్’ ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన, కథలో పూర్తిగా లీనమయ్యే అనుభూతిని అందించనుంది. ఈ ప్రత్యేకమైన కథను తమిళ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతూ.. వారి ప్రయాణంలో భాగమై.. మిస్టరీ క్రమంగా వీడుతున్న కొద్దీ అసలు నిజాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

రచయిత, దర్శకుడు జయచంద్ర హష్మీ మాట్లాడుతూ “కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నేను ‘ఆక్టోపస్’ కథను రాశాను. ఆ సమయంలో మనమంతా ఇళ్లకే పరిమితమై, ఒకరితో ఒకరం దూరంగా, కొన్ని నిర్బంధాలతో కూడిన పరిసరాల్లో జీవించాల్సి వచ్చింది. మనకు కనిపించేది ఎప్పుడూ నిజంగా ఉన్నదే కాదు. ఇది మన చుట్టూ ఉన్న మనుషులు, సంబంధాలు, సమాజం.. ఇలా అన్నింటికీ వర్తిస్తుంది. వాటి వెనుక ఎన్నో లోతైన కోణాలు దాగి ఉంటాయి. ఈ ఆలోచనను మరింత విస్తృతమైన కథా నేపథ్యంతో, విభిన్న కోణాల్లో ఆవిష్కరించాలనుకున్నాను. కథకు ఓ మిస్టరీతో పాటు మహిళను కేంద్రబిందువుగా తీసుకోవడం ద్వారా చెప్పాలనుకున్న అంశాలకు మరింత లోతు వచ్చింది. ఓ యువతి అదృశ్యంతో మొదలయ్యే ఈ మిస్టరీ.. క్రమంగా ఊహించని పరిణామాల వైపు విస్తరిస్తుంది. ఇది ఆక్టోపస్‌ చేతులు అన్ని వైపులా విస్తరించినట్లుగా ఉంటుంది. తమిళ జీ5 ఎప్పటికప్పుడు సమాజానికి సంబంధించిన, ప్రభావవంతమైన కథలను ప్రేక్షకులకు అందిస్తోంది. అలాంటి వేదికపై ‘ఆక్టోపస్’ను ప్రేక్షకులు చూడబోతుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సిరీస్‌ను జీ5లో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

సినిమమ్‌ నిర్మాతలు ఆదిత్య జె. రాజు, లిషా పి. చంద్రన్ మాట్లాడుతూ “సినిమా భవిష్యత్తు కొత్త ఆలోచనలు, కొత్త ప్రతిభ కలిగిన వారి చేతుల్లోనే ఉందని మేం నమ్ముతాం. ‘ఆక్టోపస్’ మా ఆలోచనకు ప్రతిబింబం. కొత్తగా ఎదుగుతున్న కళాకారులను ప్రోత్సహించడం, కొత్త ప్రతిభకు మంచి అవకాశాలు కల్పించడం ఎప్పటి నుంచో మా ప్రయాణంలో ముఖ్యమైన భాగం. మాకు ఎంతో అండగా నిలిచిన నటీనటులకు, ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఎంతో అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా దర్శకుడు ఎంతో అందమైన, భావోద్వేగాలతో కూడిన కథను రూపొందించారు. మా డీఓపీ ఆ విజన్‌ను అద్భుతమైన విజువల్స్‌గా మలిచి కథనాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే గొప్ప సినిమాకు కావాల్సింది ధైర్యమే అయినా.. అది ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచేది వారి ఆదరణతోనే. ‘ఆక్టోపస్’ కేవలం ఓ సిరీస్ మాత్రమే కాదు. అంకితభావానికి లక్ష్యం తోడైతే మరచిపోలేని కథలు ఎలా పుడతాయో చెప్పే నిదర్శనం” అన్నారు.

నటి అర్చన మాట్లాడుతూ “‘ఆక్టోపస్’ కథలోని సస్పెన్స్‌తో పాటు అందులో ఉన్న బలమైన భావోద్వేగ ప్రపంచం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా పాత్ర కేవలం ఓ మిస్టరీలో చిక్కుకున్న వ్యక్తి మాత్రమే కాదు. ఆమె ప్రయాణమే మొత్తం ప్రాంతంలోని ప్రజలను ఒక్కటిగా కలిపే దారంలా మారుతుంది. ఆ క్రమంలో ఎన్నో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. మరోవైపు ఈ సిరీస్ ఓ మహిళ తనకంటూ ఓ స్థానం, ఆప్యాయతను వెతుక్కోవడం గురించి కూడా చెబుతుంది. ఆమె కనిపించకుండా పోయినప్పుడు ఆమె కోసం ఒక్కటై నిలబడే మనుషుల కథ కూడా ఇందులో ఉంటుంది. నమ్మకం, సంబంధాలు, అంతరంగపు భావనలు, అసలు నిజాన్ని తెలుసుకోవాలనే పట్టుదల వంటి అంశాలను ఈ సిరీస్‌లో చూపించారు. అదే సమయంలో ప్రేక్షకులు చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా కథ సాగుతుంది. ఇన్ని భావోద్వేగ కోణాలు ఉన్న కథలో ప్రధాన పాత్ర పోషించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పుడు ‘ఆక్టోపస్’ తమిళ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఎంతో ఆనందంగా ఉంది” అన్నారు.

నటుడు అశ్విన్ మాట్లాడుతూ “జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘ఆక్టోపస్’లో భాగం కావడం నాకు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. మనుషుల ప్రవర్తన, సంబంధాలు, మనం జీవిస్తున్న సమాజంలోని విభిన్న కోణాలను చూపించే కథలో నటించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఈ సిరీస్‌లో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం బలమైన కథనం. మొదట ఓ జంట చుట్టూ మొదలయ్యే కథ.. క్రమంగా మొత్తం ప్రాంతంలోని ప్రజల మధ్య ఉన్న సంబంధాలు, పరిస్థితుల వైపు విస్తరిస్తుంది. గతంలో వచ్చిన కొన్ని అద్భుతమైన తమిళ సినిమాలను గుర్తుచేసే ప్రత్యేకమైన కథనం ఇందులో కనిపిస్తుంది. అదే సమయంలో సరికొత్త కోణాన్ని కూడా ఆవిష్కరిస్తుంది. ఇంత బలమైన కథ, దర్శకుడి విజన్, అద్భుతమైన అమలు.. ఇవన్నీ కలిసి ‘ఆక్టోపస్’ను ప్రేక్షకులకు సరికొత్త కథన అనుభూతిని అందించే సిరీస్‌గా నిలబెడతాయని నేను నిజంగా నమ్ముతున్నాను” అన్నారు.

Tamil ZEE5 Original “Octopus” Launch Promo – https://youtu.be/0LenE_VyLl0

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.