Skip to content

‘స్ట్రీట్ ఫైటర్’కు అక్టోబర్ 16న విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో TCL చైనీస్ థియేటర్‌లో ఈ సినిమా ప్రీమియర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి, జాసన్ మోమోవా, 50 సెంట్, రోమన్ రీన్స్‌తో పాటు భారతీయ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సినిమా తొలి స్పందనలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, హాస్యం, 90ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు, ప్రముఖ వీడియో గేమ్‌కు దగ్గరగా కథను తెరకెక్కించిన విధానం విమర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

సినీ విశ్లేషకుడు బ్రాండన్ డేవిస్ ఈ సినిమాను ‘విన్నర్’గా అభివర్ణించారు. 90ల నాటి వాతావరణం, వినోదం, నటీనటుల ప్రదర్శన ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఆండ్రూ కోజి ర్యూ పాత్రలో బాగా నటించారని, రోమన్ రీన్స్ అకుమా పాత్రలో భయపెట్టేలా కనిపించారని ప్రశంసించారు.

థామస్ అనే మరో సినీ విశ్లేషకుడు ‘స్ట్రీట్ ఫైటర్’ను అత్యుత్తమ వీడియో గేమ్ ఆధారిత చిత్రాల్లో ఒకటిగా అభివర్ణించారు. గేమ్‌లోని ప్రత్యేకతలను సినిమాలో చక్కగా చూపించారని, దర్శకుడు కిటావో సకురాయ్ నటీనటుల నుంచి మంచి ప్రదర్శన రాబట్టారని పేర్కొన్నారు. కాలినా లియాంగ్, కోడి రోడ్స్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.

ఏజే గలియార్డీ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. యాక్షన్, స్టైల్, వినోదం కలగలిసిన చిత్రంగా అభివర్ణిస్తూ, నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని తెలిపారు. చున్-లి పాత్రలో కాలినా లియాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని పేర్కొన్నారు.

సుబాట్యూబ్ తన స్పందనలో ఈ సినిమా వీడియో గేమ్ అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. గేమ్‌కు సంబంధించిన ప్రత్యేక సన్నివేశాలు, అద్భుతమైన సంగీతం, 2డీ యానిమేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు.

విమర్శకుడు క్రిస్ కిలియన్ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. 80ల నాటి యాక్షన్ సినిమాలను గుర్తుచేసేలా భారీ పోరాటాలు, హాస్యం ఉన్నాయని తెలిపారు. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో చూపించిన యానిమేషన్ కూడా అద్భుతంగా ఉందని, వీడియో గేమ్‌కు న్యాయం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో కెన్ మాస్టర్స్‌గా నోహ్ సెంటినియో, ర్యూ పాత్రలో ఆండ్రూ కోజి, చున్-లిగా కాలినా లియాంగ్, ధాల్సిమ్‌గా విద్యుత్ జమాల్ నటిస్తున్నారు. వీరితో పాటు జాసన్ మోమోవా, 50 సెంట్, డేవిడ్ డాస్ట్‌మాల్చియన్, కోడి రోడ్స్, జో అనోవై తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పారామౌంట్ పిక్చర్స్ సమర్పణలో తెరకెక్కిన ‘స్ట్రీట్ ఫైటర్’ అక్టోబర్ 16, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.