Skip to content

‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ద్వారా సుమ చేస్తున్న సేవలు అభినందనీయం: ఉపాసన కామినేని కొణిదెల

  • ఘనంగా జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు

ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందరి జీవితాల్లోనూ పండగ నింపాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గత ఐదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు వైస్ చైర్‌పర్సన్ CSR అపోలో హాస్పిటల్స్ ఉపాసన కామినేని కొణిదెల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ..“సుమ గారిని చూసినప్పుడు నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల, విజయాలు నిజంగా అభినందనీయం. ఆమెఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ను ప్రారంభించి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు సుమ గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఎంతోమందికి మేలు చేస్తాయి. సమాజంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి.

సునీత కృష్ణ మాట్లాడుతూ.. “సుమ గారు, ఉపాసన గారు నాకు ఎంతో దగ్గరైన వ్యక్తులు. ఉపాసన గారు ఎంతోమందికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి, నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే ముందుకొచ్చి సహాయం చేసే గొప్ప మనసు ఆమెది. మా కార్యక్రమాలకు ఎన్నోసార్లు యాంకరింగ్ చేసిన సుమ గారు, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదు. ఇతరులకు ఇవ్వాలనే కృతజ్ఞతాభావం, సేవా దృక్పథం ఆమెకు ఉన్నాయి. ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ద్వారా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

సుమ కనకాల మాట్లాడుతూ.. “మా దాతలకు, లబ్ధిదారులకు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం. జీవితం ఒక పాఠశాల లాంటిది. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. సునీత కృష్ణ గారు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ముందుకొచ్చిన గొప్ప మనిషి. ఆమెను చూసినప్పుడు నాలో ధైర్యం పెరుగుతుంది. ఆమె మా కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఉపాసన కామినేని కొణిదెల గారి పుట్టినిల్లు మెట్టినిల్లు ధాటైనవి, ఆమె అనుకుంటే హాయిగా బ్రతికేవచ్చు. కానీ ఆమె అలా ఆలోచించరు. తన దగ్గర ఉన్న వనరులతో ఎంతమందికి సహాయం చేయగలననే ఆలోచనతో ముందుకు సాగుతారు. ఆమె చేస్తున్న సేవలు మాకు గొప్ప స్ఫూర్తినిస్తాయి. మేము ఐదేళ్లలో చేసిన సేవలకంటే వంద రెట్లు ఎక్కువగా ఆమె సమాజానికి సేవ చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి బాగా సంపాదించి, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనే ఆలోచన నాలో ఉండేది. ప్రజల ప్రేమ, ఆదరణ వల్ల నాకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చాలనే ఆలోచన నుంచే ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ పుట్టింది. మనం చెప్పేది ప్రజలు వింటున్నారు, మనల్ని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎంతోమంది దాతలు మా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశంలో నేను దాతలకు, లబ్ధిదారులకు మధ్య ఒక వారధిలా, యాంకర్‌లా మాత్రమే వ్యవహరిస్తున్నాను. మన దగ్గర ఉన్న వనరులతో కొంతమందికి సహాయం చేయగలం. మరింతమందికి సాయం చేయాలంటే ఇంకా ఎంతోమంది చేతులు కలవాలి. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దాతలు ఇచ్చే సహాయం సరైన వ్యక్తులకు చేరుతోందా? అది సరైన విధంగా వినియోగమవుతోందా? అనే విషయాలు కూడా చాలా ముఖ్యం. దాతలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత. రానున్న రోజుల్లోనూ మీ అందరి సహకారం మాకు కావాలి. ప్రతి పండుగ మన ఇంట్లోనే కాదు, ఇతరుల ఇళ్లలోనూ వెలుగులు నింపాలి. ఇదే ‘ఫెస్టివల్ ఆఫ్ జాయ్’ ప్రధాన లక్ష్యం. ఈ ప్రయాణంలో భాగస్వాములైన హీరోలు, దాతలు, శ్రేయోభిలాషులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు”

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సుమ తనకు తాను ఎదగడమే కాకుండా, తన చుట్టూ ఉన్నవారికి కూడా అండగా నిలుస్తుంది. ఇతరులకు సహాయం చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంది. సుమ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో నిర్వహిస్తూ మరింతమందికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పలువులు ప్రముఖులు పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.