Skip to content

‘ఇట్లు అర్జున’ నవంబర్ 4న ట్రైలర్ రిలీజ్

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ పోస్టర్‌లో అనీష్ కారు నడుపుతూ సీరియస్‌గా కనిపిస్తుండగా, పక్కనే కూర్చున్న అనస్వర రాజన్ టెన్షన్తో కనిపిస్తున్నారు. పగిలిపోయిన కారు అద్దం, గాల్లో ఎగురుతున్న గాజు ముక్కలు, వారి వాహనాన్ని వెంబడిస్తున్న కొంతమంది వ్యక్తులతో పోస్టర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. హీరోహీరోయిన్ల జీవితాల్లో చోటుచేసుకోబోయే అనూహ్య పరిణామాలను ఈ పోస్టర్ సూచిస్తోంది.

‘ఇట్లు అర్జున’ ఓ విభిన్నమైన ప్రేమకథ. అర్జున్ అనే మూగ యువకుడు తన జీవితమంతా కీర్తిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. అయితే, తన మనసులోని భావాలను మాటల ద్వారా వ్యక్తపరచలేకపోవడంతో అతని ప్రయాణం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో ఈ కథ సాగనుంది.

సాంకేతికంగా ఈ సినిమాతో రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయం అవుతున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు చార్ట్‌బస్టర్ స్పందన లభించడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.