Skip to content

ఇండ‌స్ట్రీ పెద్ద‌ల అన్యాయంపై కలెక్టర్‌కు ద‌ర్శ‌కుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు

▪️‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో వివక్ష
▪️ థియేటర్ల కేటాయింపులో చిన్న సినిమాల‌కు అన్యాయం
▪️ సి. కళ్యాణ్‌పై, ఫిల్మ్ ఛాంబర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
▪️ న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు షెరాజ్ మెహదీ వినతిపత్రం

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలకు జరుగుతున్న అన్యాయం, థియేటర్ల కేటాయింపులో వివక్ష, పారదర్శకత లోపంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఏడాదిన్నరగా తాను నిర్మించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి తగినన్ని థియేటర్లు, షోలు లభించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

భారీ బడ్జెట్ చిత్రాలకు పెద్ద సంఖ్యలో థియేటర్లు, షోలు కేటాయిస్తుండగా, చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులు, ప్రతిభావంతులైన కళాకారులకు తగిన అవకాశాలు దక్కడం లేదని షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లు, షోల సంఖ్య, ప్రదర్శన సమయాల్లో సమాన అవకాశాలు లేకపోవడం ఆరోగ్యకరమైన పోటీకి విఘాతం కలిగిస్తోందన్నారు. థియేటర్లలో సరైన స్థాయిలో విడుదల కాకపోతే ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయ అవకాశాలు కూడా దెబ్బతింటాయని, దీనివల్ల నిర్మాతల పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతోందని వివరించారు.

థియేటర్ల కేటాయింపులో పారదర్శకత, మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో సమాన ప్రదర్శన అవకాశాలు కల్పించాలని కోరారు. చిన్న నిర్మాతల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, థియేటర్ల కేటాయింపులో వివక్ష, బంధుప్రీతిపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిన్న, మధ్యతరహా సినిమాల విడుదలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, విడుదల తర్వాత ఎదురయ్యే నష్టాల్లో కనీసం 20 నుంచి 30 శాతం వరకు భరించేలా సబ్సిడీ విధానాన్ని పరిశీలించాలని, హైదరాబాదీ భాషా చిత్రాలకు కూడా సమాన ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.

మీడియాతో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ..
కలెక్టర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షెరాజ్ మెహదీ, తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై వివక్ష పెరిగిపోయిందని ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసి అన్ని వివరాలు, డాక్యుమెంట్లు అందజేశామని, ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమ పోరాటం కోర్టులోనూ కొనసాగుతోందని, త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చిన్న బడ్జెట్ సినిమాలు తీసేవారికి క్యూబ్ రేట్ల భారం తగ్గించాలని, చిన్న బడ్జెట్ సినిమా రంగంలోని వారికి ప్రభుత్వ సహకారంతో హెల్త్ కార్డులు అందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సి. కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నిస్తూ, ఛాంబర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిభ, అర్హత ఉన్నవారు, నలుగురికి మంచి చేసేవారు పరిశ్రమలో ముందుకు రావాలని షెరాజ్ మెహదీ పిలుపునిచ్చారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.