క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న…
మాతృదేవోభవ ఆశ్రమాన్ని సందర్శించి మానవత్వం చాటిన మనోజ్ మంచు
‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా రా కింగ్ మనోజ్ మంచు మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు. ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి “సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు, సంతోష్ భాయ్” అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు.
ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా మొదట సంప్రదించారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని, కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని సంప్రదించాను. వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాన’ని అన్నారు.
మానసిక స్థితి సరిగ్గా లేని నిరాశ్రయుల పరిస్థితి గురించి భావోద్వేగంతో మాట్లాడుతూ.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కనీసం అప్పుడప్పుడు మద్దతు, గుర్తింపు లభిస్తున్నప్పటికీ, ఇలా మానసిక స్థితి సరిగ్గా లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, దాదాపు అందరూ విస్మరిస్తూనే ఉంటారని మనోజ్ అన్నారు.
‘ఈ రోజుకీ చాలా మందిని అంటరానివారిలా చూస్తున్నారు. మనం 2026లో జీవిస్తున్నాం. మన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. గొప్ప వైద్యులు, కావాల్సినంత జ్ఞానం, సరిపడా వనరులు ఉన్నాయి. అయినా కూడా మనం వారిని అలానే రోడ్ల మీదే వదిలేసి వెళ్లిపోతోన్నామ’ని అని మనోజ్ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఎదుటి వారి బాధను చూసి కూడా మౌనంగా ఉండిపోయేవారే నిజంగా మానసిక స్థితి లేనివారు. కేవలం ముప్పై నిమిషాల్లోనే ఒక వ్యక్తి నెమ్మదిగా తన గౌరవాన్ని, రూపాన్ని తిరిగి ఎలా పొందుతాడో మీరు చూశారు. సంతోష్ ఎప్పటికైనా తన కుటుంబంతో తిరిగి కలుస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని అన్నారు.
మనోజ్ ఆ ఆశ్రమంలో చూసిన దృశ్యాలతో తీవ్రంగా భావోద్వాగానికి లోనయ్యారు. కేవలం తాత్కాలిక చర్యలు కావు అని దీర్ఘకాలిక పునరావాస వ్యవస్థల వైపు పయనించాలని కోరుకున్నారు. తాను ఇప్పటికే నిర్మించాలని అనుకున్న క్రీడా పునరావాస కేంద్రంతో పాటు ఇప్పుడు మానసిక వికలాంగులు, మానసికంగా కుంగిపోయిన వ్యక్తుల కోసం కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య సహాయం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తెలుగు సమాజంలో ఇప్పటికే గొప్ప వైద్యులు, ఫిజీషియన్లు చాలా మంది ఉన్నారని, ప్రజలు, సంస్థలు సమిష్టిగా ముందుకు రావాలని మనోజ్ కోరారు.
భవిష్యత్తులో కూడా ఐక్య ధైర్య సేనా సమితి ఈ ఆశ్రమానికి, దాని మానవతా కార్యక్రమాలకు సపోర్ట్‌గా ఉంటుందని గిరికి మనోజ్ హామీ ఇచ్చారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వారంతా చెట్ల కింద భోజనం చేయడం చూసి చలించిపోయిన మనోజ్ వీలైనంత త్వరగా ఆశ్రమానికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు.
స్వయంగా ఆశ్రమాన్ని సందర్శించి, తన మాట నిలబెట్టుకున్నందుకు మనోజ్‌కు నిర్వాహకుడు గిరి కృతజ్ఞతలు తెలిపారు. సంతోష్ ఈ ఆశ్రమానికి చేరుకోవడానికి ముందు దాదాపు రెండు సంవత్సరాల పాటు చాదర్‌ఘాట్ చుట్టూ తిరిగాడని, ఒకానొక సమయంలో అతనికి ఆహారం అందించినప్పుడు కూడా సరిగ్గా స్పందించేవాడు కాదని గిరి వెల్లడించారు.
ఈ మేరకు గిరి మాట్లాడుతూ .. ‘మనం ఓపికతో, మానవత్వంతో కేవలం ముప్పై నిమిషాలు కేటాయించినా, ఒక వ్యక్తి నెమ్మదిగా తిరిగి గౌరవాన్ని, జీవితాన్ని పొందగలడు. ఈ రోజు సమాజం అతనిని కొత్తగా చూడటం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఈ ఆశ్రమం అనాథ పురుషుల పునరావాసంపై దృష్టి సారిస్తోంది. అయితే భవిష్యత్తులో మహిళలకు కూడా సహాయక వ్యవస్థలను విస్తరించాలని ఆశిస్తున్నాను. మానసిక క్షోభకు గురైన వ్యక్తుల చికిత్స కోసం రవాణా విషయంలో సంస్థ సవాళ్లను ఎదుర్కోంటోంది. ఆశ్రమంలోని నివాసితులకు మానసిక వైద్య సహాయం ఏర్పాటు చేయడంలో సహాయం చేయాలని మనోజ్ గారిని అభ్యర్థించాం. ఈ విధంగా ఆశ్రమాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, సమయం గడిపిన మొదటి సినీ నటుడు మనోజ్ గారే. సమాజం చేత విస్మరించబడిన ప్రజల పట్ల మద్దతు, కరుణ, గుర్తింపును చూపినందుకు మనోజ్ గారికి, అతని కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
కెరీర్ పరంగా చూసుకుంటే.. ‘రా కింగ్’ మనోజ్ మంచు ప్రస్తుతం సినిమా, సామాజిక సేవ రెండింటినీ ఒకే టైంలో బ్యాలెన్స్ చేస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ ఈ దసరాకి రిలీజ్ కానుంది. ‘రక్షక్’ మూవీ జూన్ 7న గ్రాండ్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది.‘వడ్డీ కాసులు వాడ’ త్వరలో షూటింగ్ వెళ్తుంది
సినిమాలతో పాటు మనోజ్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద ఫోకస్ పెట్టారు. పలు ప్రాజెక్టులు కూడా చర్చల దశల్లో ఉన్నాయి. ‘మోహన రాగ’పై కూడా మనోజ్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారు. ఐక్య ధైర్య సేనా సమితి తన సామాజిక సేవా కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తుండగా అదే సమయంలో మనోజ్ కెరీర్ పరంగానూ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నారు.




