Skip to content

‘శరణాగతి’ కోసం చేతులు కలిపిన హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్

KGF’, ‘సలార్’, ‘కాంతార’ వంటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో పాటు, ‘మహావతార్ నరసింహ’ వంటి విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్స్.. భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా అత్యాధునిక AI మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘శరణాగతి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘనమైన నివాళిగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ప్రకటించాయి. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోషన్ క్యాప్చర్ (AI Motion Capture) టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ టెక్నాలజీలను కలిపి మనుషుల కదలికలను డిజిటల్ యానిమేషన్‌గా మార్చే ఈ ఆధునిక సాంకేతికత.. యానిమేషన్ పాత్రలకు మరింత సహజత్వం, భావోద్వేగాలను తీసుకొస్తుంది.

AI మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా కెమెరాల సాయంతో మనుషుల కదలికలను రికార్డ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో శరీరంలోని వివిధ భాగాల కదలికలు, హావభావాలు, ఎక్స్‌ప్రెషన్స్‌ను గుర్తించి ట్రాక్ చేస్తారు. ఆ డేటాను డిజిటల్ యానిమేషన్ డేటాగా మార్చి, 3D క్యారెక్టర్‌కు సంబంధించిన స్కెలిటన్‌పై మ్యాప్ చేస్తారు. దీంతో ఆ పాత్రలు మనుషుల అసలు కదలికలను సహజంగా అనుకరించగలుగుతాయి. మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా సహజమైన, భావోద్వేగభరితమైన యానిమేషన్‌ను సృష్టించి ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించవచ్చు. టెక్నాలజీ, యానిమేషన్, ఆధ్యాత్మిక కథనాల కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిల్మ్స్.. సంప్రదాయానికి భిన్నమైన కథలను ఎంచుకోవడంలో, సినిమా నిర్మాణంలో కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. భారతీయ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో, విభిన్నమైన కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను అందిస్తోంది. ‘KGF’ ఫ్రాంచైజీ, ‘సలార్’, ‘కాంతార’ వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌ను నిర్మించడంతో పాటు, భారతదేశంలోనే అతిపెద్ద యానిమేషన్ చిత్రంగా నిలిచిన ‘మహావతార్ నరసింహ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అలాగే ‘కాంతార’ ఫ్రాంచైజీ ద్వారా భూతకోళ వంటి స్థానిక జానపద కళలు, సాంస్కృతిక సంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేసింది. విభిన్నమైన కంటెంట్‌తో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథలను ప్రోత్సహించాలనే ఆలోచనే హోంబలే ఫిల్మ్స్ ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.

‘మహావతార్ నరసింహ’ అద్భుత విజయానంతరం, భారతీయ నాగరికతలోని జ్ఞానం, విశ్వాసం, సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించే కథలకు హోంబలే ఫిల్మ్స్ మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ‘శరణాగతి’తో సనాతన ధర్మానికి సంబంధించిన లోతైన కథలను సంప్రదాయ కథన పద్ధతులకు భిన్నంగా, ఆధునిక సినిమా సాంకేతికతను ఉపయోగించి యువతరానికి మరింత చేరువ చేయాలనే తమ లక్ష్యాన్ని మరోసారి చాటుతోంది.

1965లో తన 69వ ఏట శ్రీల ప్రభుపాదులు భారతదేశం నుంచి అమెరికాకు ప్రయాణం ప్రారంభించారు. భగవద్గీతలోని శాశ్వతమైన బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో ఆయన ఈ ప్రయాణం చేశారు. తన ఆధ్యాత్మిక గురువైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూర్ ఇచ్చిన ఆదేశాన్ని అనుసరిస్తూ ప్రారంభించిన ఈ ప్రస్థానం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి కృష్ణ చైతన్య సందేశాన్ని చేరవేసే మహోద్యమంగా మారింది. అచంచలమైన విశ్వాసం, సంపూర్ణ శరణాగతి, పట్టుదల, నిస్వార్థ సేవకు శ్రీల ప్రభుపాదుల జీవితం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.

‘శరణాగతి’ చిత్రానికి గౌర శక్తి దాస రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డైవ్ డీప్ AI స్టూడియోతో కలిసి ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సమర్పించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. శ్రీ నరసింహ చైతన్య మఠం, శ్రీరంగపట్నం, ఇస్కాన్ బెంగళూరు, ఇస్కాన్, భక్తివేదాంత బుక్ ట్రస్ట్ (BBT) ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

టైటిల్ ప్రకటనతో ‘శరణాగతి’ ఓ గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణానికి వేదిక సిద్ధం చేసింది. సంపూర్ణ శరణాగతితో సాగిన ఓ మహనీయుడి జీవితాన్ని, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఆయన వారసత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది. శ్రీల ప్రభుపాదుల వ్యాస పూజ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని 2027 ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.