Skip to content

ఇండియా జాయ్ 2026 విజయానికి తెలుగు చిత్ర పరిశ్రమ సహకారం: దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇండియాజాయ్ – చిత్రరంగ కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని బుధవారం నాడు నిర్వహించింది. డిసెంబర్ 7 నుండి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఇండియాజాయ్ 2026కు ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమను, ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమను ఒకచోట చేర్చింది. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ నుంచి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డి. సురేష్ బాబు, ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్, వి. ఎన్. ఆదిత్య, ప్రెసిడెంట్, డైరెక్టర్స్ అసోసియేషన్, డాక్టర్. మాదాల రవి, వైస్ ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), హరీష్ శంకర్, రాహుల్ రవీంద్రన్, సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో..

దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘ఇండియా జాయ్ గ్లోబల్ సమ్మిట్‌ని సక్సెస్ చేయడం సీఎం గారి ఆకాంక్ష. మా తెలుగు పరిశ్రమ ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడం కోసం సహకరిస్తుంది. అందులో భాగంగా మా పరిశ్రమలోని వివిధ విభాగాలను చెందిన ప్రముఖులందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు చిత్ర సీమని గ్లోబల్ స్థాయికి తీసుకు రావాలని సీఎం గారు ప్రణాళికలు రచిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సమ్మిట్ సక్సెస్ చేయడానికి మా వంతుగా కృషి చేస్తామ’ ని అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. ఇక్కడి ప్రభుత్వాలు తెలుగు సినిమా పరిశ్రమను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. గ్లోబల్ లెవెల్‌కి మన పరిశ్రమను తీసుకు వెళ్లాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచనలు చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఇండియా జాయ్‌లో కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా అతిథులు పాల్గొన్నారు. నెట్ ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డినెగ్, ఈఏ స్పోర్ట్స్, యుబిసాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ ఇతర గ్లోబల్ బ్రాండ్‌లకు సంబంధించిన ప్రతినిథులు విచ్చేశారు. ఈ కార్యక్రమం వందకు పైగా గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నేషనల్ స్టూడియోలను ఒక చోటకు చేర్చింది. ఈ ఇండియా జాయ్‌లో భాగంగానే వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ది ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ది ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్ అండ్ ది హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కూడా జరగున్నాయి.

అంతే కాకుండా డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ ఈవెంట్, డిసెంబర్ 9న కాన్సర్ట్ ఎరీనా ఈవెంట్‌ని ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ అధికారులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.

Telangana Government and India Joy Film Sector Join Hands for invest telangana Global Summit 2026 (Video) – https://www.transfernow.net/dl/20261117HnNNHFnc

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.