Skip to content

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: షిరాజ్ మెహదీ

▪️చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపుపై ప్రత్యేక విధానం తీసుకురావాలి
▪️తెలుగు పరిశ్రమలో చిన్న నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ సరైన సహకారం అందించడం లేదు
▪️సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి

▪️సినిమా నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. శాంతియుతంగా పోరాడాలి: షిరాజ్ మెహదీ

హైదరాబాద్ :
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రాలు ఎదుర్కొంటున్న థియేటర్ల కొరత, విడుదల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థానిక బెంగాలీ సినిమాలకు ప్రైమ్‌టైమ్‌లో తప్పనిసరిగా ప్రదర్శన అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన వివరించారు.

షిరాజ్ మెహదీ మాట్లాడుతూ.. 2012లో ‘పార్సెల్’ సినిమాతో హీరోగా పరిచయమై, నటన, దర్శకత్వం, సంగీతం, పంపిణీ తదితర విభాగాల్లో పనిచేసిన అనుభవం తనకుందని తెలిపారు. కొత్తగా సినిమాలు నిర్మించేవారు కథ, చిత్రీకరణపైనే కాకుండా విడుదల, థియేటర్ వ్యాపారం, మార్కెటింగ్ అంశాలపైనా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ చిన్న నిర్మాతలకు తగిన మార్గదర్శకత్వం, వ్యాపార సహకారం అందించడం లేదని విమర్శించారు. సభ్యత్వ రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, నిర్మాతలు సమస్యల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం లేదని ఆరోపించారు. గత ఏడాదిన్నరగా ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నానని, పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్‌తో పాటు పరిశ్రమలోని పలువురికి న్యాయపరమైన నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. తన పోరాటానికి పలువురు నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారుల మద్దతు లభిస్తోందన్నారు.
సినిమా నిర్మాణంలో నష్టాలు వచ్చినంత మాత్రాన ఎవరూ ఆత్మహత్యలు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో ఏవైనా అన్యాయాలు ఎదురైతే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రెస్‌మీట్ల ద్వారా తమ సమస్యలను వెల్లడించాలని సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని చిన్న సినిమాల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. బెంగాల్ తరహాలో తెలుగు సినిమాలకు థియేటర్లలో ప్రాధాన్యత కల్పించే విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ వ్యవహారాలపై స్పందిస్తూ, పరిశ్రమ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే వారే బాధ్యతల్లో ఉండాలని, సి. కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం:
పశ్చిమ బెంగాల్‌లో ప్రతి సినిమా హాల్‌తో పాటు మల్టీప్లెక్స్‌లోని ప్రతి తెరపై మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య రోజుకు కనీసం ఒక బెంగాలీ సినిమా ప్రదర్శన తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సుల రద్దు వరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయం స్థానిక బెంగాలీ చిత్రాలకు ప్రదర్శన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.