Skip to content

జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం.” -నవీన్‌ పొలిశెట్టి

జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం.”  -నవీన్‌ పొలిశెట్టి Telugu News
జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం.”  -నవీన్‌ పొలిశెట్టి Telugu News

2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాలలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ తాజాగా విడుదలైంది.

‘భీమవరం బల్మా’ గీతావిష్కరణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. యువత కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా ఎద్దుల బండిపై నవీన్ పోలిశెట్టి వేదిక వద్దకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే మీనాక్షితో కలిసి ‘భీమవరం బల్మా’ పాటకు వేదికపై నవీన్ స్టెప్పులేసి అందరిలో ఉత్సాహం నింపారు.

‘భీమవరం బల్మా’ పాటతో నవీన్‌ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం విశేషం. గాయకుడిగా తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. శ్రోతలచే కాలు కదిపించేలా ఆయన స్వరపరిచిన తీరు మెప్పించింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో.. ఎంతో అందంగా, అర్థవంతంగా పాటను రచించారు. నవీన్‌ పొలిశెట్టితో కలిసి గాయని నూతన మోహన్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట.. థియేటర్లలో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

గీతావిష్కరణ వేడుకలో కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. “భీమవరం బల్మా పాట మీ అందరికీ నచ్చిందని అర్థమవుతోంది. ఈ మ్యాజిక్ అంతా మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ గారిదే. ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. నా గత మూడు సినిమాలను మీరు ఎంతగానో ఆదరించారు. ఒక యాక్సిడెంట్ లో గాయాలవ్వడం వలన నేను కొంతకాలం షూటింగ్ కి దూరమయ్యాను. ఆ సమయంలో మిమల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తానని ఆందోళన చెందాను. మీ అందరి ప్రేమ, మద్దతు వల్లే కోలుకొని ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్ చేసి, పండుగకు మీ ముందుకు రాబోతున్నాను. మీ ప్రేమ వల్లే మొదటిసారి పాట కూడా పాడాను. ‘అనగనగా ఒక రాజు’ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఏ కారణాల వల్ల నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో.. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమ కథ అవన్నీ ఇందులో ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి మీ అందరూ ఆశ్చర్యపోతారు. మా నిర్మాతలు నాగవంశీ గారు, చినబాబు గారు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపి, అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి పండుగకు వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ నిజంగానే పండుగ సినిమా అవుతుందని మేమందరం నమ్ముతున్నాము. పండుగకు సినిమా వస్తుంది అంటారు.. కాదు, తెలుగు ప్రేక్షకులకు సినిమానే ఒక పండుగ. ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం.” అన్నారు.

See also  అగ్రహారంలో అంబేద్కర్ అసాధారణ విజయం సాధించాలి!! -"పద్మశ్రీ" మందా కృష్ణ మాదిగ

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “మీ అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకం. మన అందరి ఫేవరెట్ ప్రభాస్ గారి సినిమాతో పాటు, ‘అనగనగా ఒక రాజు’ వస్తున్నాడు. సంక్రాంతి అంటే భీమవరం అంటారు. అలాంటిది సంక్రాంతికి వస్తున్న మా సినిమాలో ‘భీమవరం బల్మా’ పాట ఉండటం, దానిని ఇక్కడ లాంచ్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. నవీన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నవీన్ వన్ మ్యాన్ ఆర్మీ. అద్భుతమైన ప్రతిభ ఉంది. సినిమా కోసం ఎంతో కష్టపడతాడు. మా ఇద్దరి పాత్రలు మీకు నచ్చుతాయి. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది. సంక్రాంతికి థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

నటుడు రంగస్థలం మహేష్ మాట్లాడుతూ.. “పండుగ ఎంత కిక్ ఇస్తుందో, పండుగకి వచ్చే ఈ సినిమా అంత కిక్ ఇస్తుంది. నవీన్ గారు హైపర్ ఎనర్జీతో వన్ మ్యాన్ షో అదరగొట్టారు. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. ఈ పండుగకు మీ అందరినీ నవ్వించడానికి వస్తున్నారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమాకి ఘన విజయం అందిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీస్థాయిలో విడుదల కానుంది.

చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి
ఛాయాగ్రహణం: జె. యువరాజ్
సంగీతం: మిక్కీ జె. మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.